65 ఏళ్లు దాటిన వారికి పోస్టల్ బ్యాలెట్లతో ఓటింగ్ సరికాదు ః సిపిఐ
ప్రజాపక్షం/న్యూఢిల్లీ ః భారత ఎన్నికల సంఘం (సిఇసి) తాజాగా తీసుకున్న రెండు నిర్ణయాల పట్ల సిపిఐ తీవ్ర అభ్యంతరం చెప్పింది. ఎన్నికల ప్రచారంలో డిజిటల్ ప్రాపుగాండా, 65 ఏళ్లు దాటిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్లతో ఓటింగ్‌కు అనుమతివ్వడం వంటి నిర్ణయాలు సరికావని, ఈ రెండు అంశాలు ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థపై విపత్కర ప్రభావాన్ని చూపుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఈ మేరకు సిఇసి సునీల్ అరోరాకు ఒక లేఖ రాశారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్ని రాజకీయ పార్టీలతో విస్తృతమైన, పారదర్శకమైన సంప్రదింపులు జరపాల్సిన అవసరం వుందని రాజా ఆ లేఖలో పేర్కొన్నారు. జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తమ పార్టీ అభిప్రాయాలను సానుకూలంగా పరిశీలించాలని కోరారు. ఈ ప్రతిపాదనలను సిపిఐ వ్యతిరేకిస్తున్నదని స్పష్టం చేశారు. అలాగే జూన్ 23వ తేదీన బీహార్ విధాన్ సభ ఎన్నికలపై చర్చించేందుకు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలోనూ డిజిటిల్ ప్రాపుగాండా ప్రతిపాదనను తాము వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేశారు. డిజిటల్ ప్రాపుగాండా ఎంతో ఖర్చుతో కూడికున్న విషయమని, రాజకీయ పార్టీల మధ్య సమాన పోటీని ఈ అంశం దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డారు. అలాగే 65 ఏళ్లు దాటిన వారికి పోస్టల్ బ్యాలెట్లతో ఓటింగ్‌కు అనుమతినివ్వడం వల్ల అవకతవకలకే ఎక్కువగా ఆస్కారం వుంటుందని చెప్పారు. అధికారంలో వున్న పార్టీకి, బలమైన వనరులు కలిగివున్న పార్టీలకే ఈ ప్రతిపాదనలు ఉపయుక్తమని చెప్పారు. ఈ రెండు ప్రతిపాదనలను ఆమోదిస్తే, అది కచ్చితంగా ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరగాలన్న ప్రజాస్వామిక ప్రక్రియకు హాని కలిగిస్తుందని రాజా ఆ లేఖలో స్పష్టం చేశారు.
ఇసి నిర్ణయాలతో విపత్కర ప్రభావం
RELATED ARTICLES