పరిహారం ఇవ్వకపోవడంతో భూములు ఇచ్చేందుకు రైతులు ససేమిరా
పూర్తి కావచ్చిన టన్నెల్ పనులు
మొత్తం 66% పనులు పూర్తి
ప్రజాపక్షం/ నల్లగొండ : ఉదయ సముద్రం బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు భూసేకరణ పనులు ముందుకు సాగడంలేదు. రైతులకు సరైన పరిహారం ఇవ్వకపోవడంతో భూములు ఇవ్వడానికి ముందుకు రావడంలేదు. దీంతో భూసేకరణ ఇంకా పూర్తి కాలేదు. గతంలో అప్పటి మంత్రి హరీశ్‌రావు ప్రాజెక్టును సందర్శించి త్వరితగతిన పూర్తిచేసి జనవరిలో నీటిని సరఫరా చేస్తామని ప్రకటించారు. సంవత్సరం గడిచినప్పటికీ ఇప్పటివరకు ప్రాజెక్టులోకి నీళ్లు రాలేదు. సంబంధిత అధికారులు పనులు త్వరితగతిన పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రభుత్వం సరైన నిదులు విడుదల చేయకపోవడంతో జాప్యం జరుగుతుంది. బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పనులను అప్పటి సిఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా 2008 సంవత్సరంలో ప్రారంభించా రు. అప్పుడు పనులు కొంత నెమ్మదించినప్పటికీ టిఆర్‌ఎస్ ప్రభుత్వం మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాజెక్టు పనులపై ప్రత్యేక దృష్టి సారించింది. పనులు వేగవంతం చేయడంతో స్కీంలోని ప్రధాన భాగాలైన అ ప్రోచ్ కాలువ, సొరంగం, సర్జ్‌పుల్, పంప్‌హౌస్, సబ్‌స్టేషన్, బ్రాహ్మణ వెల్లెంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులను చివరి దశకు చేరుకుంటున్నాయి. ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి బ్రాహ్మణ వెల్లెంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోనికి ఎత్తిపోసి కుడి, ఎడమ ప్రధాన కాలువల పరిధిలోగల చెరువులు, కుంటలు, సుమారు 50వేల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయి.