న్యూఢిల్లీ: ఇవిఎంలపై సందేహాలున్నాయని, ఈ మేరకు సోమవారం ఎన్నికల సంఘం అధికారులను కలిసి అభిప్రాయాలు చెబుతామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలిపారు. ఇవిఎంలకు సంబంధించిన డాక్యుమెంట్‌ను కూడా ఎన్నికల సంఘానికి అందజేస్తామన్నారు. ఇవిఎంలపై రాజకీయ పక్షాలతో పాటు ప్రజలకు కూడా అనేక అనుమానాలున్నాయని వివరించారు. ఇవిఎంలు ట్యాంపరింగ్ చేయవచ్చనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు శుక్రవారం నాడు సమావేశమయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇవిఎంల ట్యాంపరింగ్‌పై భేటీ చర్చించామని చెప్పారు. వ్యవసాయం, ఉద్యోగాలు, ప్రభుత్వరంగ సంస్థలపై ప్రభుత్వం జోక్యం, రాఫెల్ స్కాంలను ఎన్నికల ప్రచారాస్త్రాలుగా పార్లమెంట్ ఎన్నికలకు పోనున్నట్లు తెలిపారు. ఈ అంశాలపై అన్ని పార్టీలు సమ్మతించాయని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఎన్‌సిపి అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా, సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్‌గోపాల్ యాదవ్, బిఎస్‌పి నాయకుడు సతీష్ చంద్ర మిశ్రా, డిఎంకె నుంచి కనిమొళి, టిఎంసి నుంచి దెరెక్ ఓబ్రెయిన్, సిపిఐ నుంచి డి. రాజా, సిపిఐ(ఎం) నుంచి టికె రంగరాజన్, ఆర్‌జెడి నుంచి మనోజ్ ఝా, ఆప్ నుంచి సంజయ్ సింగ్, రాష్ట్రీయ లోక్ దళ్ నేత జయంత్ చౌదరి పాల్గొన్నట్లు వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, మల్లికార్జు ఖర్గే, ఎకె ఆంటోనిలు కూడా భేటీలో పాల్గొన్నారు.
ఇవిఎంలపై ఇసిని కలుస్తాం
RELATED ARTICLES