నిమజ్జనం తీర్పుపై హైకోర్టు స్పష్టీకరణ
హుస్సేన్‌సాగర్ కలుషితం చేసేందుకు అనుమతినివ్వాలా అని ఆగ్రహం
జిహెచ్‌ఎంసి వేసిన రివ్యూ పిటిషన్ కొట్టివేత
ప్రజాపక్షం/హైదరాబాద్ గణేశ్ నిమజ్జనంపై ఇచ్చిన ఉత్తర్వులను మార్చేది లేదని తెలంగాణ హై కోర్టు స్పష్టం చేసింది. ‘హుస్సేన్‌సాగర్‌ను కలుషితం చేసేందుకు అనుమతివ్వాలా’ అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది వరకే ఇచ్చిన తీర్పులో కనీసం నాలుగు అంశాలను సవరించాలని కోరుతూ జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ హైకోర్టులో వేసిన రివ్యూ పిటిషన్‌ను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రామచందర్‌రావు, జస్టిస్ వినోద్‌కుమార్‌ల ధర్మాసనం కొట్టివేసింది. దీనిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే సుప్రీంకోర్టులో సవాలు చేసుకోవచ్చని సూచించింది. గణేశ్ నిమజ్జనంపై కొన్ని రోజులుగా సర్కారు మల్లగుల్లాలు పడుతున్న విషయం తెలిసిందే. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను ట్యాంక్‌బండ్ హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు వీల్లేదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అలాంటి విగ్రహాల నిమజ్జనం బేబీ పాండ్స్‌లో చేసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వులపై రాష్ట్ర సర్కారు ఆందోళన వ్యక్తం చేస్తూ, పెద్దమనసుతో ఆలోచించి, తీర్పును పునఃసమీక్షించాలని హైకోర్టును కోరింది. జిహెచ్‌ఎంసి కమిషనర్ వేసిన రివ్యూ పిటిషన్‌లో నాలుగు అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. వినాయక విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయరాదని పండుగకు ఒక రోజు ముందు ఉత్తర్వులు జారీ చేయడం వల్ల పలు సమస్యలను ఎదుర్కొంటున్నట్టు కమిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతోపాటు పలు శివారు ప్రాంతాల్లోని విగ్రహాల నిమజ్జనానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో, హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయడం సర్కారుకు తలకు మించిన భారంగా మారింది. బేబీ పాండ్స్‌ను ఇప్పటికీ సిద్ధం చేయలేదు. ఒకవేళ వాటిని తయారు చేసినప్పటికీ, విగ్రహాల నిమజ్జనం పూర్తికావడానికి కనీసం వారం రోజుల సమయం పడుతుంది. అంతేగాక ఎంతో వ్యవప్రయాసలతో కూడిన రబ్బర్ డ్యామ్ నిర్మాణానికి కూడా సమయం పడుతుంది. కోర్టు తీర్పు వెలువడక ముందే జంట నగరాల్లో వేలాది మంటపాల్లో భారీ గణేశ్ విగ్రహాలు ప్రతిష్టించారు. దీనితో వాటి నిమజ్జనం ఎలా అనే అంశంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నది. చిన్నచిన్న నీటి కుంటల్లో భారీ విగ్రహాలను నిమజ్జనం చేయడం కష్టమని హైకోర్టుకు తన రివ్యూ పిటిషన్‌లో తెలిపింది. ట్యాంక్‌బండ్ వద్ద క్రేన్లను సిద్ధంగా ఉంచేందుకు ఏర్పాట్లు జరిగినట్టు రివ్యూ పిటిషన్‌లో పేర్కొంది. కొన్ని నెలల క్రితమే నిమజ్జనానికి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసుకున్నామని తెలిపింది. నిమజ్జనం పూర్తయిన 48 గంటల్లోగా వ్యర్థాలను తొలగించే బాధ్యతను స్వీకరిస్తామని తెలిపింది. ఈ అంశాలనే జిహెచ్‌ఎంసి తన రివ్యూ పిటిషన్‌లో ప్రస్తావించింది. హుస్సేన్‌సాగర్‌తోపాటు ఇతర జలాశయాల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్రహాల నిమజ్జనంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని హైకోర్టును కోరింది. ట్యాంక్‌బండ్ వైపు నుంచి విగ్రహాల నిమజ్జనానికి అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. కృత్రిమ రంగులు లేని విగ్రహాలనే అనుమతించాలంటూ జారీ చేసిన ఆంక్షలను కొడా ఎత్తివేయాలని కోరింది. హుస్సేన్‌సాగర్‌లో రబ్బర్ డ్యామ్ నిర్మించాలన్న ఉత్తర్వులను కూడా సవరించాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. అయితే, రివ్యూ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు, ఆ ఉత్తర్లును యథావిథిగా కొనసాగించాలని, ఎలాంటి మార్పులూ చేయబోమని తేల్చిచెప్పింది. గత ఏడాది నిమజ్జనం సమయంలో ఇచ్చిన ఉత్తర్వులను, చేసిన సూచనలను ప్రభుత్వం ఏడాది గడిచినా పాటించకపోవడం, సానుకూలంగా స్పందించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పుడు ఉత్తర్వులను సవరించాలని కోరడంలో అర్థం లేదని పేర్కొంటూ, హుస్సేన్‌సాగర్‌ను కలుషితం చేసేందుకు అనుమతులు ఇవ్వాలా? అని ప్రభుత్వాన్ని నిలదీసింది. గతంలో మూడు కౌంటర్లను దాఖలు చేసిన ప్రభుత్వం, సమస్యలను కోర్టు దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇబ్బందులు ప్రభుత్వానికి తెలుసునని, ఇప్పటి వరకూ ఎందుకు మౌనంగా ఉండాల్సి వచ్చిందని ప్రశ్నించింది. అవసరమని అనుకుంటే సుప్రీం కోర్టు ఆశ్రయించవచ్చని, తమ నుంచి ఉత్తర్వుల్లో మార్పులు ఏవీ ఉండబోవని స్పష్టం చేసింది.
ఉత్తర్వులను మార్చలేం
RELATED ARTICLES