HomeNewsBreaking News‘ఉచిత విద్యుత్‌'నిరశనలు

‘ఉచిత విద్యుత్‌’నిరశనలు

పోటాపోటీగా దిష్టిబొమ్మలు దహనం చేసిన బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణులు

ఉచితవిద్యుత్‌పై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బిఆర్‌ఎస్‌ ధర్నా నిర్వహించింది. రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేసింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఉచిత కరెంట్‌ కట్‌ అవుతుందని, మళ్లీ పాతరోజులు వస్తాయని విమర్శించింది. ఆనాటి టిడిపి ప్రభుత్వ హయాంలో బషీర్‌బాగ్‌ వద్ద రైతులు చేస్తున్న ఆందోళనలపై కాల్పులు జరిపిన విషయాన్ని గుర్తుచేసింది. రేవంత్‌ వ్యాఖ్యలను గులాబీ నేతలు వక్రీకరించారంటూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనకు దిగింది. పీసీసీ పిలుపు మేరకు వివిధ జిల్లా విద్యుత్‌ ఎస్‌ఈ కార్యాలయాల వద్ద నేతలు నిరసనలు చేశారు. నాణ్యమైన విద్యుత్‌ 8 గంటలు ఇస్తే సరిపోతుందని రేవంత్‌ అన్నారే తప్ప 24 గంటల ఉచిత విద్యుత్‌కి వ్యతిరేకం కాదని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది.

కాంగ్రెస్‌ రైతు డిక్లరేషన్‌ బోగస్‌
రాహుల్‌ గాంధీ మాటలన్నీ డొల్ల : ఎంఎల్‌సి కవిత
ప్రజాపక్షం/హైదరాబాద్‌
వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్‌ చాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో గతంలో రాహుల్‌ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ ఒక బోగస్‌ అని రైతులకు అర్థమైందని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. రాహుల్‌ గాంధీ మాటలన్నీ డొల్ల అని తెలుస్తోందన్నారు. రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ భేషరతుగా తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలని, అప్పటివరకు గ్రామాల్లో తిరగవద్దని డిమాండ్‌ చేశారు. రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్‌లోని విద్యుత్‌ సౌధ ఎదురుగా బుధవారం జరిగిన నిరసన కార్యక్రమంలో కవిత, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తదిరతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడు పూటలా అన్నం పెట్టే రైతులకు మూడు గంటలే కరెంటు ఇవ్వాలని అంటున్న రేవంత్‌ రెడ్డిని ఊరి పొలిమేర వరకు తరిమి కొట్టాలని రైతులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ఉద్దేశాన్ని రేవంత్‌ రెడ్డి అమెరికాలో బయటపెట్టారని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఎందుకని అడుగుతున్నారని మండిపడ్డారు. 24 గంటల పాటు కరెంటును వ్యాపారవేత్తలకు,జూబ్లీహిల్స్‌ లోని ‘మీ ఇంటికి’ ఇవ్వాలా ?, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఎందుకు ఇవ్వకూడదని కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పాలనలో అర్ధరాత్రి కరెంటు పెట్టడానికి వెళ్లి రైతులు పాము, తేళ్ల కాట్లకు గురయ్యేవారని, ఇవాళ రాష్ట్రంలో ఆ పరిస్థితి ఎక్కడ లేదని వివరించారు. కాంగ్రెస్‌ , టిడిపి కలిపి 60 ఏళ్లు పరిపాలించాయని, ఆ రెండు పార్టీల్లో రేవంత్‌ రెడ్డి పని చేశారని,ఆయన ఉన్న ఆ పార్టీలో రైతులకు ఎప్పుడు ఏమి చేయలేదని విమర్శించారు. 60 ఏళ్లలో 7 మెగావాట్ల విద్యుత్‌ మాత్రమే కాంగ్రెస్‌ ఉత్పత్తి చేసిందని, కానీ గత తొమ్మిదేళ్ల సీఎం కేసీఆర్‌ పాలనలో అదనంగా పదివేల మెగా పట్ల ఉత్పత్తిని సాధించుకున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం రైతుల కోసం నిరంతరం కష్టపడి భూ రికార్డులను ప్రక్షాళన చేసి, విద్యుత్తు ఉత్పత్తిని పెంచి, సబ్‌ స్టేషన్లు నిర్మిస్తున్నదన్నారు. ఒకప్పుడు లోటు విద్యుత్తుతో రైతులు దిగాలుగా ఉండేవారని, ఇప్పుడు విద్యుత్‌ మిగులు రాష్ట్రంగా నిలిచిందన్నారు. మంచి పంటలతో రైతులు బాగుంటే కాంగ్రెస్‌కు ఎందుకు కళ్ళమంట అని నిలదీశారు. గతంలో నాణ్యమైన విద్యుత్‌ లేక తెలంగాణ రైతాంగం బోరు బావులపై ఆధారపడి ఇబ్బంది పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ రాష్ట్రంలో 27.5 లక్షల బోరు బావులపై ఆధారపడి రైతులు వ్యవసాయం చేస్తున్నారని గుర్తు చేశారు. మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ వల్ల నీటిమట్టం పెరిగి బోర్లు నిండుగా పోస్తున్నాయని, ఆ బోరు మోటార్లకు ప్రభుత్వం నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిస్తుందని, ఎప్పుడంటే అప్పుడే రైతు బటన్‌ నొక్కితే నీళ్లు వస్తున్నాయని కవిత తెలిపారు. అనంతరం రేవంత్‌రెడ్డి దిష్టబొమ్మను దహనం చేశారు.

కెసిఆర్‌కంటే ఎక్కువే చేస్తాం
అధికారంలోకి రాగానే రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ : మాణిక్‌రావ్‌ ఠాక్రే
ప్రజాపక్షం / హైదరాబాద్‌
రైతులకు కెసిఆర్‌ చేసిన దానికంటే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఎక్కువే చేస్తామని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావ్‌ ఠాక్రే అన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తుందనిస్పష్టం చేశారు. రైతు
డిక్లరేషన్‌ లో కాంగ్రెస్‌ పార్టీ ఏమి చెప్పిందో అవి అమలు చేస్తామని ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ను రైతులకు అందిస్తామన్నారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మాటలకు తప్పుడు అర్థం వచ్చేలా బిఆర్‌ఎస్‌ నేతలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. రైతులు, వ్యవసాయానికి సంబంధించిన ఏ అంశంలోనైనా కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఉంటుందని చెప్పారు. అదే విషయాన్ని వరంగల్‌ డిక్లరేషన్‌లో కూడా స్పష్టం చేశామన్నారు.

అన్నాచెల్లెళ్ళ దుష్ప్రచారం : రేవంత్‌ రెడ్డి
కల్వకుంట్ల అన్నా చెల్లెళ్లు మూడు గంటలు అని దుష్ఫ్రచారం చేసినా, మూడు చెరువుల నీళ్లు తాగినా, ‘మీరు’ మూడో సారి అధికారంలోకి రావడం కల్ల అని టిపిసిసి అధ్యక్షులు ఎ.రేవంత్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమని, రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ఇచ్చేది కాంగ్రెస్‌ అని అన్నారు.

10 గంటలు కరెంటు వస్తే రాజీనామా
రాష్ట్రంలో నల్లగొండ సహా , ఏ ప్రాంతానికైనా పోదామని, రైతాంగానికి కనీసం పది గంటలు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా జరుగుతుందంటే తాను అదే సబ్‌ స్టేషన్‌లో రాజీనామా చేస్తానని మంత్రి కెటిఆర్‌కు కాంగ్రెస్‌ ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి సవాలు విసిరారు.

గమనికః కాంగ్రెస్‌ పేరుతో ఫోటో ఉంది
ప్రజాపక్షం / హైదరాబాద్‌ :
ఎఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్‌ గాంధీపై బిజెపి , కేంద్ర ప్రభుత్వం చేస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యలను నిరసిస్తూ గాంధీ భవన్‌ లో కాంగ్రెస్‌ శ్రేణులు బుధవారం నాడు రోజంతా మౌన సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. టిపిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎఐసిసి కార్యదర్శి మన్సూర్‌ అలీఖాన్‌, ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి , ఎఐసిసి కార్యదర్శులు దుద్దిళ్ళ శ్రీధర్‌ బాబు, సంపత్‌ కుమార్‌, ఎంఎల్‌సి టి.జీవన్‌ రెడ్డి, ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి , కాంగ్రెస్‌ నేతలు పొన్నాల లక్ష్మయ్య తదితరులు హాజరయ్యారు. సాయంత్రం మౌన దీక్ష ముగింపు సందర్భంగా నాయకులు ప్రసంగాలు చేశారు. శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ ఎఐసిసి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ సత్యాగ్రహ మౌన దీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. రాహుల్‌ గాంధీని బిజెపి టార్గెట్‌ చేసిందని ఆరోపించారు. భారత ప్రజలకు దైర్యం చెప్పడానికే రాహుల్‌ జోడో యాత్ర చేశారని, రాహుల్‌ కు ఇవాళ దేశం మొత్తం సంఘీభావం తెలుపుతోందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలోనే రైతులు అభివృద్ధి చెందారని, బిఅర్‌ఎస్‌ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు గమనించాలన్నారు. ఎఐసిసి ఇంఛార్జ్‌ కార్యదర్శి మన్సూర్‌ అలీ ఖాన్‌ మాట్లాడుతూ విద్వేషాన్ని అడ్డుకోవడానికి, దేశాన్ని రక్షించేందుకు రాహుల్‌ గాంధీ ఎంతో పోరాడుతున్నారని, దేశాన్ని ఒక్కటిగా ఉంచేందుకు కాంగ్రెస్‌ సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ఖర్గే పోరాడుతున్నారని తెలిపారు. తెలంగాణలో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి బిజెపి మద్దతు ఇస్తుందని, బిఆర్‌ఎస్‌ , బిజెపిని ఓడిచేందుకు ప్రజలంతా కాంగ్రెస్‌ పార్టీకి, రాహుల్‌ గాంధీ కి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఎంఎల్‌సి జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదం లో పడిందని, రాహుల్‌ గాంధీ దేశంలో ఉన్న ఆర్థిక నేరగాళ్ళను దృష్టిలో పెట్టుకొని నాలుగేళ్ళ క్రితం మాట్లాడిన విషయంపై పూర్తి శిక్షకాలమే రెండేళ్ళలని చెప్పారు. దీనికి పార్లమెంట్‌ సభ్యత్వం రద్దు మాత్రమే కాదు, ఆరేళ్ళు ఎన్నికల్లో పోటీ చేయకుండా కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. గతంలో గవర్నర్‌ ప్రసాంగాన్ని అడ్డుకున్నాడని గతంలో కోమటిరెడ్డి, సంపత్‌ కుమార్‌ ల శాసనసభ సభ్యత్వాలను కెసిఆర్‌ ప్రభుత్వం సభ్యత్వ రద్దు చేసిందని గుర్తు చేశారు.మోడీ సైతం కెసిఆర్‌ అడుగుజాడల్లో నడుస్తున్నారని ఆరోపించారు. రాహుల్‌ గాంధీ హిదెన్‌ బర్గ్‌ ఆరోపణలపై ప్రశ్నించినందుకు పార్లమెంట్‌ లో ఉండకుండా చేశారన్నారు. పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ మోడీ వాట్సప్‌ యూనివర్శిటీ రాహుల్‌ పైన అసమర్థుడు అనే ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తోందన్నారు. అదానికి, మోడీకి సంబంధం ఏంటనే దానికి సమాధానం చెప్పడానికి మోడీ భయపడుతున్నాడని, అందుకే రాహుల్‌ పై కక్ష సాధింపు చర్యలు చేపడుతోందన్నారు. గుజరాత్‌ కోర్టులు బిజెపి కార్యాలయాలుగా మారాయా అనే చర్చ ప్రజల్లో జరుగుతోందని, న్యాయ స్థానాలపై నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తోందన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments