పార్టీ విధాన నిర్ణయాలను మేం నియంత్రించలేం
పార్టీ గుర్తింపు రద్దు అధికారం ఇవ్వాలని ఎప్పుడో అడిగాం
సుప్రీంకోర్టుకు చెప్పిన కేంద్ర ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ : ఎన్నికలకు ముందు, ఎన్నికల అనంతరం రాజకీయ పార్టీలు, గెలిచిన పార్టీల ప్రభుత్వాలు ప్రజలకు ఎరచూపే ‘ఉచిత పథకాలు’పై అంతిమ నిర్ణయాధికారం ఓటర్లదేనని కేంద్ర ఎన్నికల సంఘం (సిఇసి) శనివారం నాడు సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ మేరకు ఎన్నికల సం ఘం ఒక అఫిడవిట్ సమర్పించింది. వివిధ రాజకీయపార్టీలు తీసుకునే విధాన నిర్ణయాలను, గెలిచిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీ ఉచిత పథకాలకు సంబంధించి తీసుకోబోయే నిర్ణయాలను ఎన్నికలసంఘం నిర్దేశించలేదని అఫిడవిట్‌లో పేర్కొంది. ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు రాజకీయపార్టీలు ఎన్నికల ప్రచారం సందర్భంగా లేదా ఎన్నికలు పూర్తయిన తరువాత ఉచిత పథకాలను ఎరగా చూపించడం అనేది ఆయా పార్టీల విధాన నిర్ణయాలకు సంబంధించిన విషయమని, దీనిని ఎన్నికల సంఘం నియంత్రించలేదని, చట్టంలో అందుకు తగిన నిబంధనలు, తగిన అధికారాలు లేకుండా ఎన్నికల కమిషన్ ఏమీ చేయలేదని అఫిడవిట్‌లో సిఇసి తెలియజేసింది. ఎన్నికల ప్రచారంలో అలవికాని వాగ్దానాలతో ప్రవర్తించే పార్టీల గుర్తింపు రద్దు, ఎన్నికల చిహ్నం రద్దు చేసే అధికారాలు ఇచ్చేందుకు తగిన కృషి చేయాలని 2016 డిసెంబరులోనే కేంద్ర న్యాయమంత్రిత్వశాఖకు ఎన్నికల కమిషన్ సిఫార్సులు చేసిందని కూడా సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఇలాంటి అధికారం వల్ల పార్టీ గుర్తింపు, ఎన్నికల చిహ్నం రద్దు చేయడం లేదా తిరిగి గుర్తింపు ఇవ్వడం వంటి విచక్షణకు, పార్టీలకు తగిన ఉత్తర్వులు జారీ చేయడానికి వీలు కలగుతుందని తాము సిఫార్సుచేశామని పేర్కొంది. ప్రభుత్వ నిధులను దుబారాచేసి దివాళా తీయించే పద్ధతులలో ఆచరణ సాధ్యం కాని ఉచిత పథకాలు అమలు చేస్తామని రాజకీయపార్టీలు ఎన్నికల ప్రచారాలలో ప్రజలకు వాగ్దానం చేస్తే ఎన్నికల సంఘం ఆయా పార్టీల ఎన్నికల చిహ్నాలను, గుర్తింపును రద్దు చేయవచ్చునంటూ సుప్రీంకోర్టును పిల్ ద్వారా ఆశ్రయించిన న్యాయవాది అశ్వనీ కుమార్ గంగోపాధ్యాయ చేసిన విజ్ఞప్తిని కూడా ఎన్నికల సంఘం తన అఫిడవిట్‌లో పేర్కొంది. అయితే కేవలం మూడు కారణాలపేరుతో తప్ప మరేవిధంగానూ రాజకీయపార్టీల గుర్తింపును, ఎన్నికల చిహ్నాలను రద్దుచేసే అధికారాలు ఎన్నికల సంఘానికి లేవని సుప్రీంకోర్టు 2002లో ఒక తీర్పు ఇచ్చింది. మోసంద్వారా, ఫోర్జరీ ద్వారా గనుక ఏ పార్టీ అయినారిజిస్ట్రేషన్ చేయించుకున్నాగానీ, లేదా రాజ్యాంగంపై విశ్వాసం ప్రకటించి రిజిస్టరు చేసుకున్న రాజకీయపార్టీ తన నిబంధనలను సవరించుకున్నాగానీ గుర్తింపు రద్దు నిబంధనలు వర్తిస్తాయి. రాజకీయ పార్టీలు ఉచితాలు పంపిణీ చేస్తామని రాజకీయపార్టీలు ఎన్నికల ప్రచారాల్లో చెప్పకూడదనే ఆదేశాలు జారీ చేయాలని గంగోపాధ్యాయ తన పిటిషన్‌లో పేర్కొన్న విషయాన్ని కూడా ఎన్నికల సంఘం తన అఫిడవిట్‌లో ప్రస్తావించింది. కాగా ఎన్నికల తేదీలు జారీ చేశాక అమలయ్యే ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని నిబంధనలను కూడా గుర్తింపు పొందిన జాతీయ రాజకీయపార్టీలను సంప్రదించే రూపొందిస్తామని కూడా ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అయితే రాజకీయపార్టీలు ప్రకటించే ఎన్నికల ప్రణాళికలు, చేసే కార్యక్రమాలు వాటి ప్రతులను తమకు సమర్పించాలని కూడా ఎన్నికల సంఘం పార్టీలకు ఆదేశాలు జారీ చేస్తుంది. ఒకవేళ ఎన్నికల ప్రణాళికలలో, ఎన్నికల చట్టాల ప్రకారం అమలుసాధ్యం కాని వాగ్దానాలు ఏమైనా ఉంటేగనుక, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా నడుచుకుంటామని పేర్కొంటూ రాజకీయపార్టీల నుండి ఎన్నికల సంఘం ఒక డిక్లరేషన్ తీసుకుంటుందని కూడా 2016 డిసెంబరులో చేసిన సిఫార్సులలో పేర్కొన్నట్లు కూడా సుప్రీంకోర్టుకు తెలియజేసింది. రాజకీయ పార్టీలు ప్రచారం సందర్భంగా ప్రకటించే ఈ ఉచిత పథకాలు ఆర్థికంగా అమలు సాధ్యమా? సాధ్యం కాదా? లేక ఆర్థిక వ్యవస్థపైన, ప్రజలపైన ప్రతికూల ప్రభావం చూపిస్తాయా? అనే విషయాన్ని అంతిమంగా ఓటరులే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత ప్రజలకు ఉచితంగా చేసే పంపిణీలు, చేసే ప్రకటనలన్నీ విధాన నిర్ణయాలకు సంబంధించినవేనని,అంతిమంగా ఈ విధానాలను ఆయా రాష్ట్రాలలోని ప్రజలే పర్యవేక్షించుకోవాలని పదే పదే నొక్కిచెప్పింది. న్యాయవాది అశ్వనీకుమార్ దూబే ద్వారా జనవరి 25న సుప్రీంకోర్టులో రాజకీయపార్టీల ఉచిత వాగ్దానాలపై ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్‌పై తగిన సమాధానం చెప్పాలని కోరుతూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఎన్నికల సంఘాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరుతూ అఫిడవిట్లు సమర్పించాలని పేర్కొనడంతో ఎన్నికల సంఘం ఈ మేరకు అఫిడవిట్ సమర్పించింది. ఐదు రాష్ట్రాల్లో ఎనికలకు ముందుగా, పార్టీల ఉచిత వాగ్దానాలను ఎన్నికల కట్టడి చేయాలని కోరుతూ ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.