HomeNewsBreaking Newsఉచిత పథకాల రద్దు యోచన రాజ్యాంగ హక్కులను కాలరాయడమే

ఉచిత పథకాల రద్దు యోచన రాజ్యాంగ హక్కులను కాలరాయడమే

పట్టణాల పేర్లు మారుస్తామనడం బండి సంజయ్‌ మూర్ఖత్వమే
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శ
ప్రజాపక్షం/వరంగల్‌ ప్రతినిధి
ఉచిత పథకాలను రద్దు చేద్దామనడం పేదలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాయడమేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రజల నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి కాకులను కొట్టి గద్దలకు వేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. హనుమకొండ బాల సముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బడా పెట్టుబడిదారులకు బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపుగా రూ.15 లక్షల కోట్ల రూపాయల బకాయిలు రద్దు చేసి ఆదాని, అంబానీలకు దేశ సంపదను కట్టబెట్టిందని అన్నారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ రాష్ట్రంలో వివిధ పట్టణాలకు ఉన్న పేర్లను మారుస్తామని అంటున్నారని, బండి సంజయ్‌, అమిత్‌ షాకు వారి అమ్మానాన్న పెట్టిన పేరును కూడా బండి సంజయ్‌ మార్చుకుంటారా అని ప్రశ్నించారు. పట్టణాల పేర్ల వెనక ఎంతో చారిత్రాత్మకమైన నేపథ్యం ఆ ప్రాంత ప్రజల జీవన విధానం, సంస్కృతి మీద ఆధారపడినదేనని, తెలుగు భాషా సంస్కృతి ప్రతిపాదికన ఏర్పడిన పేర్లే పట్టణాలకు పెట్టారని, పట్టణాల పేర్లు వాటిని మారుస్తామనడం మూర్ఖత్వం అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశాభివృద్ధి మరిచిపోయి మతోన్మాదాన్ని పెంచిపోషిస్తున్నదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ధి బిజెపి ప్రభుత్వానికి లేదన్నారు. కరీంనగర్‌ పార్లమెంటు సభ్యులుగా గెలిచిన బండి సంజయ్‌ కరీంనగర్‌ నియోజకవర్గం
పరిధిలో ఉన్నటువంటి గ్రామాల అభివృద్ధికి గానీ పట్టణాల అభివృద్ధికి గానీ కృషి చేయకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టడం కొరకు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో పర్యటనలు చేస్తున్నారన్నారు. గోద్రా మారణ హోమానికి గురైన బిల్కిస్‌ భానో వేసిన పిటిషన్‌ ను సుప్రీంకోర్టు కొట్టివేసిందని, ఆ మారణహోమంలో ఆమె తన సర్వస్వాన్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యున్నతమైన న్యాయస్థానం కూడా అలాంటి విషయాన్ని పట్టించుకోకుండా పిటిషన్‌ కొట్టివేయడం కారణంగా న్యాయం జరగకుండా పోయే పరిస్థితులు కనబడుతున్నాయని, న్యాయ వ్యవస్థను కూడా బిజెపి తన అధికార బలంతో నియంత్రిస్తున్నదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులకు పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న బిజెపి నాయకులు టోల్‌ గేట్ల పేరుతో ప్రజల వద్ద నుండి పన్నుల రూపకంగా కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన విభజన హామీలైన కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన యూనివర్సిటీ హామీలను అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను బిజెపి మోసం చేస్తుందని అన్నారు. జిఎస్‌టి పన్నుల వాటా 30 కోట్లు తెలంగాణకు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. రైతుల, కార్మికుల, విద్యార్థి యువజన , పేదల సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు నిరంతరం కొనసాగుతాయని అయినా అన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు కాలంలో పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టించిన చరిత్ర గతంలో మనం చూశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇండ్ల స్థలాల కొరకు పోరాటాలు చేస్తున్న ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని గుడిసెలు వేసుకున్న పేదలకు ఆ స్థలాల పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పేదలకు ఇండ్ల స్థలాల కోసం ఢిల్లీలో కూడా ఆందోళన ఉదృతం చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు టి.వెంకట్రాములు, జిల్లా కార్యదర్శి కర్రే బిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్‌ పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments