రిసెప్షనిస్టు మృతిపై కొనసాగుతున్న నిరసనలు
అంత్యక్రియలకు కుటుంబ సభ్యుల అంగీకారం
డెహ్రాడూన్: టీనేజ్ రిసెప్షనిస్టు అనుమానాస్పద మృతితో ఉత్తరాఖండ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ఇంకా తెరపడలేదు. నిరసనలు కొనసాగుతునే ఉన్నాయి. కాగా, ఆమె భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని పౌరి జిల్లా, యంకేశ్వర్ బ్లాక్‌లో ఉన్న వనంతర రిసార్ట్‌లో రిసెప్షనిస్టుగా పని చేస్తున్న 19 ఏళ్ల అంకితా భండారీ అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలానికి దారితీసింది. తమ కుమార్తె కనిపించడం లేదని అంకిత తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన ఆరు రోజుల తర్వాత ఆమె శవాన్ని రిషీకేశ్‌కు సమీపంలోని చీలా కాలువలో గుర్తించారు. అతిథులను సంతోషపెట్టడానికి వారితో సెక్స్‌లో పాల్గొనాల్సిందిగా రిసార్ట్ యజమాని, హరిద్వార్ బిజెపి నాయకుడు వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్య బలవంతం చేశాడన్న అనుమానాలు ఉన్నాయి. అందుకు అంకిత అంగీకరించకపోవడంతో అతను ఆమెను హత్య చేసి ఉంటాడని అంకిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇలావుంటే, అంకిత భౌతిక కాయానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన నలుగురు సభ్యులతో కూడిన రిషీకేశ్‌లోని ఎయిమ్స్ వైద్య బృందం తన నివేదికలో ఆమె నీటిలో మునిగి, ఊపిరి ఆడక మృతి చెందిందని నిర్ధారించింది. అయితే, ఆమె వంటిపై గాయాలు ఉన్నాయని, అవి చనిపోక ముందు తగిలినవేనని నిర్ధారించింది. అయితే, ఈ పోస్టుమార్టం నివేదికలో సరైన వివరాలు లేవంటూ అంకిత తండ్రి వీరేంద్ర సింగ్ భండారీ, సోదరుడు అజయ్ సింగ్ భండారీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తి నివేదిక వచ్చే వరకూ అంత్యక్రియలు నిర్వహించడానికి వీల్లేదని పట్టుబట్టారు. అయితే, నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని, వారు ఎంతటి హోదాలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ హామీ ఇచ్చిన విషయాన్ని అధికారులు భండారీ కుటుంబం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే పుల్కిత్ ఆర్య, మరో ఇద్దరిని అరెస్టు చేశారని, అంతేగాక, వినోద్ ఆర్యను బిజెపి నుంచి సస్పెండ్ చేశారని కూడా వివరించారు. దోషులుగా తేలితే కఠిన శిక్షలు తప్పవని అధికారులు నచ్చచెప్పడంతో అంకిత అంత్యక్రియలకు అంకిత కుటుంబ సభ్యులు అంగీకరించారు.
ఉత్తరాఖండ్‌లో తగ్గని ఉద్రిక్తత
RELATED ARTICLES