నిర్ధారించిన ఎన్‌ఐఎ కోర్టు
25న తీర్పునిచ్చే అవకాశం
అప్పీల్ చేసుకోబోనని కశ్మీర్ వేర్పాటువాద
ఉద్యమనేత స్పష్టీకరణ
పటియాల్లా : ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం చేస్తున్నాడని, దేశంలో ప్రత్యేకంగా కశ్మీర్ లోయలో భారతీయులను, సైన్యాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్న తీవ్రవాదులకు సహాయసహకారాలు చేస్తున్నాడని కశ్మీర్ వేర్పాటువాద ఉద్యమ నేత యాసిన్ మాలిక్‌పై నమోదైన నేరాలు రుజువయ్యాయి. ఈ విషయాన్ని ఎన్‌ఐఎ ప్రత్యేక కోర్టు ప్రకటించింది. అతనికి ఈనెల 25న శిక్షను ఖరారు చేయనుంది. ఈలోగా మాలిక్ ఆర్థిక పరిస్థితిపై విచారణ జరిపి, అఫిడవిట్‌ను సమర్పించాల్సిందిగా అధికారులను ఆదేశించింది. ఉగ్రవాదులకు మాలిక్ సాయం చేస్తున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో అతనిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ) సెక్షన్ 16 (ఉగ్రవాద కార్యకలాపాలు), 17 (ఉగ్రవాద కార్యకలాపాలకు సొమ్ము సమకూర్చడం), 18 (ఉగ్రవాద దాడులకు కుట్రపన్నడం), 20 (ఉగ్రవాద సంస్థలు లేదా సంఘాల్లో సభ్యత్వం కలిగి ఉండడం)తోపాటు భారత శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్ 120 బి (నేరపూరిత కుట్ర), 124 B (దేశద్రోహం) కింద కూడా అభియోగాలు మోపారు. కాగా, తన నేరాన్ని మాలిక్ అంగీకరించాడు. ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ప్రోత్సాహంతో ఉగ్రవాద కార్యకలాపాలవైపు ఆకర్షితుడైన యాసిన్ మాలిక్ లష్కరే తొయిబా, హిజ్‌బుల్ ముజాహిదీన్, జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్, జైషె మహమ్మద్ తదితర సంస్థలకు ఆర్థిక సాయం అందించినట్టు వచ్చిన ఆరోపణలను అతను ఖండించలేదు. తాను నేరాన్ని అంగీకరిస్తున్నానని ప్రకటించాడు. ఎన్‌ఐఎ ప్రత్యేక కోర్టు ఇవ్వబోయే తీర్పుపై అప్పీల్ చేసుకోవాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశాడు. కశ్మీర్ వేర్పాటువాద ఉద్యమానికి నాయకత్వం వహించిన ముఖ్యుల్లో ఒకడిగా ఉన్న మాలిక్ తన నేరాలను అంగీకరించడంతో, అతనికి విధించబోయే శిక్షపై అంతటా ఉత్కంఠ నెలకొంది. కాగా, లష్కరే తొయిబా సహ వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్, షబ్బీర్ అహమ్మద్ షా, హిజ్‌బుల్ ముజాహిదీన్ చీఫ్ సలాహుద్దీన్, రషీద్ ఇంజనీర్, జహూర్ అహమ్మద్ షా వతాలీ, షాహిద్ ఉల్ ఇస్లాం, అల్తాఫ్ అహమ్మద్ షా అలియాస్ ఫాంటూష్, నయీమ్ ఖాన్, ఫరూఖ్ అహమ్మద్ దార్ అలియాస్ బిట్టా కరాటే తదితరులు కూడా ఎన్‌ఐఎ చార్జిషీట్‌లో ఉన్నారు.
ఉగ్రవాద సంస్థలకు నిధుల కేసులో యాసిన్ మాలిక్ దోషి
RELATED ARTICLES