చెలరేగిన ఓపెనర్లు.. మెరిసిన ఖలీల్
హైదరాబాద్ ఖాతాలో ఐదో విజయం
మళ్లీ ఓడిన కోల్‌కతా
హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండ్ షోతో తన ఖాతాలో ఐదో విజయాన్ని వేసుకుంది. ఆదివారం ఇక్కడ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 9 వికెట్లతో ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్ బౌలర్ల ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులే చేసింది. యువ పేసర్ ఖలీల్ అహ్మద్ (3/30) అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆతిథ్య హైదరాబాద్ జట్టులో ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (67; 38 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు), జానీ బెయిర్ స్టో (80 నాటౌట్; 43 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) విధ్వంసకర బ్యాటింగ్‌తో మరోసారి చెలరేగారు. దాంతో సన్‌రైజర్స్ 15 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఇది హైదరాబాద్‌కు ఈ సీజన్‌లో ఐదో విజయం కాగా.. మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఇది వరుసగా ఐదో ఓటమి. బౌల్‌తో మెరిసిన ఖలీల్ అహ్మద్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
విధ్వంసకర ఆరంభం..
160 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్. జానీ బెయిర్ స్టోలో విధ్వంసకర ఆరంభాన్ని అందించారు. ఈ సీజన్‌లో తన ఓపెన్ భాగస్వామ్యంతో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన ఈ జోడీ మరోసారి తమ ప్రతాపాన్ని చూపెడుతూ కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్లపై విరుచుకుపడింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ 4.3 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును అందుకుంది. ఒకవైపు వార్నర్ విధ్వంసం సృష్టిస్తుంటే.. మరోవైపు బెయిర్ స్టో రెచ్చిపోయి ఆడాడు. దాంతో మైదానమంత పరుగుల వదర పారింది. ఈ జోడీని ఎలా అడ్డుకోవాలో తెలియక కెకెఆర్ బౌలర్లు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. తొలి ఆరు ఓవర్లు ముగిసే సరికి సన్ స్కోరు 72/0కు చేరింది. తర్వాత కూడా అదే జోరును ప్రదర్శించిన ఈ ఓపెనర్లు పరుగులు వరద పారించారు. దాంతో 8.4 ఓవర్లలోనే హైదరాబాద్ స్కోరు 100 పరుగులు మైలురాయిని దాటింది. ఈ జంటను విడదీయడానికి ప్రత్యర్థి కెప్టెన్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ అతని ఫలితం దక్కలేదు. ఈ ఓపెనర్లు ప్రతి బౌలర్‌ను టార్గెట్ చేస్తూ తమ జోరును ప్రదర్శించారు. ఈ క్రమంలోనే కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న వార్నర్ 28 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ సాధించాడు. మరోవైపు ధాటిగా ఆడుతున్న బెయిర్ స్టో కూడా 28 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆఖరికి పృథ్వి రాజ్ ఈ జంటను విడదీసి కెకెఆర్ శిబీరంలో ఆనందాన్ని నింపాడు. కానీ, అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఈ జంట కెకెఆర్‌కు చేయాల్సిన నష్టమంత చేసేసింది. చెలరేగి ఆడిన వార్నర్ 38 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 67 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 74 బంతుల్లో 131 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని ఏర్పర్చారు. తర్వాత మిగిలిన లక్ష్యాన్ని కెప్టెన్ విలియమ్సన్ (8 నాటౌట్) అండతో బెయిర్ స్టో పూర్తి చేశాడు. వార్నర్ ఆవుటైన తర్వాత మరింతగా చెలరేగిన బెయిర్ స్టో బౌండరీలతో సొంత అభిమానులను ఆలరించాడు. ఇతని విధ్వంసకర బ్యాటింగ్‌కు హైదరాబాద్ జట్టు 15 ఓవర్లలోనే 161/1 స్కోరు చేసి ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ఆఖరి వరకు అజేయంగా క్రీజులో నిలిచిన బెయిర్ స్టో 43 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 80 పరుగులు చేశాడు.
శుభారంభం లభించినా..
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఓపెనర్లు సునీల్ నరైన్, క్రిస్ లీన్ మంచి ఆరంభాన్ని అందించారు. లీన్ ఆచితూచి ఆడుతుంటే మరోవైపు నరైన్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగి బ్యాటింగ్ చేశాడు. సన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి బౌండరీల వర్షం కురిపించాడు. ఫోర్లు, సిక్స్‌లతో మైదానం నలుగువైపుల బంతులను తరలిస్తూ ప్రేక్షకులను ఆలరించాడు. అయితే ఈ ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్ నరైన్ (25; 8 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్)లను ఖలీల్ అహ్మద్ క్లీన్ బౌల్డ్ చేసి సన్‌రైజర్స్‌ను ఆదుకున్నాడు. నరైన్ ఆవుటైన సమయంలో కెకెఆర్ కేవలం 2.4 ఓవర్లలో 42 పరుగులు చేసింది. ఇలాంటి విధ్వంసకర ఆరంభం లభించినా తర్వాత బ్యాట్స్‌మెన్‌లు వొమ్ము చేసుకోలేక పోయారు.
పుంజుకున్న బౌలర్లు..
తర్వాత పుంజుకున్న హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు విసురుతూ పరుగులపై నియంత్రణ సాధించారు. మరోవైపు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ పైచెయి సాధించారు. నరైన్ వెనుదిరిగిన కొద్ది సేపటికే యువ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్ (3)ను కూడా ఖలీల్ పెవిలియ్‌కు పంపి తన ఖాతాలో రెండో వికెట్ వేసుకున్నాడు. ఆ కొద్ది సేపటికే మరో ప్రమాదకర బ్యాట్స్‌మన్ నితీశ్ రానా (11)ను భువనేశ్వర్ కుమార్ తెలివైన బంతితో పల్టీ కొట్టించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న మరోవైపు ఓపెనర్ లీన్ మాత్రం ఆచితూచి ఆడుతూ తన వికెట్‌ను కాపాడుకొంటూ ముందుకు సాగాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కెకెఆర్ సారథి దినేశ్ కార్తీక్ కూడా పెద్దగా ప్రభావం చూపలేక పోయాడు. కార్తీక్ (6) పరుగుల వద్ద అనవసరపు పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. దాంతో కోల్‌కతా 8.2 ఓవర్లలో 73 పరుగులు వద్ద నాలుగో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ తరుణంలో క్రిస్ లీన్‌కు రింకు సింగ్ మంచి సహకారన్ని అందించాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు కీలక భాగస్వామ్యాన్ని ఏర్పర్చుతూ కెకెఆర్‌ను ఆదుకున్నారు. కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున వీరు సింగిల్స్, డబుల్స్‌తో పాటు చాన్స్ లభించినప్పుడల్లా బౌండరీలు కొడుతూ స్కోరుబోర్డును ముందుకు సాగించారు. ఈ క్రమంలోనే కెకెఆర్ 12.4 ఓవర్లలో 100 పరుగులను పూర్తి చేసుకుంది. పిచ్‌పై పాతుకుపోయిన ఈ జంట హైదరాబాద్ బౌలర్‌లను సమర్థంగా ఎదుర్కొంటూ కీలకమైన పరుగులను రాబట్టుకుంది. వీరు ఐదో వికెట్‌కు 42 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి కెకెఆర్‌ను ఆదుకున్నారు. మరోవైపు బాధ్యతయుతంగా ఆడిన ఓపెనర్ క్రిస్ లీన్ 45 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఆఖరికి ఈ జంటను సందీప్ శర్మ విడదీసి కోల్‌కతాకు షాకిచ్చాడు. ధాటిగా ఆడుతున్న రింకూ సింగ్ (30; 25 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెలను కట్టుదిట్టమైన బంతులతో పరుగులు చేయకుండా కట్టడి చేశారు. ఆ కొద్ది సమయానికే సెట్ బ్యాట్స్‌మన్ క్రిస్ లీన్ (51; 47 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్)ను ఖలీల్ అహ్మద్ ఔట్ చేసి కోల్‌కతాకు మరో పెద్ద షాకిచ్చాడు. తర్వాత వచ్చిన విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఆండ్రీ రసెల్‌పై కెకెఆర్ భారీ ఆశలు పెట్టుకుంది. కానీ సన్ బౌలర్ల ధాటికి రసెల్ మెరుపులు మెరవలేదు. రెండు సిక్సర్లతో జోరును కనబర్చిన రసెల్ (15)ను భువనేశ్వర్ ఇంటి దారి చూపెట్టాడు. చివరి ఓవర్లో కరియాప 3 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్‌తో 9 పరుగులు చేయడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా.. భువనేశ్వర్‌కుమార్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. మరోవైపు పొదుపుగా బౌలింగ్ చేసిన రషీద్ ఖాన్ 4 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టగా.. సందీప్ శర్మకు ఒక వికెట్ లభించింది.
బెయిర్ స్టో ఖాతాలో మరో రికార్డు..
తన అరంగేట్రం సీజన్ ఐపిఎల్‌లోనే విద్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకొంటున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్ స్టో తన ఖాతాలో మరో అరుదైన రికార్డును వేసుకున్నాడు. ఇప్పటికే మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్‌తో కలిసి ఎన్నో రికార్డులు అందుకున్న బెయిర్ స్టో తాజాగా మరో రికార్డును సాధించాడు. ఐపిఎల్ అరంగేట్రం సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా బెయిర్ స్టో కొత్త రికార్డును నెలకొల్పాడు. ఈ సీజన్ (2019)లో ఇప్పటివరకు (445) పరుగులు చేసిన బెయిర్ స్టో.. 2015లో శ్రేయస్ అయ్యర్ (439) పరుగులను అధిగమించి తొలి స్థానంలో నిలిచాడు. అయ్యర్ తన అరంగేట్రంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఈ రికార్డును సాధిస్తే.. తాజాగా సన్‌రైజర్స్ ఆటగాడు బెయిర్ స్టో ఈ రికార్డును చెరిపేశాడు. వీరిద్దరి తర్వాత సిఎస్‌కె తరఫున ఫాఫ్ డుప్లెసీస్ (398 పరుగులు), ముంబయి ఇండియన్స్ తరఫున సిమన్స్ (394), రైజింగ్ పూణే సూపర్ గెయింట్స్ తరఫున రాహుల్ త్రిపాఠి (391), ముంబయి ఇండియన్స్ తరఫున లెవీస్ (382)లు తమ తొలి సీజన్ ఐపిఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో వరుసగా టాప్ సిక్స్ స్థానాల్లో ఉన్నారు.
వార్నర్-బెయిర్ స్టో జోడీ మరో రికార్డు
ఇప్పటికే ఓవరాల్ ఐపిఎల్‌లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పిన జోడిగా నిలిచిన డేవిడ్ వార్నర్-బెయిర్ స్టోలు..తాజాగా మరో ఘనతను కూడా సాధించారు. ఉప్పల్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓపెనర్లు వార్నర్-బెయిర్ స్టోలు వందకు పైగా ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫలితంగా ఒక సీజన్‌లోఅత్యధిక పరుగుల సాధించిన ఓపెనింగ్ జోడిగా కొత్త రికార్డు నెలకొల్పారు. ఈ క్రమంలోనే వార్నర్-ధావన్ పేరుతో ఉన్న గత రికార్డు తెరమరుగైంది. 2016 సీజన్‌లో వార్నర్-ధావన్‌ల జోడి 731 పరుగులు సాధించారు. ఇదే ఇప్పటివరకూ ఐపిఎల్‌లో ఓపెనింగ్ జోడీ సాధించిన అత్యధిక పరుగులు కాగా, దాన్ని బెయిర్ స్టోతో కలిసి ఈ సీజన్‌లో వార్నరే సవరించడం విశేషం. ఇక టాప్-4 ఓపెనింగ్ భాగస్వామ్యాల్ని చూస్తే మూడింట్లో వార్నర్-ధావన్‌ల జోడినే ఉంది. 2015లో వార్నర్-ధావన్‌ల జోడి 646 పరుగులు సాధించగా, 2017లో 655 పరుగులు సాధించారు. ఇక 2014 నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న వార్నర్.. ప్రతీ సీజన్‌లోనూ ఐదు వందలకు పైగా పరుగులు సాదించిన ఘనత సాధించాడు. 2014 సీజన్‌లో 528 పరుగులు సాధించిన వార్నర్, 2015లో 562 పరుగులు, 2016లో 848 పరుగులు, 2017లో 641 పరుగులు సాధించాడు. గత ఏడాది (2018) సీజన్‌కు బాల్ ట్యాంపరింగ్ కారణంగా దూరమైన విషయం తెలిసిందే. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటికే ఐదు వందలకు పైగా పరుగులు నమోదు చేసి అత్యధికత పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.