ప్రజాపక్షం/హైదరాబాద్: రాష్ట్రంలో రెండు రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో టిఆర్‌ఎస్ సిట్టింగ్ రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు, ఖమ్మం మాజీ ఎం.పి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్లు దాదాపు ఖరారైనట్టు సమాచారం. దీంతో మాజీ ఎంపి కల్వకుంట్ల కవితకు ఈ సారి రాజ్యసభకు పంపించే అవకాశాలు లేవు. రెండు రాజ్యసభ స్థానాల్లో సిట్టింగ్ సభ్యులు కెకెతో పాటు కవితను కూడా రాజ్యసభకు పంపించే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఆమె మాత్రం ప్రత్యక్ష రాజకీయాల వైపే మొగ్గుచూపుతున్నట్టు కొందరు నేతలు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపిలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రొఫెసర్ సీతరామ్‌నాయక్‌లను పక్కనపెట్టి ఇతరులకు టిఆర్‌ఎస్ అవకాశం కల్పించింది. ఆ క్రమంలో వారికి ఇతర అవకాశాలు కల్పిస్తామని సిఎం కెసిఆర్ స్పష్టమైన హామీనిచ్చినట్టు ప్రచారం జరిగింది. అయితే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి మాత్రం రాజ్యసభకు పంపిస్తామనే సంకేతాలు ఇచ్చినట్టు తెలిసింది. అందులో భాగంగానే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి అవకాశం దక్కనుంది.
మరోవైపు గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఎంఎల్‌సికి దాదాపు దేశపతి శ్రీనివాస్ పేరును ఖరారు చేసినట్టు తెలిసింది. అలాగే నిజామాబద్ స్థానిక సంస్థల కోటా ఎంఎల్‌సిగా అదే జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ కెఆర్ సురేష్‌రెడ్డి పేరును ఖరారు చేయనున్నారు. అయితే సురేష్ రెడ్డి విముఖత వ్యక్తం చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒక వేళ సురేష్‌రెడ్డి ఎంఎల్‌సిగా వెళ్లేందుకు అంగీకరించకపోతే ఇతరులకు చాన్స్ లభించవచ్చు. మొత్తానికి రెండు రాజ్యసభ, రెండు ఎంఎల్‌సి పేర్లను ముఖ్యమంత్రి కెసిఆర్ ఒకేసారి ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈసారి కవితకు నో ఛాన్స్!
RELATED ARTICLES