రాష్ట్రంలో 33 కరోనా పాజిటివ్ కేసులు
ఇళ్లల్లో ఉండటమే కరోనాకు సరైన చికిత్స
హోమ్ క్వారంటైన్‌లో ఉన్నవాళ్లు బయటికి రావొద్దు
మీడియా సమావేశంలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
హైదరాబాద్ : ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా గుర్తించిన వారి సంఖ్య 33కి చేరిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. మరో 97 మంది అనుమానితులు ఉన్నారని, వారి నివేదికలు ఇంకా రావాల్సి ఉందని ఆయన తెలిపారు. 33 కేసుల్లో 31 కేసులు బయటి దేశాల నుంచి వచ్చినవారే ఉన్నారు. ఇండోనేషియా, స్కాట్‌లాండ్, లండన్, దుబాయి, స్పానిష్ తదితర దేశాల నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారని ఆయన తెలిపారు. మిగతా రెండు కేసుల్లో ఒకటి కరీంనగర్ నుండి, మరొకటి సికింద్రాబాద్ నుండి నమోదయ్యాయి.హైదరాబాద్‌లోని కరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సోమవారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడారు. క్వారంటైన్‌లో ఉన్న వాళ్లను 14 రోజుల తర్వాత పరీక్షలు చేసి ఇంటికి పంపిస్తామని, ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. ప్రజలు మాత్రం ఎవ్వరూ బయటికి రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.విదేశాల నుంచి వచ్చిన వారు, హోమ్ క్వారంటైన్‌లో ఉన్న వాళ్లు కచ్చితంగా 14 రోజుల పాటు తమ తమ ఇళ్లల్లోనే ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని మంత్రి ఈటల రాజేందర్ కోరారు. క్వారంటైన్‌లో ఉండే వారు స్వీయ నియంత్రణ పాటించాలని, ఇంళ్ల నుంచి బయటకు వచ్చి వైరస్ వ్యాప్తికి కారణం కావొద్దని ఆయన సూచించారు. అలాంటి వారు ఎవరైనా బయటికి వచ్చి రోడ్లపై తిరిగితే ఆ సమాచారాన్ని ప్రజలు అధికారులకు అదించాలని తెలిపారు. హోం క్వారంటైన్‌లో ఉన్న వాళ్లు మాత్రం బయట తిరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని,వారిపై కేసులు తప్పవని మంత్రి హెచ్చరించారు.
ఇళ్లల్లోనే ఉండండి…: ఎవరి ఇళ్లల్లో వారు ఉండడమే దీనికి సరైనా చికిత్స అని మంత్రి ఈటల చెప్పారు. ఈ 10 రోజులు చాలా కీలక సమయమని, నిర్లక్ష్యంగా ఉండొద్దని ఆయన మరీ మరీ కోరారు. ఓపికతో ఉంటే దీన్ని తరిమి కొట్టే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బాధితుల సంఖ్య పెరగకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. వైరస్ సోకిన తరువాత నయడం చేయడం చాలా కష్టమని ముందస్తు జాగ్రత్తలు ప్రభుత్వ సూచనలు పాటించాలని పేర్కొన్నారు. నిత్యవసరాల కోసం ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే బయటకు రావాలని మంత్రి వెల్లడించారు. స్టేజ్ చేరుకుంటున్నామని, స్టేజ్ పరిస్థితి రానీయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, కరోనా వ్యాప్త నిరోధించేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ నెల 31 వరకు అందరూ ఇళ్లకే పరిమితం కావాలని ఆయన కోరారు. జనతా కర్ఫ్యూలో పాల్గొని ప్రజలు విజయవంతం చేశారని మంత్రి తెలిపారు. ఆ స్ఫూర్తిని మరిప్పుడు ఎందుకు చూపించడంలేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాను తరిమికొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 31 వరకు ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని లాక్‌డౌన్ ప్రకటిస్తే కొందరు మాత్రం…ఏం పనిలేకున్నా బయటకు వస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రాణాలతో ఉంటే తరువాతా ఏదైనా చేసుకోవచ్చని, ప్రాణాలు ముఖ్యమా? పని ముఖ్యమా? అని ప్రశ్నించారు. కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వానికి సమాచారం అందించాలని కోరారు. కొంత మంది విదేశాల నుంచి వచ్చి కూడా అధికారులకు సమాచారాన్ని అందించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి సెలవులు రద్దు చేశామని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పినిచేసే సిబ్బంది సైతం విధులకు రావాలని స్పష్టం చేశారు. వారికి కావాలసిన రవాణా ఏర్పాట్లు అవసరమైతే చేస్తామని ఆయన తెలిపారు. పరిస్థితి విషమిస్తే ప్రైవేట్ ఆసుపత్రులను వనియోగించుకుంటామని పేర్కొన్నారు. సాధారణ ఓపిలు, జనరల్ చెకప్‌ల కోసం ఆసుపత్రులకు రావొద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ 10 రోజులు చాలా కీలకం
RELATED ARTICLES