ఉద్రిక్తతలకు దారితీసిన ‘ప్రగతి భవన్ ముట్టడి’
ఇందిరాపార్కు వద్ద అడ్డుకున్న పోలీసులు
ఎఐఎస్‌ఎఫ్, ఎఐవైఎఫ్ కార్యకర్తల అరెస్టు
ప్రజాపక్షం/హైదరాబాద్
ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని, ప్రభుత్వరంగ విద్యావ్యవస్థను పరిరక్షించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్‌ఎఫ్), అఖిల భారత యువజన సమాఖ్య (ఎఐవైఎఫ్) రాష్ట్ర కమిటీలు తలపెట్టిన ‘చలో ప్రగతి భవన్’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద మంగళవారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముందుగా ఇందిరా పార్కు వద్ద సభ నిర్వహించారు. తమ డిమాండ్ల అమలు కోసం ‘చలో ప్రగతి భవన్’ కార్యక్రమం నిర్వహించారు. ఇందిరా పార్కు నుంచి ప్రగతిభవన్ వైపు వెళ్తున్న విద్యార్థులు, యువకులు, నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తొపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులు, యువకులు, నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్‌లకు తరలించారు.
రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోంది…
బలిధానాలతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగం తాడవిస్తుందని ఎఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్, ఎఐఎస్‌ఎఫ్ ప్రధాన కార్యదర్శి రావి శివ రామకృష్ణ అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నియామకాల కోసం నోటిఫికేషన్ జారీ చేస్తామని సిఎం కెసిఆర్ ప్రకటనలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలుచేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయాలని అనిల్, శివ రామకృష్ణలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థి, యువకుల త్యాగాలతో అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ పార్టీ… మొదటి అసెంబ్లీ సమావేశంలో రాష్ట్రంలో లక్షా ఏడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని స్వయంగా సిఎం కెసిఆర్ ప్రకటించినా.. ఇప్పటి వరకు అతీగతి లేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలపై నిరుద్యోగులను ఆందోళనకు గురిచేసేలా ప్రభుత్వం పూటకోక మాట మాట్లాడుతుందని దుయ్యబట్టారు. 2020 డిసెంబర్‌లో బిస్వాల్ కమిటీ ఇచ్చిన పిఆర్‌సి నివేదిక ప్రకారం 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు అధికారికంగా స్పష్టమైందన్నారు. బిస్వాల్ కమిటీ నివేదిక ఉండగానే కొత్త లెక్కలతో అయోమాయానికి గురి చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కొత్తగా 50 వేల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటనకే పరిమితమైందన్నారు. 2018 నుంచి ఇప్పటి వరకు మొత్తం 52,515 మందిని ఉద్యోగాల నుంచి ప్రభుత్వం తొలగించిందని అనిల్ కుమార్, శివ రామకృష్ణ మండిపడ్డారు. ఉన్నఫలంగా ఉద్యోగాల నుంచి వారిని తొలగించడంతో రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించి ఏడు నెలలు అయినా, ఎంఎల్‌సి ఎన్నికల్లో ప్రచారం చేసుకొని లబ్ధిపొందిన టిఆర్‌ఎస్ సర్కార్… ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలపై స్పష్టత వచ్చినా, జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదముద్ర వేసినా రాష్ట్ర సర్కార్ కొలువుల భర్తీ నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఒక్క పాఠశాలను మూసివేసినా తగిన గుణపాఠం తప్పదు…
రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేసేందుకు టిఆర్‌ఎస్ సర్కార్ కుట్రలు చేస్తుందని అనిల్ కుమార్, శివరామకృష్ణ విమర్శించారు. పాఠశాలలను మూసివేసే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్క పాఠశాలను మూసివేసినా ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు. ప్రభుత్వ విద్యను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా పాఠశాలల్లో విద్యార్థులు లేరనే సాకుతో ఏడు వేల ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వ విద్య పరిరక్షణ, ఉద్యోగాల నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్‌ను వెంటనే విడుదల చేసేంతవరకు విద్యార్థి, యువజన పోరాటాలు ఉధృతంగా కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని అనిల్, శివ రామకృష్ణ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ వలి ఉల్లా ఖాద్రి, ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ స్టాలిన్, విద్యార్థి, యువజన సంఘం నాయకులు కె.శంకర్, టి.వెంకటేశ్వర్లు, పి.సురేష్ ఎన్.శ్రీకాంత్, డి.రాము, మహేందర్, పుట్ట లక్ష్మణ్, బరిగల వెంకటేశ్వర్లు, హరికృష్ణ, గ్యార నరేష్, సత్య ప్రసాద్, ధర్మేంద్ర, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగాల భర్తీ,ప్రభుత్వ విద్య పరిక్షణకు ఉద్యమించిన యువత
RELATED ARTICLES