ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ
త్వరలోనే 15వేల పోలీసు ఉద్యోగాలు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన
కొత్తగా ఎంపికైన స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేత
ప్రజాపక్షం/హైదరాబాద్ ఉద్యోగ నియామకాలను చూసి ఫామ్‌హౌస్‌లో ఉన్నవారు కుళ్లుకున్నా, వారికి కుడపులో దుఃఖం పొంగుకొచ్చినా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఆగబోదని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ ఎంపి గా ఓడిపోయిన కవితకు వెంటనే ఎంఎల్‌సి ఉద్యో గం కల్పించిన కెసిఆర్, స్టాఫ్ నర్సులకు మాత్రం ఉద్యోగాలను భర్తీ చేయాలన్న ఆలోచన రాలేదని దుయ్యబట్టారు. మోసం చేసిన వారి ఉద్యోగాలను ఊడగొట్టినందుకే ‘మీకు’ (స్టాఫ్ నర్సులు) ఉద్యోగాలు వచ్చాయన్నారు. పేద వర్గాలకు స్టాఫ్‌నర్సు ఉద్యోగాలను భర్తీ చేస్తుంటే, వారికి ఉద్యోగాలు అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతున్న హరీశ్‌రావును పిలిచి గడ్టి పెట్టాలని కెసిఆర్‌కు సూచించారు. సంవత్సరంలోపు ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను, త్వరలోనే 15వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీనిచ్చారు. త్వరలోనే టిఎస్‌పిఎస్‌సి ద్వారా నియామకాలను చేపట్టనున్నట్టు వెల్లడించా రు. హైదరాబాద్‌లోని ఎల్.బి స్టేడియంలో బుధవారం ఏర్పాటు చేసిన సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనర్సింహ్మ, మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, కొండా సురేఖ, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్‌రెడ్డి, వేణుగోపాల్, ఎంఎల్‌ఎలు మందుల సామ్యల్, నాగరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ జొంగ్టుతో కలిసి కొత్తగా ఎంపికైన స్టాఫ్ నర్సులకు సిఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తాము ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తుంటే తమ ప్రభుత్వంపైన మాజీ మంత్రి హరీశ్ రావు శాపనార్ధాలు పెడుతున్నారని, ఆయన పిల్లి శాపనార్ధాలకు ఉట్టి తెగిపడదని ఎద్దేవా చేశారు అవాకులు చెవాకులు పేలడం కాదని, ఒక్కసారి ఇక్కడున్న పేదల బిడ్డల కళ్లలో ఆనందం చూడాలన్నారు. కోర్టు అడ్డంకులను తొలగించి ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించామన్నారు. విద్యార్థుల త్యాగాల మీద ఏర్పడిన తెలంగాణలో పదేళ్లుగా గత ప్రభుత్వం యువత ఆకాంక్షలు నెరవేర్చలేదని విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడిన యువతపై గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం కేసులు పెట్టి వేధించిందన్నారు. కేవలం సిఎం కెసిఆర్ తన కుటుంబం గురించే మాత్రమే ఆలోచించారని, నిరుద్యోగులను ఉద్యోగాలపై ఆలోచన చేయలేదని చెప్పారు.పదేళ్ల గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఓరిగిందేమీ లేదన్నారు. తమ కుటుంబ సభ్యులకు పదవుల గురించి తప్ప రాష్ట్రంలోని నిరుద్యోగులకు న్యాయం చేయాలనే ఆలోచనను గత ప్రభుత్వం చేయలేదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసేందుకు కారణం నిరుద్యోగ యవుతీయువకులేనన్నారు.
ఆర్థిక వ్యవస్థను చిధ్రం చేసిన బిఆర్‌ఎస్
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఛిద్రం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ నర్సుల నియామకాలతో నెలకు రాష్ట్ర ప్రభుత్వంపైన రూ. 500 కోట్ల భారం పడుతున్నప్పటికీ ఆర్థిక పరిస్థితులను అధిగమించి పైసా పైసా పొగు చేస్తూ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుంటున్నామన్నారు. ప్రతి పైసాను ప్రజల కోసం ఖర్చు చేసేందుకు అకుంఠిత దీక్షతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశ్వీర్వదిస్తే, అందరూ కష్టపడి పనిచేస్తామని అన్నారు. తెలంగాణ నిరుద్యోగ యువతీ, యువకుల కలలను నిజం చేయాలని పార్లమెంట్‌లో సంఖ్యాబలం లేకపోయినా అన్ని పక్షాలను ఒప్పించి, మెప్పించి, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ కృతజ్ఙతలు తెలిపారు. మంత్రి దామోదర రాజనర్సింహ్మ మాట్లాడుతూ వైద్య శాఖలో ఖాళీగా ఉన్న వేల పోస్టులను కూడా భర్తీ చేయబోతున్నామన్నారు. నర్సింగ్ అంటేనే కేర్ టేరర్ అని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మందులతో పాటు మానసికంగా ప్రత్యేక శద్ధ్రపెట్టాలని స్టాఫ్ నర్సులకు సూచించారు. విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయం, ఉపాధి అవకాశాలను ప్రధాన అంశాలుగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ విమర్శించేవారిని పట్టించుకోకుండా ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుమాట్లాడుతూ కొత్తగా నియమితులైన స్టాఫ్‌నర్సులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ స్టాఫ్ నర్సులు అంటే తల్లి తర్వాత తల్లి లాంటి వారన్నారు.
ఉద్యోగాల భర్తీ ఆగదు
RELATED ARTICLES