78 సైనిక వాహనాలపై టెర్రరిస్టుల మెరుపుదాడి
350 కిలోల పేలుడు పదార్థాలను వాడిన ముష్కరులు
ఈ దాడి మా పనే : జైషే మహ్మద్ ప్రకటన
కశ్మీర్‌లోయలో ఉగ్రవాదుల ఘాతుకం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. భద్రతా బలగాలే లక్ష్యంగా దాడులు చేశారు. గురువారం పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు బస్సు లో ప్రయాణిస్తుండగా ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో వచ్చి దాడి చేశారు. ఈ ఘటనలో 40 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయపడ్డారు. జవాన్ల శరీర భాగాలు ఆ ప్రదేశంలో చెల్లాచెదురుగా పడ్డాయి. 2016లో జరిగిన యురి దాడి ఘటన తరువాత ఇదే అతి పెద్ద ఉగ్ర దాడి అని అధికారులు పేర్కొన్నారు. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళానికి చెందిన 2500 మందికి పైగా సిబ్బంది 78 వాహనాల్లో ప్రయాణిస్తుండగా ఉగ్రవాదులు శ్రీనగర్ జమ్మూ రహదారిలోని అవంతిపొరా ప్రాంతంలో మెరుపుదాడికి పాల్పడ్డారు. జవాన్లలో అత్యధికులు సెలవులను ముగించుకొని విధుల్లో చేరేందుకు కశ్మీర్ లోయ నుంచి తిరిగి వస్తున్నా రు. ఆత్మాహుతి దాడి ఉపయోగించిన 350 కిలోల పేలుడు పదార్థాలుగల వాహనాన్ని 2018లో జైషే మహ్మద్ ఉగ్రసంస్థలో చేరిన పుల్వామా జిల్లా కకపొరాకు చెందిన టెర్రరిస్టు అదిల్ అహ్మద్ నడిపినట్లు పోలీసులు చెప్పారు. ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు. శ్రీనగర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ దాడికి పాల్పడింది తామేనని జైషే మహ్మద్ ఉగ్రసంస్థ ప్రకటించిందన్నారు. దాడిలో జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు పూర్తిగా ధ్వంసమైంది. కాగా, అత్యధిక వాహనాల్లో 2500 మంది జవాన్లు ప్రయాణిస్తున్న పెద్ద వాహన శ్రేణి అని, శ్రేణిపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి జరపడంతో పాటు కాల్పులు కూడా చేసినట్లు సిఆర్‌పిఎఫ్ డిజి ఆర్‌ఆర్ భట్‌నగర్ మీడియాకు వెల్లడించారు. కాన్వాయ్ గురువారం తెల్లవారుజామున 3.30 గంటలకు జమ్ము నుంచి బయలుదేరిందని, సూర్యోదయం లోపే శ్రీనగర్‌కు చేరుకోవాల్సి ఉండేదని అధికారులు స్పష్టం చేశారు. ఘటన నేపథ్యంలో అనేక మంది భద్రతా సిబ్బంది తిరిగి లోయకు వెళ్లిపోయారన్నారు. దాడి జరిగిన రహదారిపై ప్రతికూల వాతావరణం ఉండడం, ఇతర పాలనాపరమైన కారణాలు నెలకొన్ని ఉన్న నేపథ్యంలో రెండు, మూడు రోజుల వరకు వాహన రాకపోకలు జరగవన్నా రు. ఘటనాస్థలికి ఫోరెన్సిక్, బాంబు విశ్లేషణ బృందాలు చేరుకున్నాయి. ఇదిలా ఉండగా ఘటనపై కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ సత్యపాల్ మాలిక్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పరిస్థితిని సమీక్షించారు. శుక్రవారం నాటి కార్యక్రమాలన్నింటిని రద్దు చేసుకున్నారు. నేడు జమ్మూకశ్మీర్‌లో పర్యటించే అవకాశముంది. హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గబ, సిఆర్‌పిఎఫ్ డిజి భట్నాగర్‌తో రాజ్‌నాథ్ ఫోన్‌లో మాట్లాడారని, వారికి అసరమైన సూచనలు చేసినట్లు హోంమంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. దాడిని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బంగా సిఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సిఎం కేజ్రీవాల్, జమ్మూకశ్మీర్ మాజీ సిఎంలు ఒమర్ అబ్దుల్ల మెహబూబా ముఫ్తీతో పాటు పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు. జవాన్లపై దాడి అత్యంత దారుణమని, వారి త్యాగం వృథా కాదని ప్రధాని ట్వీట్ చేశారు. ఘటనపై హోంమంత్రి రాజ్‌నాథ్, ఇతర ఉన్నతాధికారులతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. అలాగే క్షతగాత్రులు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘పుల్వామా దాడిలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా బాధించింది. అమరులైన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.