ప్రకటించిన సంయుక్త్ కిసాన్ మోర్చా
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ ప్రవేశమార్గం వద్ద ఉన్న మూడు సరిహద్దు ప్రాంతాల్లో ఏడాదికాలంగా కొనసాగిన రైతు ఉద్యమ కేంద్రాలను ఈనెల 15వ తేదీ నాటికి రైతులు పూర్తిగా ఖాళీ చేస్తారని సంయుక్త్ కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) ఆదివారం ప్రకటించింది. ఢిల్లీని వదిలి పంజాబ్, హర్యానాలకు తిరిగి వెళ్ళిపోయే ప్రక్రియ మూడు రోజులపాటు కొనసాగుతుందని ఎస్‌కెఎం ఛత్రం కింద ఉన్న 40 రైతు సంఘాలలో ప్రధానపాత్ర వహిస్తున్న ఒక రైతు సంఘం భారత కిసాన్ యూనియన్ (బికెయు) నాయకుడు రాకేశ్ తికాయత్ లూధియానాలో ఈ విషయం వెల్లడించారు. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేరుస్తానని లిఖితపూర్వకంగా అంగీకారం తెలియజేసిందని, ఈ విషయంపై జనవరి 15 వరకూ తాము వేచి చూస్తామని ఆయన అన్నారు. జనవరరి 15న ఎస్‌కెఎం దేశంలోని ఆనాటి రైతుల పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. పంజాబ్, ఉత్తర ప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన వేలాదిమంది రైతులు ట్రాక్టర్లలో ఒక పండుగవేళలా, ఉత్సవ వాతావరణం మధ్య ఊరేగింపుగా తమ తమ గ్రామాలకు టిక్రి, సింఘు, ఘాజియాబాద్‌ల నుండి తరలి వెళుతున్నారు. సుదీర్ఘమైన ఆందోళనోద్యమం, హింసాత్మకమైన ఉదంతాలు, ఉద్రిక్తతలు, నిత్యం ధర్నాలు, నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు, ప్రాణాలను పణంగా పెట్టే సాహసాలతో ఏడాదికాలం ఉద్రిక్తతలు, ఉత్కంఠ మధ్య రైతుల ఉద్యమం కొనసాగింది. ఇప్పటికే చాలా వరకూ రైతులు ఢిల్లీ సరిహద్దులను ఖాళీ చేశారు. ఎస్‌కెఎంలో ఛత్రం కింద ఆందోళనలో పాల్గొన్న రైతు సంఘం జై కిసాన్ ఆందోళన్ ఫార్మర్స్ గ్రూపు ఉపాధ్యక్షుడు దీపక్ లాంబా ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆందోళన ముగిసిందని, సింఘు సరిహద్దుల నుండి 80 శాతం రైతులు తమ తమ ఇళ్ళకు బయలుదేరి వెళ్ళిపోయారని చెప్పారు. అదేవిధంగా ఘాజీపూర్ సరిహద్దుల నుడి కూడా 50 శాతం రైతులు వెళ్ళిపోయారు. టిక్రి సరిహద్దుల నుండి కూడా 70 శాతం రైతులు తమ తమ గ్రామాలకు, ఇళ్ళకు తిరిగి వెళ్ళిపోయారని ఎన్‌ఎన్‌ఐ వార్తాసంస్థ తెలియజేసింది. గత నెల (2021 నవంబరు)19వ తేదీ శుక్రవారంనాడు గురునానక్ 552వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ సందేశం ఇస్తూ, వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత 22 రోజులకు రైతులు ఢిల్లీ సరిహద్దులను ఖాళీ చేసి వెళ్ళడం ప్రారంభించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో నవంబరు 29న వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరిస్తూ బిల్లును ఆమోదించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కేంద్ర ప్రభుత్వంతో రైతుల పెండింగ్ సమస్యలపైన, వారి డిమాండ్లపైన చర్చ జరిగింది. కేంద్రం లిఖతపూర్వక అంగీకారం ఇవ్వడంతో రైతులు విజయోత్సవం చేసుకుంటూ డిసెంబరు 11 నుండి ఇళ్ళకు మళ్ళడం ప్రారంభించారు.
ఈనెల 15 నాటికి ఢిల్లీ సరిహద్దు ఉద్యమ కేంద్రాలు ఖాళీ
RELATED ARTICLES