నేడు జాతీయ జెండాలు ఆవిష్కరించి డిమాండ్స్‌డేగా జరుపుకోవాలి
4 గంటలకు వామపక్షాల ఆన్‌లైన్ బహిరంగసభను జయప్రదం చేయాలని సిపిఐ కార్యదర్శివర్గం పిలుపు
ప్రజాపక్షం / హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ నినాదాలు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందున తెలంగాణ రాష్ట్ర ఏడవ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న జాతీయ జెండాలు ఆవిష్కరించి డిమాండ్స్‌డేగా జరుపుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గం పిలుపునిచ్చింది. వివిధ సమస్యలపై మంగళవారం నుండి జూన్ 10వ తేదీ వరకు వరుసగా నిరసన కార్యక్రమాలను ప్రకటించింది. కరోనా లాక్‌డౌన్ నేపథ్యలో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదివారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం జరిగింది. మఖ్దూంభవన్‌లో సిపిఐ కేంద్ర కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్‌పాషాతో కలిసి సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కార్యదర్శివర్గ సమావేశ నిర్ణయాలను వెల్లడించారు. జూన్ రెండు డిమాండ్స్‌డే పేరుతో అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించి, ఉద్యమ నినాదాలను గుర్తు చేయాలన్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోషల్ మీడియా ద్వారా జరిగే ఆన్‌లైన్ బహిరంగ సభను సభ్యులంతా ఆన్‌లైన్‌లో చూసి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జూన్ 3న విద్యుత్ సవరణ బిల్లు- 2020 ద్వారా విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేట్‌పరం చేయడాన్ని, రాష్ట్ర ప్రభుత్వ హక్కులను హరించడాన్ని, అదే విధంగా కేంద్రం రాష్ట్రాలకు చెల్లించాల్సిన జిఎస్‌టి బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్రానికి లేఖలు రాయాలని నిర్ణయించామన్నారు. కేంద్ర ప్రభు త్వం కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో వలస కార్మికులను, అసంఘటితరంగ కార్మికులను, రైతులను ఆదుకోవటంలో పూర్తిగా వైఫ ల్యం చెందినందున జూన్ 4వ తేదీన నల్లబాడ్జీలు ధరించి అన్ని చోట్లా కూడళ్ళవద్ద నిరసన తెలపాలని సిపిఐ శ్రేణులను కోరారు. కరోనా సహాయక చర్యల్లో భాగంగా జూన్ నెలలో కూడా నిరుపేదలకు బియ్యం, డబ్బులు అందించాలని, రేషన్ కార్డులు ఉన్నవారు గతంలో ఒక నెల, రెండు నెలలు తీసుకోలేదన్న నెపంతో వారికి బియ్యం, డబ్బులు, ఇవ్వలేదని, కార్డులు ఉండి గతంలో రేషన్ తీసుకోలేకపోయిన వారికి, అసలు ఏ కార్డు లేని నిరుపేదలు ఉన్నచో వారికి కూడా విధిగా బియ్యం, ఆర్థిక సహాయం అందించాలని, భవన నిర్మాణ కార్మికులకు భవన నిర్మాణ సంక్షేమ నిధి నుండి విధిగా ఆర్థిక సహాయం రూ. 5,000 అందించాలని, కేరళ రాష్ట్రంలో మాదిరిగా అసంఘటిత కార్మికులకు, చిరు వ్యాపారస్తులకు రూ. 7,500 ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ జూన్4వ తేదీన నిరసన తెలియజేయాలన్నారు.
కృష్ణా ప్రాజెక్టుల ఆలస్యంపై నిరసనలు
కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు కేటాయించిన నిఖర జలాలను వినియోగించుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. దక్షిణ తెలంగాణ లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం నత్తనడకన సాగుతున్నాయని, దాదాపు అన్ని ప్రాజెక్టులు అసంపూర్తిగానే ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డిండి ఎత్తిపోతల పథ కం, పాలమూరు- ఎత్తిపోతల ప్రాజెక్టులకు కూడా నిధులు విడుదల చేయకపోవటం దుర్మార్గమన్నారు. ఎపి ప్రభుత్వం ఇదే అదునుగా భా వించి మే 5వ తేదీన 203 జిఓ తెచ్చిందని, దీని ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు నుండి పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుండి 80 వేల క్యూసెక్కులకు పెంచాలని నిర్ణయించిందన్నారు ఈ జిఒను ఉపసంహరించుకోవాలని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 6వ తేదీన నల్లగొండ, సూర్యాపేట, జూన్7వ తేదీన ఖ మ్మం, జూన్8వ తేదీన మహబూబ్‌నగర్, జూన్9వ తేదీన రంగారెడ్డి జిల్లాల్లో సదస్సులు నిర్వహించాలని రాష్ట కార్యదర్శివర్గం నిర్ణయించిందన్నారు. జూన్10వ తేదీన నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబ్‌నగర్, రం గారెడ్డి జిల్లాల్లో విస్తృత స్థాయిలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
రైతు, విద్యార్థి ఉద్యమాలకు మద్దతు
నియంత్రిత వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి రైతులను బెదిరిస్తున్న తరుణంలో రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టే నిరసన కార్యక్రమాలకు, ఉస్మానియా విశ్వవిద్యాలయ భూముల అక్రమ ఆక్రమణలపై విద్యార్థి సంఘాలు నిర్వహించే ఆందోళనలకు సిపిఐ మద్దతు తెలపాలని కార్యదర్శివర్గం నిర్ణయించిందని చాడ వెంకట్‌రెడ్డి వెల్లడించారు.
టెస్టులు పెంచండి : అజీజ్‌పాషా
లాక్‌డౌన్ పెట్టినా కూడా కోవిడ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోందని అజీజ్ పాషా అన్నారు. గతంలో స్పానిష్ ఫ్లూ సమయంలో కూడా రెండవ దశ లాక్‌డౌన్‌లో వెసులబాటు ఇవ్వడంతో వ్యాధి ప్రబలి 30 కోట్ల మందికి సోకగా, 5 కోట్ల మంది మరణించారన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం టెస్టుల సంఖ్య పెంచాలని, ప్రజలకు సరిగా మార్గ నిర్దేశనం చేయాలని సూచించారు. వరవరరావుకు బెయిల ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఉద్యమ నినాదాలు నెరవేర్చడంలో కెసిఆర్ ప్రభుత్వం వైఫల్యం
RELATED ARTICLES