నిర్మాణ మహాసభలో చాడ ఉద్బోధ
బొమ్మగాని కిరణ్‌కుమార్
కామ్రేడ్ గుర్రం యాదగిరిరెడ్డి ప్రాంగణం(మంచిర్యాల): కేంద్రంలో బిజెపి ప్రభుత్వ తిరోగమన ఆర్థిక, మతతత్వ విధానాలను, ఇటు రాష్ట్రంలో సిఎం కెసిఆర్ ఎన్నికల హామీల అమలు వైఫల్యాలను ఎండగట్టేందుకు విస్తృత ఉద్యమాలను నిర్మిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రకటించారు. పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవడంతో పాటు సైద్ధాంతిక అవగాహన పెంపొందించేందుకు ఏప్రిల్, మే మాసాల్లో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తామని చెప్పారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలని సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌లను ఉపసంహరించుకోవాలని డిమాం డ్ చేస్తూ ఇతర వామపక్షాలు, ప్రజాసంఘాలతో కలిసి భగత్‌సింగ్ వర్ధంతి రోజు మార్చి 23న హైదరాబాద్‌లో లక్ష మందితో బహిరంగ సభను నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే టిఆర్‌ఎస్ ఎన్నికల హామీల అమలుపై మార్చి నెలలోనే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ఉద్యమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. మంచిర్యాలలోని కామ్రేడ్ గుర్రం యాదగిరిరెడ్డి ప్రాంగణం (పద్మనాయక కళ్యాణ మండపం)లోని కామ్రేడ్ సి.రాఘవచారి హాల్‌లో మూడు రోజుల పాటు జరిగిన సిపిఐ రాష్ట్ర నిర్మాణ మహాసభలు సోమవారం ముగిశాయి. మహాసభలో ముసాయిదా రాజకీయ నిర్మాణ నివేదికలపై రెండు రోజులు జరిగిన చర్చకు చాడ వెంకట్‌రెడ్డి సమాధానం ఇవ్వడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు. సిఎం కెసిఆర్ కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్‌నే చూపిస్తూ ఇతర ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదని, ఇతర ఎన్నికల హామీలను కూడా పక్కన పెట్టారని ఆయన విమర్శించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, లక్ష రూపాయల రైతు రుణమాఫీ, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, రిజర్వేషన్లు లాంటి అంశాలు ఏ మాత్రం ముందుకు సాగడం లేదన్నారు. టిఆర్‌ఎస్ అప్రజాస్వామికంగా వ్యవహారిస్తోందని, సిఎం కనీసం ప్రాతినిధ్యానికి కూడా అవకాశం ఇవ్వడం లేదని, ఏకపక్ష నియంతృత్వ ధోరణితో ఉన్నారని చెప్పారు. ప్రజా ఉద్యమాలను నిరంకుశంగా అణచివేస్తూ ఆధునిక నిజాం నవాబును తలపిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజైన్ లేకుండానే సచివాలయాన్ని ఖాళీ చేశారని, ఏ మంత్రి ఎక్కడున్నారో తెలియని పరిస్థితి నెలకొన్నదని, పరిపాలన ప్రశ్నార్థకంగా మారిందన్నారు. వీటితో పాటు ఎన్నికల హామీల అమలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా, పోడు భూములు వంటి అంశాలపై ఉద్యమాలను ఉధృతం చేస్తామన్నారు.
ఉద్యమాల్లో సిపిఐ ముందంజ
రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చూడాలని సిఎం కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోయి తన ఉనికిని కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి నెలకొన్నదని చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. బిజెపి తామే ప్రతిపక్ష పార్టీ అని చెబుతున్నప్పటికీ ఆ దిశగా ముందుకు సాగడం లేదన్నారు. తెలంగాణలో ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ ఇతర పార్టీలను సమీకరిస్తూ ఉద్యమాలు చేస్తున్న ఘనత సిపిఐదేనని గర్వంగా చెప్పుకోవచ్చన్నారు. ధర్నాచౌక్‌లో ధర్నాలు అనుమతి ఇవ్వకపోతే మఖ్ధుం భవన్‌ను పోరాట కేంద్రంగా మార్చి, ధర్నాచౌక్ పరిరక్షణ ఉద్యమాన్ని చేశామని, ఫలితంగా ధర్నాచౌక్‌లో నేడు ధర్నాలు చేసుకునే పరిస్థితి తిరిగి వచ్చిందని చాడ గుర్తుచేశారు. ఇంటర్ విద్యార్థుల మార్కుల వ్యవహారంలో పోరాడామని, ఆర్‌టిసి ఉద్యోగ సమస్యలకు మద్దతుగా సాంబశివరావు దీక్ష చేశారని, ఈ పోరాటాల ద్వారా సిపిఐ ప్రతిష్ట పెరిగిందన్నారు. ఈ ప్రతిష్ఠను మరింత పెంపొందించుకునేలా స్థానిక సమస్యలను గుర్తించి పోరాటం చేయాని ప్రతినిధులకు ఉద్భోదించారు. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి ఆశించిన ఫలితాలు రానప్పటికీ నిస్పృహ చెందకుండా ముందకు సాగాలని మార్కిజం లెనినిజం అదే సిద్ధాంతమని ఆయన స్పష్టం చేశారు.
వర్గ ధృక్పథం, సామాజిక పొందిక
వర్గధృక్పథంతో పనిచేసే పార్టీ సిపిఐ అని, అదే సమయంలో సామాజిక పొందికలను కూడా పరిగణలోకి తీసుకుని ముందుకు సాగుతుందని చాడ వెంకట్‌రెడ్డి వివరించారు. అయితే, అసలైన లక్ష్యం వర్గపోరాటం అనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కార్యదర్శులుగా బిసిలు-16, ఎస్‌సి-8, ఒసి-5, మైనార్టీలు -4 ఉన్నారని వివరించారు. గ్రామాల్లో తిరుగుతూ స్థానిక సమస్యలు తెలుసుకునేందుకు సామూహిక నిద్ర, ఇంటింటికి సిపిఐ చేపట్టాలని సూచించారు. పార్టీకి ప్రజా సంఘాలు పట్టుకొమ్మలని, అన్ని జిల్లాలు ప్రజా సంఘాలకు కమిటీలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు.
ఉద్యమాలు ఊపిరిగా…
RELATED ARTICLES