కరోనాపై ప్రభుత్వ నిర్ణయాల అమలును పరిశీలించండి
అధికారులకు సిఎం కెసిఆర్ ఆదేశం
కొవిడ్-19పై ముఖ్యమంత్రి సుదీర్ఘ సమీక్ష
ప్రజాపక్షం / హైదరాబాద్ : కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో స్వయంగా పరిశీలించడానికి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు జిల్లాల్లో పర్యటించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్ అమలు తదితర అంశాల పై ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి ఎం.మహేందర్ రెడ్డి, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంత కుమారి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని సమావేశంలో నిర్ణయించారు. సిఎం ఆదేశం మేరకు సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్‌రెడ్డి, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంత కుమారి, మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ బుధవారం సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు.
సిఎంఆర్‌ఎఫ్‌కు విరాళాలు : కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు సహాయంగా ఉపయోగపడడానికి హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఎవెన్స్ లిమిటెడ్ కంపెనీ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును సంస్థ ఎండి మహిమా దాట్ల, డైరెక్టర్ డాక్టర్ ఇందిరా రాజు మంగళవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు అందించారు.