పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. అలముకుంటున్న పొగ మంచు
పలు విమానాలు.. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీసహా ఉత్తరాది ప్రాంతాలపై చలి తీవ్రత కొనసాగుతున్నది. ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేని రీతిలో పడిపోతుండగా, పొగమంచు దుప్పటి పరచినట్టు అలముకోవడంతో పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 1.9 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. మైదాన ప్రాంతాల్లో తీవ్రమైన చలి అలలు చుట్టుముట్టాయి. ఆదివారం ఉత్తర భారతదేశం, దేశంలోని తూర్పు ప్రాంతాలపై పొగమంచు 480 రైళ్ల రాకపోకలను ప్రభావితం చేసింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని చాలా ప్రాంతాలకంటే ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత వరుసగా నాలుగో రోజు కూడా అత్యంత తక్కువగా నమోదైనట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండి) ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటన లో పేర్కొంది. పొగమంచు కారణంగా దాదాపు 335 రైళ్లు ఆలస్యమయ్యాయని, 88 రైళ్లను రద్దు చేశామని రైల్వే అధికారులు తెలిపారు. 31 రైళ్లను దారి మళ్లించగా, 33 సర్వీసులను స్వల్పకాలానికి నిలుపుదల చేసినట్టు వివరించారు. షెడ్యూల్‌ను ఇంకా ఖరారు చేయని విమాన సర్వీసులు ప్రభావితమైనట్టు పరిగణించాలని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ట్వీట్ చేసింది. తాజా సమాచారం కోసం ప్రయాణికులు సంబంధిందిత విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించింది. ఆదివారం సుమారు 25 విమానాలు ఆలస్యంగా నడచినట్టు అధికారులు తెలిపారు. ఐఎండి ప్రకటనను అనుసరించి, భటిండా, ఆగ్రా వద్ద దృశ్యమాన స్థాయి దారుణంగా పడిపోయింది. సున్నా మీటర్లకు పతనం కావడంతో, ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరిగాయి. పటియాలా, చండీగఢ్, హిస్సార్, అల్వార్, పిలానీ, గంగానగర్, లక్నో, కూచ్ బెహార్ వద్ద చూడగలిగిన విజిబిలిటీ స్థాయి 25 మీటర్లుగా ఉంది. అదే విధంగా అమృత్‌సర లూథియానా, అంబాలా, భివానీ, పాలం (ఢిల్లీ), పుర్సత్‌గంజ్, వారణాసి, మీరట్, గయా, ధుబ్రి వద్ద దృశ్యమాన స్థాయి 50 మీటర్లు. హర్యానాలోని రోహ్తక్, ఢిల్లీలోని సఫర్దర్‌జంగ్, రిడ్జ్, అయానగర్, ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, బహ్రైచ్, బరేలీతోపాటు బీహార్‌లోని భగల్పూర్, పశ్చిమ బెంగాల్‌లోని బాగ్డోగ్రా, జపగురిలో, అదే విధంగా అస్సాంలోని మేఘాలయ, త్రిపురలలోని అనేక ప్రాంతాల్లో విజిబిలిటీ స్థాయి 200 మీటర్లుగా నమోదంది. జనవరి మాసంలో గత రెండు సంవత్సరాల కనిష్ట స్థాయికి పతనమయ్యాయి. మంచు పర్వతాల నుండి అతి శీతల గాలులు ఢిల్లీతో సహా వాయువ్య భారతదేశాన్ని తాకడంతో, లోధి రోడ్, అయానగర్, రిడ్జ్, జాఫర్‌పూర్ వాతావరణ కేంద్రాలు పరిధిలో కనీస ఉష్ణోగ్రత వరుసగా 2.8 డిగ్రీలు, 2.6 డిగ్రీలు, 2.2 డిగ్రీలు, 2.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. చంబా (8.2 డిగ్రీలు), డల్హౌసీ (8.2 డిగ్రీలు), ధర్మశాల (6.2 డిగ్రీలు), సిమ్లా (9.5 డిగ్రీలు) సహా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని పలు పర్వత ప్రాంతాల్లోనూ చలి పెరుగుతున్నది. హమీర్‌పూర్ (3.9 డిగ్రీలు), మనాలి (4.4 డిగ్రీలు), కాంగ్రా (7.1 డిగ్రీలు), సోలన్ (3.6 డిగ్రీలు), డెహ్రాడూన్ (6 డిగ్రీలు), ముస్సోరీ (9.6 డిగ్రీలు), నైనిటాల్ (6.2 డిగ్రీలు), ముక్తేశ్వర్ (6.5 డిగ్రీలు) మరియు తెహ్రీ (7.6 డిగ్రీలు) చొప్పున ఉష్ణోగ్రతలునమోదు చేశాయి. దేశ రాజధానిలోని అనేక ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే కనీసం ఏడు డిగ్రీలు తక్కువగా నమోదైంది, ఇది తీవ్రమైన చలిగా మారింది. కాగా, చలి తీవ్రత పవర్ గ్రిడ్లను కూడా దెబ్బతీస్తోంది. నిరాశ్రయులకు, జంతువులకు సవాళ్లను విసురుతోంది. ఢిల్లీలో శీతాకాలపు గరిష్ట విద్యుత్ డిమాండ్ శుక్రవారం రికార్డు స్థాయిలో 5,526 మెగావాట్లకు పెరిగింది. కొన్ని చోట్ల వ్యవసాయం, పశువులు, నీటి సరఫరా, రవాణా, విద్యుత్ రంగంపై చలి ప్రభావం ఉంటుందని ఐఎండి హెచ్చరించింది. చలితీవ్రత ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘విటమిన్ సి’ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను తినాలని, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి వీలుగా తగినంత వెచ్చని ద్రవాలను తాగాలని సూచిస్తున్నారు.
ఉత్తరాది గజగజ
RELATED ARTICLES