నాగర్‌కర్నూల్ జిల్లాలో ముగ్గురు చిన్నారులు, సంగారెడ్డి జిల్లాలో నలుగురు విద్యార్థులు మృతి
ప్రజాపక్షం/ నాగర్‌కర్నూల్/ పటాన్‌చెరు ; నాగర్‌కర్నూల్, సంగారెడ్డి జిల్లాల్లో విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని నందివడ్డేమాన్ గ్రామంలో గల సురయ్యకుంట చెరువులోకి ముగ్గు రు చిన్నారులు ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన అనిల్ (11), స్వాతి (10) విద్యార్థులు మృతి చెందగా, మరో విద్యార్థి శైలజ (8) కూడా మృతి చెందింది. నందివడ్డేమాన్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న అనిల్, శైలజ, స్వాతిలతో పాటు మరో విద్యా ర్థి స్థానిక సూరయ్యకుంటలో ఈత కోసం వెళ్లారు. అందరు కలిసి కుంటలోకి దిగగా ప్రమాదశావత్తు ముగ్గురు విద్యార్థులు మునిగి మృత్యువాతపడ్డారు. ఇంకో విద్యార్థి భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న స్థానికులు కుంటలోకి దిగి విద్యార్థుల మృతదేహాలను ఒడ్డుకి చేర్చారు. ఒకేసారి ముగ్గురు చిన్నారులు మృతి చెందడంతో గ్రామమంతా తీవ్ర విషాదంలో నెలకొంది. విషయం తెలుసుకున్న పోలిసులు సంఘటన స్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారంలో గీతం యూనివర్సిటీకి దగ్గరలోని ఓ నీటి గుంతలో ఈత కొట్టేందుకు వెళ్లిన నలుగురు విద్యార్థులు అందులో పడి మత్యువాత పడ్డారు. మృతులను గోవర్దన్, విష్ణువర్దన్, ఆనంద్, నందిలను సికింద్రాబాద్, అల్వాల్, బాలాజీనగర్ వాసులుగా గుర్తించారు. వీరు రుద్రారంలో బంధువుల ఇంటికి వెళ్లగా, ఈతకని వెళ్లి ప్రమాదవశాత్తు నీటి గుంటలో మునిగిపోయారు. ఈ ఘటనతో రుద్రారం గ్రామం కన్నీరు మున్నీరవుతోంది.