పరిషత్ ఫలితాలు 27న ప్రకటిస్తే, జులై 5 తరువాత ఎంపిపి, జెడ్‌పి చైర్మన్ల ఎన్నికలా?
కాంగ్రెస్ అసహనం
ప్రజాపక్షం/హైదరాబాద్; ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల ఫలితాలు 27న ప్రకటిస్తే, జిల్లా పూరిషత్ ఎన్నికలు జులైలో పెట్టడం మంచిదికాదని పిసిసి అధ్యక్షులు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే గెలిచిన వారితో ప్రమాణ స్వీకారం చేయిం చి, వారితోనే స్థానిక సంస్థల కోటా ఎంఎల్‌సి ఉప ఎన్నికల్లో ఓటు వేయించాలని డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి, ఎంఎల్‌సి షబ్బీర్‌అలీ, ఎంఎల్‌ఎ తూర్పు జయప్రకాశ్‌రెడ్డిలతో కలిసి మీడియా సమావేశంలో గురువారం ఉత్తమ్ మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన ఎంపిటిసి, జెడ్‌పిటిసిలతో ఓట్లు వేయ డం కుదరకపోతే ఎన్నికల లెక్కింపును వాయి దా వేయాలన్నారు. ఎంపిపి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికను జూలై 5 తర్వాత చేయాలన్న ఎన్నికల సంఘం నిర్ణయం సరైందికాదన్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల బేరసారాలకు అవకాశం కల్పించినట్టుగా ఉంటుందని, ఇది ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేయడమేనని పేర్కొన్నారు.ఫలితాలు వెల్లడైన మరుసటి రోజునే ఎంపిపి, జెడ్‌పి చైర్మన్ ఎన్నికను పూర్తి చేయాలన్నారు.ఈ విషయమై శుక్రవారం ఎన్నికల సంఘాన్ని కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు.ఈనెల 21న రాజీవ్‌గాంధీ వర్ధంతిని పార్టీ శ్రేణులు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
21న రాజీవ్ వర్థంతి :ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల సమయంలో తమ అభ్యర్థుల నుంచి అఫిడవిట్లు సేకరించాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో ఉత్తమ్ అధ్యక్షతన డిసిసి అధ్యక్షులు, లోక్‌సభ అభ్యర్థులతో గురువారం సమావేశం జరిగింది. ఈ సందర్బంగా లోక్‌సభ ఎన్నికల లెక్కింపులో తీసుకోవల్సిన జాగ్రత్తలపై డిసిసి లు, అభ్యర్థులకు ఉత్తమ్ పలు సూచనలు చేశారు. ఎఐసిసి నిబంధనల ప్రకారం లోక్‌సభ ఎన్నికల ఫలితాల సమయంలో అభ్యర్థులు, డిసిసిలు వ్యవహారించాలని స్పష్టం చేసినట్లు తెలిసింది.. మే 21న భారత్ రత్న దివంగత రాజీవ్‌గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని, నియోజకవర్గ కేంద్రాలలో ప్రజలను పూర్తిగా భాగస్వామ్యం చేయాలన్నారు.