పారిశుద్ధ్య కార్మికులు సిఎంకు గుర్తుండకపోవడం శోచనీయం
ఇందిరా పార్కు వద్ద భారీ ధర్నా
ప్రజాపక్షం / హైదరాబాద్ ఎన్నికలకు ముందు పారిశుద్ధ్య కార్మికులను దేవుళ్ళ తో పోల్చిన ముఖ్యమంత్రికి, తరువాత ఈ దేవుళ్లు గుర్తుకురాకపోవటం శోచనీయమని ఎఐటియుసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.డి.యూసుఫ్ అన్నారు. పిఆర్‌సి ప్రకారం మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఇందిరాపార్కు వద్ద మున్సిపల్ జెఎసి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ డిపార్టుమెంట్‌లలో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు పిఆర్‌సి అమలు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్, ఆ హామీని అమలు చేయకపోవటం దురదృష్టకరమన్నారు. హైదరాబాద్ వంటి మహానగరంలో కనీస సౌకర్యాలతో జీవించాలంటే కనీసం రూ.30 వేలు అవసరమవుతాయని, కానీ పిఆర్‌సి పెంచినప్పటికీ రూ.20 వేలకు మించి వేతనాలు రావని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పిఆర్‌సి వేతనాలైనా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిహెచ్‌ఎంసి, మేడ్చెల్ జిల్లాల్లోని మున్సిపాల్టీలతో పాటు ఇతర మున్సిపాల్టీలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు రకరకాలుగా వేతనాలు చెల్లిస్తున్నారని, కనీసం రూ.18వేలు చెల్లించాలన్న కోర్టు సలహాను కూడా ప్రభుత్వం పాటించటం లేదని విమర్శించారు. చట్ట ప్రకారం ఇవ్వాల్సిన పండుగ, జాతీయ సెలవులు అమలు చేయటం లేదని, ప్రభుత్వమే చట్టాలను ఉల్లంఘిస్తే ప్రైవేటువారి సంగతి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. సమస్యల పరిష్కారం, హక్కులు సాధనకు పోరాటాలు తప్ప వేరే మార్గం లేదని యూసుఫ్ స్పష్టం చేశారు. ఎఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మున్సిపల్ కార్మిక సంఘం (ఎఐటియుసి) రాష్ట్ర అధ్యక్షుడు కె.ఏసురత్నం మాట్లాడుతూ 10 సంవత్సరాలకు పైబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, వేతనాలను వెంటనే పెంచి అమలు చేయాలని, ఇఎస్‌ఐ, పిఎఫ్‌లలో జరుగుతున్న అవకతవకలను సరిచేయాలని, ఈ ధర్నాలకు స్పందించి న్యాయమైన కోర్కెలను పరిష్కారం చేయని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ధర్నాలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరి జయచంద్ర, మార్టిన్, హరినాథరావు, శ్రీను, పీటర్, జైపాల్‌రెడ్డి, ఆనంద్‌లతో పాటు కార్మికులు వందల సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ దేవుళ్లు గుర్తుకొస్తలేరా?
RELATED ARTICLES