కేజ్రీవాల్‌ను తీహార్ జైలుకు తరలించిన అధికారులు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈనెల 15వ తేదీ వరకూ జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత అధికారులు ఆయనను తీహార్ జైలుకు తరలించారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం, మనీలాండరింగ్ ఆరోపణలపై కేజ్రీవాల్‌ను మార్చి 21న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఇడి కస్టడీలోనే ఉన్నారు. తొలుత కోర్టు కేజ్రీవాల్‌ను మార్చి 28వ తేదీ వరకూ కస్టడీకి అంగీకరించింది. ఆ తర్వాత ఇడి అధికారుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని ఆయన కస్టడీని ఏప్రిల్ ఒకటో తేదీ వరకూ పెంచింది. కస్టడీ ఈనెల ఒకటో తేదీ, సోమవారంతో ముగియడంతో అధికారులు ఆయనను కోర్టులో హాజరుపరిచారు. కాగా, విచారణకు కేజ్రీవాల్ సహకరించడం లేదని ఆరోపించిన ఇడి అధికారులు మరికొంతకాలం కస్టడీకి ఇవ్వాలని కోరారు. కేసు పూర్వాపరాలు, వాదనలు విన్న తర్వాత, కేజ్రీవాల్‌ను జ్యుడిషియల్ కస్టడీకి ఇస్తున్నట్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఆదేశాలు జారీ చేశారు. ఆ సమయంలో ఢిల్లీ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్, కేజ్రీవాల్ భార్య సునీత తదితరులు కోర్టు హాల్‌లోనే ఉన్నారు. న్యాయమూర్తి ముందు హాజరయ్యేందుకు వచ్చిన కేజ్రీవాల్, కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ తప్పు చేస్తున్నారని, ఆయన చర్యలు దేశానికి నష్టం చేసేవిలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇలావుండగా, విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పిటిఐ వార్తాకథనం ప్రకారం తీహార్ జైల్‌లోకేజ్రీవాల్‌కు జైలు నెంబర్ 2 ను కేటాయిస్తారు. ఆయనకు టీవీ చూసే సౌకర్యాన్ని కల్పిస్తారు. ఆయన మొత్తం 18 నుండి 20 చానల్స్‌ను చూసే అవకాశం కల్పించారు. కేజ్రివాల్ డయాబెటిక్ పేషెంట్ కావడంతో, ఆయనకు క్రమం తప్పకుండా వైద్య సేవలు అందించడానికి 24 గంటలు మెడికల్ స్టాప్ అందుబాటులో ఉంటారు. వారంలో రెండుసార్లు కుటుంబ సభ్యులను కలుసుకునే వీలును కల్పించారు. అయితే కుటుంబ సభ్యుల జాబితాను నిర్ధారించుకున్న తర్వాతే జైలు అధికారులు వారిని అనుమతిస్తారు. జైలులో కేజ్రీవాల్ దినచర్య ఇతర ఖైదీలతోపాటే ఉదయం ఆరున్నర గంటలకు ప్రారంభమవుతుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా టీ, బ్రెడ్ ఇస్తారు. ఆ తర్వాత తన కేసు విచారణ ఉంటే కోర్టుకు, లేదంటే తన న్యాయవాదుల బృందంతో కేజ్రీవాల్ సమావేశం అవుతారు. పదిన్నర గంటల నుండి 11 గంటల వరకు లంచ్ ఇస్తారు. ఇందులో పప్పు, కూరలు రొట్టెలు కానీ అన్నం కానీ పెడతారు. ఆ తర్వాత మూడు గంటల నుండి ఖైదీలను సైల్‌లోనే ఉంచుతారు. మూడున్నర గంటలకు టీ, రెండు బిస్కెట్లు ఇస్తారు. ఆపై లాయర్లను కలవచ్చు. ఇక జైలులో సాయంత్రం ఐదున్నర గంటలకు డిన్నర్ ఉంటుంది. అనంతరం ఏడు గంటల నుండి జైలు గదిలోనే ఉంటారు. ఇలా ఆయన దినచర్య కొనసాగుతుంది. కాగా, తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ కేజ్రీవాల్ మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష పార్టీల నాయకులను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపిస్తున్నారు.
ఈనెల 15 వరకూ జ్యుడిషియల్ కస్టడీ
RELATED ARTICLES