ఆరోగ్య కార్యకర్త మృతి
వ్యాక్సినేషన్ వల్లే : కుటుంబం
కాదు గుండెపోటు వల్లే : వైద్యాధికారి
ఉన్నతస్థాయి విచారణకు మేజిస్ట్రేట్ ఆదేశం
మొరాదాబాద్ : దేశంలో అట్టహాసంగా ఆరంభమైన కరోనా నియంత్రణ టీకా పంపిణీలో అపశృతి చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్ మొరాదాబాద్‌జిల్లా కేంద్రంలో 46 ఏళ్ళ వయసుగల ఆరోగ్య కార్యకర్త మహిపాల్ టీకా తీసుకున్న 36 గంటలకు మరణించారు. జ్వరం, దగ్గుతోపాటు శ్వాస పీల్చుకోవడంలో సమస్య రావడంతో ఆదివారం ఆయన్ను ప్రభుత్వ హాస్పిటల్‌లో చేర్చారు. ఆ రాత్రే ఆయన మరణించారు. మొరాదాబాద్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రభుత్వ హాస్పిటల్‌లో మహిపాల్ సర్జికల్ వార్డ్ బోయ్‌గా పనిచేస్తున్నారు. జ్వరం దగ్గు తప్ప ఏ రోగం లేదని, పూర్తి ఆరోగ్యంతో ఉండేవారనీ, కేవలం టీకా రియాక్షన్ వల్లనే మరణించారని మహిపాల్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మొరాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ రాకేశ్‌సింగ్ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
మహిపాల్ గుండెపోటువల్ల మరణించాడని ప్రధాన వైద్యాధికారి డాక్టర్ మల్లంద్ చంద్ర గార్జ్ చెబుతున్నారు. అతడి గుండె బాగా విస్తరించిందని, గుండె నాళాల్లో రక్తం గడ్డకట్టిన ఆటంకాలున్నాయని పోస్టుమార్టం నివేదికలో కనుగొన్నట్లు ఆయన చెప్పారు. మహిపాల్ హృద్రోగ సమస్యతో బాధపడుతున్నట్లు కనిపిస్తోందన్నారు. ముగ్గురు వైద్యుల బృందం మహిపాల్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించింది. శ్వాసకోశ ధమనిలో రక్తం ఆటంకాలున్న (కార్డియో పల్మనరీ)వ్యాధితో అతడు బాధపడుతున్నారని , కరోనా వైరస్ నియంత్రణ టీకాకూ, అతడి మరణానికి ఎలాంటి సంబంధం లేదని పోస్టుమార్టం వైద్యుల నివేదిక వెల్లడించింది. “ఎలాంటి సైడ్ ఎఫెక్టులన్నా ఉన్నాయా?” అని అడిగిన ప్రశ్నలను ప్రధాన వైద్యాధికారి మల్లంద్ చంద్ర కొట్టిపారేశారు. అయితే టీకా తీసుకున్న కొద్దిమంది జ్వరంతో బాధపడుతున్నారని అంగీకరించారు. ”నా తండ్రి దగ్గుతో బాధపడుతున్నాడు, కానీ టీకా తీసుకున్న తర్వాత జ్వరం వచ్చింది, శ్వాస పీల్చుకోవడం పెద్ద సమస్యగా మారింది, ఆదివారం ఆయన్ను ప్రభుత్వ హాస్పిటల్‌లో చేర్చాం, అదే రాత్రి ఆయన మరణించారు” అని మహిపాల్ కుమారుడు విశాల్ చెప్పారు. హాసిటల్ విధుల్లో ఉన్న నా తండ్రికి ఎప్పుడూ కరోనా రాలేదు, ఆయన చక్కగా డ్యూటీ చేసేవారు అని చెప్పారు. దీనిపై ప్రధాన వైద్యాధికారి స్పందిస్తూ, టీకా తీసుకున్నవారు సాధారణ సమస్యలు ఎదుర్కొంటున్నారు తప్ప, మహిపాల్‌కు వచ్చినట్లు శ్వాస సమస్య ఎవరికీ రాలేదన్నారు. ఆయనకి ఎప్పుడూ ఇలాంటి గుండె సమస్య, శ్వాస తీసుకునే సమస్య రాలేదని, దగ్గు తప్ప చాలా ఆరోగ్యంగా ఉండేవాడని, టీకా వల్లనే చనిపోయాడని మహిపాల్ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. టీకా పూర్తి సురక్షితమని, దానివల్ల సైడ్ ఎఫెక్టులు లేవని మొరాదాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ అన్నారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌లో… టీకా రియాక్షన్!
RELATED ARTICLES