అతిపెద్ద ఆదాయ వనరుగా ఇసుక రవాణా
మైనింగ్, రెవెన్యూ ఉద్యోగుల ఇష్టారాజ్యం
కూపన్ నిబంధనలకు తూట్లు
అంతా రాజకీయ నేతల కనుసన్నల్లో…
ప్రజాపక్షం/ఖమ్మం బ్యూరో రాష్ట్రంలో ఇసుక వ్యాపారం ఇప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతుంది. ఇప్పుడు రాజకీయ నాయకులు, పోలీస్, రెవిన్యూ, మైనింగ్ అధికారులకు అతిపెద్ద ఆదాయ వనరుగా మారింది. నదులు, వాగులు, ఏర్లను వదలకుండా ఇసుక తోడేస్తున్నారు. నది పరివాహాక ప్రాంతాలలో ఇసుక వ్యాపారం కాసులు కురిపిస్తుంది. సర్పంచ్ మొదలు ఎంఎల్‌ఎ దాకా ముడుపులు చెల్లిస్తూ అందిన మేర దోచుకుంటున్నారు. పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలు లేకపోవచ్చు కానీ ఇసుక దోపిడీ రాష్ట్రంలో ఇప్పుడు అతిపెద్ద దోపిడీగా మారింది. గోదావరి, కృష్ణా పరివాహాక ప్రాంతాలతో పాటు నదులు, ఏర్లలో ఇసుకను తోడేస్తున్నారు. కూపన్లు, ఆన్‌లైన్ బుకింగ్స్ పేరుకు మాత్రమే. ఇవన్ని అప్పుడప్పుడు లేదా ఎప్పుడో ఒకసారి అధికారులకు గుర్తుకు వస్తాయి. మిగిలిన సమయాల్లో ఇష్టానుసారమే. ఇటీవల కాలంలో నిర్మాణ రంగం ఊపందుకోవడంతో ఇసుక పిరమైంది. లారీ ఇసుక రూ. 40వేల నుంచి రూ. 60వేల వరకు విక్రయిస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ట్రాక్టర్ ట్రక్కు ఇసుక ఆరు వేల నుంచి పది వేల వరకు విక్రయిస్తున్నారు. మైనింగ్ అధికారులు ఇసుక నిక్షేపాలను గుర్తించి అనుమతులు ఇచ్చే సమయంలోనే అనేక మతలబులు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడికక్కడ పర్సంటేజీలు ఇస్తేనే పని జరుగుతుంది. ఇక రెవిన్యూ అధికారులు కూపన్లతో మాయాజాలం చేస్తుంటే సామాన్యుడు మాత్రం విలవిలలాడిపోతున్నాడు. పేద, మధ్యతరగతి ప్రజలు ఓ మరుగుదొడ్డి కట్టించుకోవాలంటే ఇసుక కూపన్ కోసం అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కానీ ఇసుక డాన్‌లు లారీలకు లారీలు తరలించుకుపోతున్నా రెవిన్యూ, పోలీస్ అధికారులకు కన్పించదు. ప్రతి చోట కమిషన్ వ్యవహారమే. కొన్ని చోట్ల లారీల ప్రకారం కమిషన్ వసూలు చేస్తుంటే మరి కొంత మంది ఒక అడుగు ముందుకు వేసి గ్రామీణ ప్రాంతాలలో ఇసుక తోలే ట్రాక్టర్ల వారీగా నెల వారి మామూళ్లు వసూలు చేస్తున్నారు. ఇందు కోసం చాలా మండలాల్లో ఇసుక మాఫియా తయారైంది. తమ గ్రూపులోకి రాకుండా ఉంటే పట్టించి రెవిన్యూ, పోలీస్‌అధికారుల చేత కేసులు పెట్టించడం చేసి నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఇసుక మాఫియా లీడర్లు ఇసుక తరలించే ప్రతి వాహనం నుంచి మామూళ్లు వసూలు చేసి అధికారులను సంతృప్తి పరుస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఇసుక మాఫియా సభ్యుడైతే ఒక కూపన్ పై ఎన్ని ట్రిప్పుల ఇసుక తోలుకున్నా పట్టించుకోరు. సామాన్య ప్రజలు ఇసుక అక్రమ తోలకాలపై సమాచారం ఇచ్చినా అటువైపు చూడరు. ఇసుక మాఫియా చేతిలో మండల అధికారులు బంధీలుగా మారిపోతున్నారు. ఇసుక అక్రమ మట్టి తవ్వాకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. వీటిని గురించి పట్టించుకునే నాధుడే లేడు. ఖమ్మంజిల్లా చింతకాని మండలం చిన్నమండవ సమీపంలో గల మున్నేరు నుంచి లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించేందుకు 2019 జనవరి 25న అనుమతించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడి నుంచి సుమారు నాలుగు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తరలిపోయింది. హైదరాబాద్, వరంగల్ ప్రాంతాలతో పాటు ఖమ్మం సరిహద్దున గల అనేక జిల్లాలకు ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఇసుక సరఫరా జరిగింది. కానీ అధికారులు మాత్రం ఇప్పటి వరకు కేవలం 82,400 క్యూబిక్ మీటర్ల ఇసుక మాత్రమే తరలిపోయిందని ధృవపరుస్తున్నారు. అంటే అధికారుల పర్యవేక్షణ ఏ స్థాయిలో ఉందో అవగతమవుతుంది. మైనింగ్ అధికారులు ఇసుక తరలింపును పట్టించుకోకుండా మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి పెద్ద మొత్తంలో గండికొడుతున్నారు. గోదావరి లాంటి జీవనదులు సహా వాగులు, ఏరులు లోయలను తలపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఇసుక తరలింపుకు సంబంధించి నిబంధనలను కఠినతరం చేయాలని నదులు, వాగులు, ఏర్ల పరివాహాక ప్రాంత ప్రజలు కోరుతున్నారు. వ్యవసాయ బోర్లు, బావులు వట్టిపోతున్నాయి. వ్యవసాయ బోర్లకు 500 మీటర్ల దూరంలో ఇసుక తోలకాలకు అనుమతులు ఇవ్వకూడదని ఉన్నా ఆ నిబంధనలను కూడా పట్టించుకున్నట్లు కన్పించడం లేదు. బోనకల్ మండలం రాపల్లి సమీపంలోని వైరా నదిపై చుట్టూ 15 నుంచి 20 వరకు వ్యవసాయ బోర్లు ఉన్నా ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం భూ కొనుగోలు పథకం ద్వారా ఇక్కడ దళితులకు భూ పంపిణీ చేసింది. అందులో వ్యవసాయ బోర్లను కూడా వేశారు. ఆ బోర్లకు అత్యంత సమీపంలో ఇసుక తోలకాలకు ఖమ్మం మైనింగ్ శాఖ అనుమతులు ఇచ్చిందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అవగతమవుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణా, తోలకాలపై నిబంధనలను కఠినతరం చేసి నీటి వనరులను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
ఇసుక దోపిడీ
RELATED ARTICLES