గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్, స్విగ్గీల్లో మరో 12,400 మందికి ఉద్వాసన
15 రోజుల్లో 24 వేల మంది తొలగింపు
శాన్‌ఫ్రాన్సిస్కో : గడచిన ఆరునెలలుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలలో ప్రారంభమైన ఉద్యోగుల ఉద్వాసనలు మాంద్యం దెబ్బతో మరింత ఉద్ధృతస్థాయిలో కొనసాగుతున్నాయి. తాజాగా ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్‌లో 12,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. అదేవిధంగా స్విగ్గీ సంస్థలో మరో 380 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. వీరందరకీ పింక్ స్లిప్పులు పంచుతున్నారు. 2023వ సంవత్సరం ఐటిరంగంలో ఉద్యోగులకు విషాదకరంగా ప్రారంభం కావడంతో వారిలో ఆందోళన మరింతగా పెరుగుతోంది. ఈ కొత్త ఏడాది మొదటినెల గడచిన 15
రోజులలో ప్రపంచవ్యాప్తంగా 91 కంపెనీల్లో 24,000 మందిని ఉద్యోగాల నుండి తొలగించారు. ఇంతకుముపును ఎన్నడూలేనంత సంక్షోభ పరిస్థితులను ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు. అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి బడా టెక్ కంపెనీల ఉద్వాసనల పరంపర సరసన గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ వచ్చి చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు మందగమనంలో కొనసాగడంతో కంపెనీలు నిలదొక్కుకోలేక ఉద్యోగులపై ప్రతాపం చూపిస్తున్నాయి. అల్ఫాబెట్, గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ ఉద్యోగుల ఉద్వాసనలు ప్రకటించారు. కంపెనీ మార్పులు చేర్పులు చేస్తుందని, ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 10 వేలమందిని తగ్గిసామని చెప్పారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రోజుకు 1,600 మంది ఉద్యోగుల వంతున టెక్ రంగంలో ఉద్వాసనలకు గురి అవుతున్నారు. దీంతో ప్రపంచ మాంద్యం పరిస్థితులను తట్టుకునేందుకు కంపెనీలు తమ ఖర్చులు తగ్గించుకునేందుకు తీసుకునే చర్యలను వేగవంతం చేశాయి. అమెజాన్ సంస్థ ఇప్పటికే 18 వేలమందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సైబర్ సెక్యూరిటీ కంపెనీలు సోఫోస్ 450 మందిని తొలగించింది. ఇక ఫుడ్ దిగ్గజ కంపెనీ స్విగ్గీ కూడా 380 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ కంపెనీ సిఇఓ
శ్రీహర్ష మజేటి కంపెనీలో శుక్రవారంనాడు అంతర్గతంగా ఒక ప్రకటన చేస్తూ, “ఎన్నో విధాలుగా ప్రత్యామ్నాయ అవకాశాలు పరిశీలించిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నాం, తప్పలేదు, 380 మందికి ఉద్వాసన పలుకుతున్నాం, అందుకు విచారిస్తున్నాం” అని పేర్కొన్నారు. కంపెనీ పరోక్ష వ్యయాలను పరిశీలించవలసి ఉందని, భవిష్యత్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కరోనా రెండో తరంగంలో స్విగ్గీ ఫుడ్ బిజినెస్ బాగా పుంజుకుంది. బలపడింది. దాంతో సిబ్బంది సంఖ్యను గణనీయంగా పెంచారు. తర్వాత కొత్త పరిస్థితి ఎదురైంది. గత ఆర్థిక సంవత్సరంలో స్విగ్గీ రూ.3,629 కోట్ల రూపాయల మేరకు నష్టాలు చవిచూసింది. అంతకుముందు 2021లో ఈ నష్టాలు రూ.1,612 కోట్లు కాగా తర్వాత రెట్టింపు అయ్యాయని మాజేటి చెప్పారు. గత ఏడాది జనవరిలో స్విగ్గీ 700 మిలియన్ డాలర్లు రుణం తీసుకుంది. ఇవన్నీ ఇప్పుడు భారాలుగా మారాయి.
కాగా ఇటీవల ఇప్పటికే టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరో 10 వేలమంది ఉద్యోగులపై వేటు వేస్తున్నట్టు ప్రకటించింది. వారందరికీ త్వరలో పింక్ స్లిప్పులు ఇస్తారు. మైక్రోసాఫ్ట్‌లో 5 శాతం ఉద్యోగులపై వేటు పడుతుంది. కంపెనీ సిఇఓ సత్య నాదెళ్ళ ఈ విషయం వెల్లడించారు. ఉద్యోగులకు 60 రోజులు ముందుగా నోటీసు పీరియడ్ ఇస్తారు. గడచిన 47 ఏళ్ళ చరిత్రలో చాలా కష్టకాలాన్ని ఇప్పుడు ఎదుర్కొంటున్నామని ఆయన అన్నారు. 2023 మూడో త్రైమాసికం నాటికి అంటే సెప్టెంబరు నాటికి మా ఉద్యోగులలో 10 వేలమందిని క్రమంగా తగ్గించే ప్రక్రియ పూర్తి అవుతుంది, ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే ఆర్థికమాంద్యం ఏర్పడింది, మరికొని చోట్ల ఈ పరిస్థితి ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉంది” అని ఆయన అన్నారు. గడచిన ఆరునెలలుగా ఈ రంగంలో దిగ్గజాలుగా ఉన్న కంపెనీలు మాంద్యం ప్రభావానికి గురికావడంతో ఉద్యోగుల సంఖ్యను విడతలవారీగా గణనీయంగా తగ్గించుకుంటున్నాయి. ఈ విధంగా తగ్గించే క్రమంలో అమెరికా, యూరప్‌లలో భారతీయ ఉద్యోగులే ఎక్కువగా నష్టపోతున్నారు. గడచిన నవంబరులో మెటా, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లు వేలాదిమందిని అంటే తమ ఉద్యోగులలో 13 శాతంమందిని తొలగించారు. మాద్యం, ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో వడ్డీరేట్లు బ్యాంకులు పెంచేయడంతో తగ్గుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీలు ఉద్వాసనల పేరుతో ఖర్చులు తగ్గించుకుంటున్నాయి.
ఉద్యోగ సంక్షోభం
RELATED ARTICLES