ప్రపంచ దేశాల్లో పాకిస్థాన్‌ను ఏకాకిని చేద్దాం
భారత్ భద్రతా దళాలపై ఉగ్రదాడులు హేయం
ఉగ్రవాద కేసుల్లో జాతీయ దర్యాప్తు సంస్థ పాత్ర కీలకం
ఎన్‌ఐఎ కార్యాలయ ప్రారంభోత్సవంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్
ప్రజాపక్షం/హైదరాబాద్: ఉగ్రవాదులకు సహాయ సహకారాలు అందిస్తున్న పాకిస్థాన్‌ను ప్రపంచ దేశాల్లో ఏకాకి చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఉగ్రవాదులను అంతం చేసేందుకు దేశం అంతా ఒకే వేదికపై ఉందన్నారు. ఉగ్రవాదకు సంబంధించిన కేసు లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) పాత్ర అత్యంత కీలమైందని పేర్కొన్నారు. మాదాపూర్‌లో అత్యంత ఆధునిక వసతులతో నిర్మించిన ఎన్‌ఐఎ నూతన భవనానికి రాజ్‌నాథ్‌సింగ్ ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఎన్‌ఐఎ కార్యాలయం ప్రారంభం అవుతున్నందుకు తె లంగాణ ప్రజలకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ పుల్వామాలో భారత భద్రత దళాలపై ఉగ్రవాదులు చేసిన దాడి హేయమైనదన్నారు. ఇలాంటి దాడులు మళ్లీ పునరావృత్తం కా కుండా ఉగ్రవాదాన్ని తరిమికొట్టాల్సిన అవసరం ఉందని రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. పుల్వామా దాడి తరువాత ప్రధాని మోడీ నేతృత్వంలో ఎంతో సమర్థవంతంగా పాక్ దుశ్చర్యలను భారత్ ఎదుర్కొందని, ప్రపంచ దేశాలు మనకు బాసటగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఇందుకు నిదర్శనంగా ఇస్లామిక్ దేశాల సమావేశానికి మొట్టమొదటిసారి మన విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ను గౌరవ అతిథిగా ఆహ్వానించారని తెలిపారు. ప్రపంచంలో టెర్రరిస్టులను తరిమికొట్టేందుకు అన్ని దేశాలు కృషి చేస్తున్నాయన్నారు. దేశంలో మార్పు కోసం అన్ని సంస్థలతో పాటు ఎన్‌ఐఎ పాత్ర కూడా ఉండాలన్నారు. ప్రపంచంలో కీలకమైన కేసుల్లో ఎన్‌ఐఎ విచారణ బాగా చేయడంలో సఫలం అవుతుందన్నారు. ఉగ్రవాదాన్ని పోషించేందుకు టెర్రర్ ఫండింగ్‌ని ఎన్‌ఐఎ విచారణ ద్వారా అడ్డుకుంటున్నామన్నారు. కీలకమైన కేసులను ఎన్‌ఐఎ విచారణ ద్వారా పరిష్కారం చేస్తున్నామన్నా రు. ఏ సంస్థ అయిన తన విజయం సాధించాలంటే అన్ని విచారణ సంస్థలను కలుపుకుని విచారణ చేయాలని సూచించారు. ఐఎస్‌ఐఎస్‌పై విచారణ చేసేందుకు ఎన్‌ఐఎకి హోమ్‌శాఖ పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందన్నారు. ఎన్‌ఐఎ సంస్థలో అధికారులు, ఉద్యోగులు అందరు కలిసికట్టుగా కృషి చేస్తుండడాన్ని ఆయన అభినందించారు.2009లో ఏర్పాటైన ఈ సంస్థకు ఇటీవలి కాలంలో ఉగ్రవాద చర్యలకు సంబంధించిన అనేక కేసులను అప్పచెప్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఈ సంస్థకు 249 కేసులు అప్పగించగా 180 కేసులలో చార్జీషీట్లు ఫైల్ చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ సంస్థ చేపట్టిన కేసులలో 92 శాతం కేసులలో నేరాలు నిర్ధారణ జరిగి, శిక్షలు విధించడం జరిగిందన్నారు.