బ్యాలెట్ పత్రాలే ఉత్తమం
హ్యాకింగ్ వ్యాఖ్యలపై విచారణ జరిపి తీరాల్సిందే
ప్రతిపక్షాలు డిమాండ్ : కొట్టిపారేసిన కేంద్రం
సయ్యద్ షుజాపై ఢిల్లీ పోలీసులకు ఎన్నికల సంఘం ఫిర్యాదు
ఎన్నికల్లో ఇవిఎంల వాడకంపై మరోసారి దుమ్మురేగింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగినట్లు సైబర్‌నిపుణుడు సయ్యద్ షుజా చేసిన ప్రకటనలపై రాజకీయవర్గాల్లో కల్లోలం సృష్టించింది. అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానమైనప్పటికీ, అట్టర్‌ఫ్లాప్‌గా మిగిలిన ఇవిఎంల వాడకానికి బదులుగా బ్యాలెట్ పత్రాలనే వాడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఇవిఎంల వాడకమనేది ఒక పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదని, ఇదొక రాజ్యాంగ సమస్యగా మారిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ కోరగా, బ్యాలెట్ పత్రాలను తక్షణమే పునరుద్దరించాలని దాదాపుగా ఇతర పార్టీలన్నీ డిమాండ్ చేశాయి. ట్యాంపరింగ్‌కు అవకాశమే లేదని ఎన్నికల సంఘం పునరుద్ఘాటిస్తూనే, సయ్యద్ షుజా ఆరోపణలపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్‌ఐఆర్ దాఖలుకు లేఖరాసింది. షుజా అనే వ్యక్తి 505(1)(బి) సెక్షన్‌ను ఉల్లంఘించినట్లుగా ఇసి ఆరోపించింది.