HomeNewsBreaking Newsఉద్యమగడ్డపై చరిత్రాత్మక సభ దేశ రాజకీయాల్లో మలుపు

ఉద్యమగడ్డపై చరిత్రాత్మక సభ దేశ రాజకీయాల్లో మలుపు

మీడియా సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్‌
ప్రజాపక్షం/ ఖమ్మం
చైతన్యవంతమైన ఖమ్మం ఉద్యమగడ్డపై ఈనెల 18న భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) చారిత్రాత్మక సభ జరగనుంది. ఈ సభ జాతీయ రాజకీయాలను మలుపు తిప్పనున్నదని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలిపారు. బిఆర్‌ఎస్‌ సభకు నలుగురు ముఖ్యమంత్రులు, సిపిఐ జాతీయ కార్యదర్శి డి. రాజా, సిపిఐ, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం హాజ రుకానున్నారని ఆయన తెలిపారు. సోమవారం ఖమ్మం బిఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్‌రావు మాట్లాడుతూ ఒకప్పుడు బెంగాల్‌ గురించి చెప్పేవారని, ఇప్పుడు తెలంగాణ పథకాల గురించి దేశ ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. రైతుబీమా, రైతుబంధు, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్‌, కంటి వెలుగు, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ వంటి మొదలైన పథకాలు దేశమంతా అమలు కావాలంటే దేశానికి కెసిఆర్‌ నాయకత్వం అవసరమన్నారు. తెలంగాణ పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని హరీష్‌రావు తెలిపారు. కెసిఆర్‌ నాయకత్వం జాతీయ స్థాయిలో బలపడితే తెలంగాణ ప్రజలకు అత్యంత మేలు జరుగుతుందన్నారు. మోడీ ప్రధాని అయిన తర్వాత గుజరాత్‌కు జరిగిన మేలును గమనంలోకి తీసుకోవాలన్నారు. మలిదశ ఉద్యమంలో ఖమ్మం ప్రజలు కీలక భూమిక పోషించారని, ఇప్పటి సభను విజయవంతం చేయడం ద్వారా ఖమ్మం కీర్తి పెరగ నుందని హరీష్‌రావు తెలిపారు. బిఆర్‌ఎస్‌ సభకు ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు పినరయ్‌ విజయన్‌, కేజ్రీవాల్‌, భగవంత్‌మాన్‌ తోపాటు అఖిలేష్‌యాదవ్‌, డి.రాజా హాజరుకానున్నారని తెలిపారు.
428 ఎకరాలలో పార్కింగ్‌: బిఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభను 100 ఎకరాలలో నిర్వహించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. ఖమ్మం, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల పరిధిలోని 18 నియోజక వర్గాల పరిధిలోని ప్రజలను సమీకరించాలని నిర్ణయించామన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా 428 ఎకరాలలో పార్కింగ్‌ ఏర్పాటు చేస్తున్నామని జిల్లాల వారీగా కోడ్స్‌ ఇచ్చి సంబంధిత బాధ్యులకు తెలియజేశామన్నారు. మీడియా సమావేశంలో పార్లమెంటు సభ్యులు నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శాసన మండలి సభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి, తాతా మధుసూదన్‌, జెడ్‌పి చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, డిసిసిబి, డిసిఎంఎస్‌ చైర్మన్లు కూరాకుల నాగభూషణం, రాయల శేషగిరిరావు, మాజీ శాసన సభ్యురాలు బానోత్‌ చంద్రావతి తదితరులు పాల్గొన్నారు.
బహిరంగసభ ఇన్‌చార్జ్‌లు
భారత రాష్ట్ర సమితి బహిరంగ సభ ఈనెల 18న జరగనున్న నేపథ్యంలో సభా ఏర్పాట్లు జన సమీకరణకు సంబంధించి ఇన్‌చార్జ్‌లను నియమించారు. రాష్ట్ర మంత్రులు టి. హరీష్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్‌ పర్యవేక్షణలో సభా ఏర్పాట్లకు సంబంధించి బాలమల్లు, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌ను, పార్కింగ్‌ ఏర్పాట్లకు సంబంధించి ఎంఎల్‌సి తాతా మధుసూదన్‌, వాలంటీర్స్‌ ఇన్‌చార్జిగా ఖమ్మం నగర అధ్యక్షులు పగడాల నాగరాజుకు బాధ్యతలను అప్పగించారు. మీడియా బాధ్యతలను శ్రీధర్‌రెడ్డి, ఆర్‌జెసి కృష్ణలకు అప్పగించారు. సత్తుపల్లి నియోజక వర్గంకు ఎంఎల్‌ఎ సండ్ర వెంకటవీరయ్య, నర్సంపేట ఎంఎల్‌ఎ సుదర్శన్‌రెడ్డి, మధిరకు జెడ్‌పి చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, ఎంపి వద్దిరాజు రవిచంద్ర, వైరాకు రాములు నాయక్‌, ఎంఎల్‌ఎ క్రాంతికిరణ్‌, ఇల్లందుకు ఎంఎల్‌సి తాతా మధుసూన్‌, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, ఖమ్మంకు పాడి కౌషిక్‌రెడ్డి, పాలేరుకు కందాల ఉపేందర్‌రెడ్డిలను ఇన్‌చార్జీలుగా బాధ్యతలను అప్పగించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments