నిరుద్యోగుల బలహీనతను సొమ్ము చేసుకున్న గ్యాంగ్
25 మంది బాధితుల నుంచి సుమారు రూ.1.60 కోట్లు వసూలు
ప్రజాపక్షం/మిర్యాలగూడ విద్యాబుద్దులు నేర్పిన గురువులే డబ్బుపై అత్యాశతో ఆడంబరాల కోసం వక్రబుద్దిని ప్రదర్శించారు. ఒక్కరోజులోనే ధనవంతులం కావాలనే దుర్భుద్దితో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి వారిని మోసం చేసిన సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మంగళవారం వెలుగు చూసింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడలోని ఈదులగూడలో నివాసముంటున్న ఉమ్మడి వెంకట్‌రెడ్డి 2017లో నాగార్జున ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ అధ్యాపకుడిగా పనిచేస్తున్నప్పుడు పట్టణ, పరిసర ప్రాంతాలకు చెందిన కొంతమంది నిరుద్యోగులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించబడుతున్న ఎస్‌టిబిసి సంస్థ ఆధీనంలోనున్న పలు ఎయిడెడ్ స్కూల్స్, కాలేజీల్లో పోస్టులున్నాయని 25 మందిని నమ్మించాడు. అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రత్యేక ఎయిడెడ్ పోస్టుల భర్తీ జీఓను చూపి నిరుద్యోగులకు ఆశను కల్పించాడు. ఈ సంస్థ ఎడ్యుకేషనల్ చైర్మన్‌గా చెప్పబడిన సిహెచ్.అంజనాప్రసాద్ ద్వారా మీ అందరికీ ఒంగోలు, కర్నూలు, బాపట్ల, మార్కాపురంలలో ఉన్న కాలేజీల్లో ఉద్యోగాలిప్పిస్తానని నమ్మించాడు. ఇందుకు గాను ఒక్కొక్కరి వద్ద రూ.5 లక్షల నుంచి రూ.12 లక్షల వరకూ మొత్తం 25 మంది ద్వారా సుమారు రూ.1.60 కోట్లు వసూలు చేశారు. ఆ తర్వాత 2017 జులైలో పోస్టు ద్వారా సంస్థ పేరుతో 25 మందికి ఆర్డర్ కాపీలను పంపించాడు. ఈ ఆర్డర్ కాపీ ప్రకారం అక్టోబర్ 3వ తేదీన సంబంధిత ప్రాంతాల్లో ఉన్న కాలేజీల్లో చేరాలని తెలిపారు. కానీ అక్టోబర్ 1న తిరిగి పోస్టు ద్వారా ‘ఎయిడెడ్ కాలేజీలో కొన్ని సమస్యలున్నాయి. మీ జాయినింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశాం’ అని మరో ఆర్డర్ కాపీని పంపించారు. అప్పటి నుంచి దాదాపు ఐదు సంవత్సరాల వరకూ ఇదిగో..అదిగో అంటూ కాలయాపన చేస్తూ నిరుద్యోగులను నమ్మిస్తూ వచ్చారు. 2021 మే నెలలో బాధితుంలందరూ అంజనా ప్రసాద్‌ను, వెంకట్‌రెడ్డిని గట్టిగా నిలదీయడంతో వీరిద్దరి స్నేహితుడైన విజయరామరాజు ‘తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి. 2021 సెప్టెంబర్ వరకూ చూడండి. లేకపోతే అక్టోబర్ 10 నాటికి మీరిచ్చిన డబ్బులు తిరిగి ఇస్తాం’ అని హామీనివ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు. అయితే ఇచ్చిన గడువు తేదీ దాటిన తర్వాత సైతం ఆ వ్యక్తుల నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఆందోళన చెందిన బాధితులు తమ వద్ద ఉన్న ఆర్డర్ కాపీలు నిజమా? కాదా? అని తెలుసుకునేందుకు ఎస్‌టిబిసి సంస్థను, ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో విచారణ చేయగా అవి నకిలీ ఆర్డర్ కాపీలని, అంజనాప్రసాద్ లాంటి వ్యక్తి తమ సంస్థలో లేడని తెలపడంతో బాధితులు తాము మోసపోయామని గ్రహించారు. తమను మోసం చేశారని కొంతమంది బాధితులు 11న మిర్యాలగూడ టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని వెంటనే రంగంలోకి దిగిన పోలీసు సిబ్బంది ప్రత్యేక టీమ్ ద్వారా ప్రస్తుతం మెదక్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎయిడెడ్ లెక్చరర్‌గా పనిచేస్తున్న ఉమ్మడి వెంకట్‌రెడ్డిని పట్టుకోవడంతో పాటు, మధ్యవర్తిగా వ్యవహరించిన కామారెడ్డిలో నివాసముంటున్న విజయరామరాజులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఇందులో ప్రధాన నిందితుడైన అంజనాప్రసాద్ పరారీలో ఉన్నట్లు టూటౌన్ సిఐ సురేష్‌కుమార్ తెలిపారు. కాగా 25 మంది బాధితుల్లో ఒకరైన వెంకటేశ్వర్‌రెడ్డి కొన్నిరోజుల కింద ఆత్మహత్యకు సైతం పాల్పడ్డాడు. అదే విధంగా సూర్యాపేట జిల్లా కోదండ కేంద్రంగా ఆ వ్యక్తులు 11 మంది నిరుద్యోగుల నుంచి సుమారు రూ.60 లక్షలు వసూలు చేశారు. వారు కూడా మోసపోయామని గ్రహించి ఇటీవల అక్కడి పోలీసులను ఆశ్రయించడం గమనార్హం.
ఉద్యోగాలను ఇప్పిస్తామంటే : డిఎస్‌పి వెంకటేశ్వర్‌రావు
‘ఉద్యోగాలిప్పిస్తామని ఎవరైనా మీ వద్దకు వచ్చి నమ్మించి డబ్బులు అడిగితే వారిని నమ్మొద్దు. అలాంటి వారి వివరాలను మాకు తెలియజేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. నిరుద్యోగుల బలహీనతలను ఆసరాగా చేసుకుని కొంత మంది మోసగాళ్లు ఉద్యోగాలను ఎరగా వేస్తారు. అలాంటి మాటలను నమ్మకుండా మాకు సమాచారం అందించాలి. సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం’ అని డిఎస్‌పి వెంకటేశ్వర్‌రావు చెప్పారు.
ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం
RELATED ARTICLES