కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరపాల్సిందే
ప్రచారంలో సైన్యం ప్రస్తావన లేకుండా నిషేధం
ఎన్నికల సంఘానికి సిపిఐ వినతి
న్యూఢిల్లీ : ఇవిఎంలపై నమ్మకాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల ప్రధాన అధికారి (సిఇసి)కి సిపిఐ విజ్ఞప్తి చేసింది. అలాగే, జమ్మూకశ్మీర్‌లో కూడా అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని కోరింది. ఈ మేరకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి బుధవారంనాడు సిఇసికి ఒక లేఖ రాశారు. 2019 పార్లమెంటు ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేయడం, 90 కోట్ల మంది ఓటర్లతో ఎన్నికల కోసం జాతిని సమాయత్తపర్చడం హర్షదాయకమని సుధాకరరెడ్డి పేర్కొన్నారు. అయితే ఇవిఎంలు ప్రశ్నార్థకమైన చోట, 5000కు తక్కువ ఓట్ల మెజారిటీతో విజయాలు నమోదైన నియోజకవర్గాల్లో వివిప్యాట్‌ల లెక్కింపునకు సిద్ధం కాకపోవడం అసంతృప్తికరమైన విషయమన్నారు. ఈ సమస్యపై ఏర్పాటైన ఎన్నికల కమిటీ ఎంత త్వరగా నిర్ణయం ప్రకటిస్తుందో తెలియదని, ఏదేమైనప్పటికీ ఇవిఎంలపై సన్నగిల్లిన విశ్వాసాన్ని తిరిగి పునరుద్ధరించాల్సిన అవసరం మాత్రం వుందని తెలిపారు. అలాగే, జమ్మూకశ్మీర్‌లో పార్లమెంటు ఎన్నికలకు మార్గం సుగమం చేసినప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. కశ్మీర్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నమాట వాస్తవమేనని, అయితే పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నప్పుడు, అసెంబ్లీ ఎన్నికలకు అడ్డమేముంటుందని అన్నారు. కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం ఒక సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే, ఎన్నికల ప్రచారంలో సైన్యాన్ని, వారి పోస్టర్లను ఉపయోగించకుండా రాజకీయ పార్టీలను నిలువరించడం ప్రశంసనీయమైన అంశమని, అయితే ఆదేశాలివ్వడం ఒక్కటే చాలదని, సైన్యం త్యాగాలు రాజకీయాలకు అతీతమైనవి అయినందున, ఎన్నికల్లో సాయుధ బలగాల పేరు ప్రస్తావనే లేకుండా నిషేధం విధించాలని సిపిఐ కోరింది. అలా చేసినప్పుడే ఎన్నికలు న్యాయబద్ధంగా, సజావుగా జరుగుతాయని సుధాకరరెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు.