హైదరాబాద్ : కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, టిజెఎస్ల కూటమి ఉమ్మడి ఎజెండాను శనివారం ఆవిష్కరించింది. కూటమికి పీపుల్స్ ఫ్రంట్‌గా, ఉమ్మడి ఎజెండాకు పీపుల్స్ ఫ్రంట్ ఉద్యమ ఆకాంక్షల ఎజెండాగా నామకరణం చేసింది. ప్రొఫెసర్ కోదండరామ్ కన్వీనర్‌గా, ఇతర మూడు పార్టీల అధినేతలు సభ్యులుగా పీపుల్స్ ఫ్రంట్ ఎజెండా అమలు కమిటీ ఏర్పాటైంది. ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కోదండరామ్ నేతృత్వంలో చట్టబద్ధమైన కేబినెట్ హోదాతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని ఫ్రంట్ నిర్ణయించింది. టిపిసిసి అధ్యక్షులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ, టిజెఎస్ రాష్ట్ర అధ్యక్షుల ఎం.కోదండరామ్, సిపిఐ ఇన్చార్జ్ రాష్ట్ర కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డిలు హైదరాబాద్‌లోని హోటల్ గోల్కొండలో ఉమ్మడి ఎజెండాను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, టిడిపి, టిజెఎస్, సిపిఐ ఏర్పాటు చేసిన కూటమిని పీపుల్స్ ఫ్రంట్ (ప్రజా ఫ్రంట్)గా నామకరణం చేశామని ప్రకటించారు. నాలుగు పార్టీలు అంగీకరించిన కనీస ఉమ్మడి కార్యక్రమాన్నే తాము పీపుల్స్ ఫ్రంట్ ఎజెండాగా విడుదల చేశామన్నారు. ఇది నాలుగు పార్టీల మధ్య ఉమ్మడి విధాన పత్రమని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా, ఏ పార్టీ నుండి ముఖ్యమంత్రి అవుతారనే అంశంతో సంబంధం లేకుండా ప్రభుత్వం పీపుల్స్ ఫ్రంట్ ఎజెండాను నూటికి నూరు శాతం అమలు చేస్తుందని స్పష్టం చేశారు. ఇది యుపిఏకు కనీస ఉమ్మడి ప్రణాళిక లాంటిదని, ఒక దిక్సూచీ పత్రం అని వివరించారు. ప్రభుత్వం వచ్చాక ఉమ్మడి ఎజెండా అమలుకు కోదండరామ్ అధ్యక్షతన క్యాబినెట్ హోదా కలిగిన చట్టబద్ధమైన కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీనికి అదనంగా సాధ్యమైనంత వరకు పార్టీల మ్యానిఫెస్టోలను అమలు చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరేలా నాలుగు పార్టీల మ్యాని ఫెస్టోలు ప్రతిబింబించేలా ఉమ్మడి ఎజెండాను రూపొందించినట్లు ఎల్.రమణ తెలిపారు. దీనిని వివిధ రంగాల నిష్ణాతులు, ఆర్థిక రంగ నిపుణులతో సమగ్రంగా చర్చించి, తెలంగాణ రాష్ట్రంలో అన్ని పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేసి రూపొందించామన్నారు. ఆమోదయోగ్యమైన పథకాలు, బడ్జెట్లో ఆచర ణాత్మకంగా అమలు చేయదగినవే ప్రజల ముందుంచామని చెప్పారు. ఈ ఎజెండాకు తోడుగా తమ పార్టీల మ్యానిఫెస్టోలోను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో టిఆర్ఎస్ చాలా ఆకర్షణీయమైన ఎన్నికల హామీ లు ప్రకటించారని, అవి అమలు కాకున్నా నూటికి నూరు శాతం అమలు చేశామని కెసిఆర్ చెప్పుకున్నారని విమర్శించారు. తాము అలా కాకుండా ఐదేళ్ళలో అమలు చేసే అంశాలతో ఉమ్మడి ఎజెండాను రూపొంది ంచామని, ప్రజలకు జవాబుదారీగా ఉండేలా వాటి అమలుకు కమిటీ వేసి,కన్వీనర్‌ను కూడా నియమించు కున్నామని తెలిపారు. అనేక పర్యాయాలు ఎన్నికల ఒప్పందంతో పోటీ చేసినప్పటికీ, ఇలా ఉమ్మడి ఎజెండా, కమిటీ వేయడం ఇదే మొట్టమొదటి సారి అని చెప్పారు. ఇందులో పొందుపర్చుకున్న ప్రస్తుత సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, ఇతర పథకాలను అమలు చేస్తామని వివరించారు. ప్రభుత్వం ఏర్పాటుకు ముందు మరోసారి ఉమ్మడి ఎజెండాకు మరికొన్ని అంశాలను చేర్చి ప్రజల ముందు పెడతామన్నారు.
ప్రధానాంశంగా అవినీతి నిర్మూలన
పీపుల్స్ ఫ్రంట్ ఉద్యమ ఆకాంక్షల ఎజెండాను అమలు కమిటీ కన్వీనర్ కోదండరామ్ వివరించారు.“అందరికీ భాగస్వామ్యం,అభివృద్ధిలో వాటా” అనే నినాదంతో తాము ముందుకెళ్తున్నామని, ఇందుకు ప్రజా స్వామిక పాలన కీలకమని ఆయన అన్నారు. అవినీతి నిర్మూలన ప్రధాన అంశంగా ఉంటుందన్నారు. ఎన్నికల సమయంలో మరిన్ని సూచనలు, సలహాలు వస్తే వాటిని కూడా ఉద్యమ ఆకాంక్షల ఏజెండాలో జోడిస్తామని తెలిపారు. డిసెంబర్ 11నతమ ప్రభుత్వం ఏర్పడబోతుందని, అప్పటి వరకు వచ్చే మరిన్ని సూచనలు సలహాలను కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఈ ఏజెండాను అమలు చేసేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.అన్ని వర్గాలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. సంక్షేమ పథకాలను నిర్లక్షం చేయకుండా వాటిని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు పౌర సేవల చట్టాన్ని బలోపేతం చేస్తామని హామీనిచ్చారు. పెన్షన్‌ను పొందడం ఒక హక్కుగా భావించి అందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.ప్రస్తుతం చిన్నాభిన్నమైన వ్యవస్థలను కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆర్థికాభివృద్ధి హైదరాబాద్ కేంద్రంగా జరుగుతుందని, జిల్లాల అభివృద్ధికి చర్య తీసుకుంటామని చెప్పారు. వ్యవసాయం, సాంప్రదాయ కుటీర పరిశ్రలమను, భారీ పరిశ్రమలను విస్తరించాల్సిన అవసరం ఉన్నదన్నారు.
ఉద్యమ ఆకాంక్షలే ఎజెండా
RELATED ARTICLES