వ్యవసాయానికి ఎనిమిది గంటలపాటు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్ నేతలు, మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రైతులను చంపుకుతినే రాబందు అని మరోసారి తేలిపోయిందని బిఆర్‌ఎస్ మండిపడింది. రైతులకు ఉచిత విద్యుత్ అవసరం లేదని రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనమని పేర్కొంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చింది. అయితే, రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు బిఆర్‌ఎస్ వక్రీకరించిందని కాంగ్రెస్ నేతలు ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్ దిష్టిబొమ్మల దహనానికి బిఆర్‌ఎస్ ఇచ్చిన పిలుపునకు కౌంటర్‌గా కాంగ్రెస్ పార్టీ కూడా విద్యుత్ సబ్‌స్టేషన్ల వద్ద సిఎం కెసిఆర్ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చింది.
రైతులకు 8 గంటలు చాలు
ఉచిత విద్యుత్‌పై రేవంత్‌రెడ్డి
ప్రజాపక్షం/హైదరాబాద్ రైతులకు ఎనిమిది గం టల పాటు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని టిపిసిసి అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అమెరికాలో జరుగుతున్న తానా సమావేశాల్లో పాల్గొంటున్న ఆయనను ‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరంతర ఉచిత విద్యుత్ పథకాన్ని నిలిపివేస్తారా? కొనసాగిస్తారా? అని ఒక ఎన్‌ఆర్‌ఐ ప్రశ్నించారు. దీనికి రేవంత్ రెడ్డి సమాధానమిస్తూ తెలంగాణలో 95 శాతం రైతులు మూడు ఎకరాల లోపు ఉన్న చిన్న సన్నకారు రైతులు అని అన్నారు. ఒక ఎకరాకు నీళ్లు
పారించాలంటే ఒక గంట కరెంటు సరిపోఎతుందని, మూడు ఎకరాలకు ఫుల్లుగా నీళ్లు పట్టాలంటే రైతుకు మూడు గంటల విద్యుత్ సరిపోతుందన్నారు. మొత్తంగా ఎనిమిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని చెప్పారు. కేవలం విద్యుత్ సంస్థల నుండి కమీషన్‌లకు కక్కుర్తి పడి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అనే నినాదాన్ని చంద్రశేఖర్‌రావు తీసుకు వచ్చారని , ఉచిత కరెంటు అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇలాంటి ఉచితం అంటూ అనుచితంగా వ్యవహరిస్తున్నడని, దానిని మన స్వార్థానికి వాడుకోకూడదనే కాంగ్రెస్ రైతు డిక్లరేషన్‌లో స్పష్టంగా పొందుపరిచామని తెలిపారు.
పక్కదారి పట్టిస్తున్నారు.. నేడు కెసిఆర్ దిష్టిబొమ్మల దహనం
రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆయనపై బిఆర్‌ఎస్ నేతలు, మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నాడు కాంగ్రెస్ దిష్టిబొమ్మల దగ్ధానికి బిఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. దీనికి రేవంత్ రెడ్డి కౌంటర్‌గా విద్యుత్ సబ్ స్టేషన్‌ల వద్ద సిఎం కెసిఆర్ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చారు.బిజెపికి బిఆర్‌ఎకి బి టీం అని మరోసారి నిరూపితమైందని ఆయన ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా బుధవారం ‘సత్యాగ్రహ దీక్ష‘ పిలుపుని నీరుగార్చాలని, ఉచితవిద్యుత్ పైకి దృష్టి మరల్చాలని ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తున్నదని,12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదన్న విషయం ఏ సబ్ స్టేషన్ కు వెళ్లినా తెలుస్తుందిదన్నారు.తొమ్మిదేళ్లలో విద్యుత్ సంస్థలను రూ.60 వేల కోట్ల అప్పుల్లో ముంచి తన అవినీతికి బలిపెట్టిన ఘనుడు కెసిఆర్ అని అన్నారు.ఈ మోసాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలకేంద్రాలలో సబ్ స్టేషన్ల ముందు కెసిఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేయాల్సిందిగా కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరించారు : కాంగ్రెస్
ఉచిత విద్యుత్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బిఆర్‌ఎస్ వక్రీకరించిందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అన్నారు. రైతులకు 24 గంటలు విద్యుత్ ఇవ్వడమే కాంగ్రెస్ విధానమని టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధు యాస్కీ గౌడ్ అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించి, రైతలను రెచ్చగొట్టేందుకు కెటిఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. గాంధీభవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బషీర్ బాగ్ విద్యుత్ కాల్పులు జరిగినప్పుడు టిడిపిలో ఉన్న కెసిఆర్ ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. ఆనాడు టిడిపి సర్కార్ విద్యుత్ కాల్పుల్లో కెసిఆర్ కూడా భాగస్వామి అని ఆరోపించారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, కెసిఆర్ చెబుతున్న 24 గంటల కరెంట్ వెనుక ఎంత అవినీతి జరిగిందో తమ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. విద్యుత్ కొనుగోలు అవినీతిలో కెసిఆర్ కుటుంబం పాత్ర ఉందని ఆరోపించారు. 24 గంటల విద్యుత్ పేరుతో కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. .రైస్ మిల్లర్ల తో కలిసి దోపిడీకి పాల్పడింది కెటిఆర్ కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కెసిఆర్ సర్కార్ అవినీతి వెలికి తీస్తామని, అన్ని విద్యుత్ సబ్ స్టేషన్ ల వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాలని, ఎంఎల్‌ఎల ఇళ్ళ ముందు కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాలని మధు యాస్కీ పిలుపునిచ్చారు.రాహుల్ గాంధీ పై అనర్హత అంశంలో బుధవారం గాంధీభవన్ లో సత్యాగ్రహ దీక్ష చేయనున్నట్లు తెలిపారు.
ఉచిత విద్యుత్‌కు నేపథ్యం ఉందిః కోదండరెడ్డి
ఉచిత విద్యుత్‌కు నేపథ్యం ఉన్నదని , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2000 సంవత్సరం లో విపరీతమైన విద్యుత్ సంక్షోభం ఉండేదని ఎఐసిసి కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదంరెడ్డి తెలిపారు. ఏలూరు లో రైతులు కరెంట్ కోసం దీక్షలు చేస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం కాల్పులు జరిపితే రైతులు తీవ్రంగా గాయపడ్డారని,2000 ఆగస్టు లో బషీర్ బాగ్ లో ఉద్యమం చేస్తున్న రైతులపై కాల్పులు జరిపితే 3 ముగ్గురు చనిపోయారని గుర్తుచేశారు. ఇలాంటి ఘటనలతో అప్పట్లోవైఎస్సార్ ఉచిత విద్యుత్ అమలు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
2004 లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్ పై తొలి సంతకం చేయడమే కాకుండా 1250 కోట్ల రూపాయల పాత కరెంట్ బకాయిలను రద్దు చేస్తూ రైతులపై పెట్టిన కేసులను వేసిందన్నారు. అప్పట్లో కెసిఆర్… చంద్రబాబు తో ఉండి ఉచిత విద్యుత్ ను వ్యతిరేకించారని అన్నారు. తాము తెచ్చిన ఉచిత విద్యుత్ ను కెసిఆర్ వక్రీకరించి మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఉచిత విద్యుత్ పైన కట్టుబడి ఉన్నదన్నారు.
విద్యుత్ కొనుగోలుపై చర్చకు సిద్ధమా? ః పొన్నం
కాంగ్రెస్ అంటేనే రైతులు .. రైతులు అంటేనే కాంగ్రెస్ అని మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో రైతులకు అనుకూలంగా పనిచేసిన పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించి బీఆర్‌ఎస్ మాట్లాడుతోందన్నారు. విద్యుత్ కొనుగోలు లో జరిగిన అవినీతిపై రేవంత్ మాట్లాడితే వక్రీకరిస్తున్నారని, విద్యుత్ కొనుగోలు లో అవినీతిపై బహిరంగ చర్చకు బిఆర్‌ఎస్ సిద్ధమా అని , సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తారా అని సవాలు విసిరారు.
రైతును చంపే రాబందుకాంగ్రెస్
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
ప్రజాపక్షం/హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ రైతుల్ని చంపుకుతినే రాబందని మరోసారి తేలిపోయిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు విమర్శించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అవసరం లేదని చేసిన ప్రకటన కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనమని మంగలశారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చారు. 24 గంటల
కరెంట్ రద్దు చేసి, 3 గంటల కరెంట్ మాత్రమే ఇస్తామని చెప్పడం కాంగ్రెస్ దుష్ట విధానాలకు పరాకాష్ఠ అన్నారు. తెలంగాణ రైతుకు ఉచిత విద్యుత్ ఊపిరిలాంటిదని, రైతుల ఊపిరిని ఆపేస్తామని, అన్నదాత ఉసురు తీస్తామని చెప్పడం కాంగ్రెస్ రాక్షస బుద్ధికి తార్కాణమన్నారు. నిన్నటిదాకా ధరణి రద్దు, రైతుబంధు వద్దూ అంటూ ఇప్పటికే రైతు వ్యతిరేక విధానాలను ప్రకటిస్తున్న కాంగ్రెస్, ఇప్పుడు ఏకంగా ఫ్రీ కరెంట్‌ను ఎత్తేస్తామన్న తన క్రూరమైన ఆలోచనను బయటపెట్టుకుందన్నారు. ఉచిత విద్యుత్ కు ఉరి వేసేందుకు గాంధీ భవన్ కేంద్రంగా జరుగుతున్న కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలని ఆయన తెలంగాణ రైతాంగానికి పిలుపునిచ్చారు. అర్ధరాత్రి అపరాత్రి దొంగరాత్రి మోటర్లు పెట్టడానికి పోయి పాములు కరిచి, కరెంట్ షాకులు కొట్టి మృత్యువాత పడ్డ రైతులు కాంగ్రెస్ పాలన పరిస్ధితులను తలుచుకునేందుకు కూడా సిద్దంగా లేరన్నారు. ఒక్క కరెంటే కాదు, నాడు కాంగ్రెస్ హయాంలో ఎరువుల్ని పోలీస్ స్టేషన్‌లలో పెట్టి అమ్మే దుస్థితి ఉండేదని, కిలోమీటర్లు దూరం క్యూలైన్‌లో చెప్పులు, లాఠీచార్జీల దృశ్యాలే కాంగ్రెస్ పాలనా పాడుకాలంలో ఉండేవన్నారు. కాంగ్రెస్ కల్తీ పాలనలో రైతులకు దొరికింది కల్తీ విత్తనాలు, కల్తీ పురుగు మందులే అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతాంగాన్ని రక్షించుకోవడానికి, వ్యవసాయాన్ని సంక్షోభంనుంచి బయటపడేయడానికి కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. విద్యుత్ రంగంపై వేల కోట్లు వెచ్చించి 24 గంటల ఉచిత విద్యుత్ ను అందించిందని తెలిపారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ, ఇతర ప్రాజెక్టుల వల్ల భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగి 27లక్షల బోరుబావుల కింద అన్నదాతలు రెండు పంటలు పండించుకొని సంతోషంగా ఉన్నారని, రైతుపచ్చగా ఉంటే చూసి కళ్లుమండిన కాంగ్రెస్ శక్తులు నిరంతరం ఏవో కుట్రలు చేస్తూనే ఉన్నాయన్నారు. కేంద్రంలోని బిజెపి సర్కారు ఉచిత విద్యుత్ ను ఎత్తివేసి మోటర్లుకు మీటర్లు పెట్టాలని రాష్ట్రం మెడపైన కత్తిపెట్టినా ప్రభుత్వం లొంగిపోలేదన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్‌ను కాపాడుకోవడం కోసం ఏకంగా రూ. 30 వేల కోట్లను వదులుకుందన్నారు. పక్కా రక్షణనిచ్చిన ధరణి పోర్టల్‌ను రద్దుచేస్తామంటున్న కాంగ్రెస్, మళ్లీ నాటి బ్రోకర్లు, దళారుల భూదందాల కాలాన్ని తీసుకొస్తామని నిస్సిగ్గుగా ప్రకటించిందని దుయ్యబట్టారు. ఈ 24 గంటల వెలుగుల్ని వదులుకుందామా? కటిక కాంగ్రెస్ చీకట్ల కాలాన్ని మళ్లీ తెచ్చుకుందామా? చైతన్యవంతమైన తెలంగాణ రైతులు ఆలోచించుకోవాలన్నారు. ఉచిత విద్యుత్ వద్దన్నవాడిని ఊరిపొలిమేర్లకు రాకుండా ఉరికించాలని, మూడు గంటల కరెంట్ చాలు అన్నవాడి మాడు పగిలేలా జవాబు చెప్పాలన్నారు.