సికింద్రాబాద్ ఉజ్జయినీ అమ్మవారికి బోనం, పట్టువస్త్రాలు సమర్పించిన సిఎం కెసిఆర్ దంపతులు
ప్రజాపక్షం / హైదరాబాద్ ఆషాఢ బోనాల సందర్భంగా సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారిని ఆదివారం ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సిఎం దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సిఎం కెసిఆర్,ఆయన సతీమణి శోభతో కలిసి ఆలయానికి విచ్చేసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహంకాళీ అమ్మవారికి ముఖ్యమంత్రి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ముత్యాలమ్మ గుడిలో ముఖ్యమంత్రి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా పోలీసులు గట్టి పోలీస్ బందోబస్త్ నిర్వహించారు. కాగా, రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దంపతులు తొలిబోనం సమర్పించారు. ఆదివారం తెల్లవారుజామునుంచి ఈ బోనాల సమర్పణ కార్యక్రమం కన్నులపండువగా జరిగింది. ఆలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మనోహర్ రెడ్డిఆధ్వర్యంలో ఆలయ పండితులు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు పూర్ణకుంభం మేళతాళాలతో స్వాగతం పలికారు. ఆలయంలో బోనం సమర్పించిన అనంతరం అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. పూజల అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దంపతులకు ఆలయ పండితులు తీర్థప్రసాదాలను అందజేసి వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. బోనాల సందర్భంగా సికింద్రాబాద్ లోని ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి ఆలయం సహా అనేక ప్రాంతాలలో డప్పుచప్పులు, నృత్యాల కేరింతలు, ఊరేగింపులతో మార్మోగింది. ఈ సందర్భంగా ‘బేబీ’సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్య అమ్మవారికి బోనం సమర్పించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ నెల 14న విడుదల కానున్న ‘బేబీ’ సినిమా ఘన విజయం సాధించేందుకు అమ్మవారి ఆశీస్సులు ఆకాంక్షిస్తున్నట్లు మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బిఆర్‌ఎస్ పార్టీ ఇంఛార్జి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మాజీ కార్పొరేటర్లు అత్తిలి అరుణ గౌడ్, కిరణ్మయి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పూజలలో డిప్యూటీ స్పీకర్, ఎంఎల్‌సి కవిత…
మోండా మార్కెట్ డివిజన్ ఆదయ్యనగర్ కమాన్ వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో బోనాల సందర్భంగా నిర్వహించిన పూజలలో డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు గౌడ్, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఎల్‌సి కవిత అమ్మవారిని దర్శించుకుని బంగారుబోనం సమర్పించారు.
అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం వారిని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఉత్తరాదిన కుంభవృష్టి
RELATED ARTICLES