ఎన్నికల్లో ట్యాంపరింగ్ జరిగింది : ఉత్తమ్
వివి ప్యాట్ చీటీలు పూర్తిగా లెక్కించాలి
మేం ఓడిపోతామని టిఆర్‌ఎస్ నేతలు చెప్పారు
కౌంటింగ్‌కు ముందే వాళ్లకు ఎలా తెలిసింది
దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం
ప్రజాపక్షం / హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో ఉపయోగించిన ఇవిఎంలు పూర్తిగా ట్యాంపరింగ్ అయ్యాయని టిపిసిసి అధ్యక్షులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. అన్ని నియోజకవర్గాల్లో ఇవిఎంలకు అనుసంధానంగా ఉన్న వివిప్యాట్ ద్వారా వెలువడిన చీటీలను లెక్కించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాలు చివరి దశలో ఉన్న సమయంలో ఆయన గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడా రు. వివిప్యాట్ చీటీలను లెక్కించాలని ఇప్పటికే తాము రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్, కేంద్ర ఎన్నికల సంఘానికి లిఖితపూర్వంగా వినతిపత్రం ఇచ్చామన్నారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం వ్యవహార శైలిపై ఉత్తమ్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణలో ఎన్నికల ఓటర్ల జాబితాను కుదించారని ఆయన విమర్శించారు. ఇవిఎంలో పడిన ఓట్లు ఒక విధంగా వివిప్యాట్ చీటీల సంఖ్య మరో విధంగా ఉన్నాయని అనుమానం వ్యక్తంచేశారు. ఇవిఎంలపై తమకు అనుమానాలున్నాయని, అందుకే పేపర్ చీటీలు లెక్కించాలని కోరుతున్నామన్నారు. ఎన్నికల సం ఘం ఆ పని చేయపోతే ప్రజాస్వామ్య చరిత్రలో ఈ ఘటన బ్లాక్ డేగా నిలిచిపోతుందన్నారు. వివిప్యాట్ స్లిప్పులలెక్కలను చెప్పేందుకు ఇసి ఎందు కు వెనకడుగు వేస్తోందని ప్రశ్నించారు. వివిప్యాట్ చీటీలు లెక్కచేయనప్పుడు ఆ యంత్రాలు ఇక ఇందుకని ఆయన నిలదీశారు.ఎవరి ప్రయోజనం కోసం ఇసి పనిచేస్తోందని, తెలంగాణలో అధిక రాజకీయ పార్టీలు వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించమంటే ఎందుకు ఆపుతున్నారు? అని ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ట్యాంపరింగ్ చోటుచేసుకుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కౌంటింగ్ పూర్తికాకముందే తాము గెలుస్తామని టిఆర్‌ఎస్ నేతలు ప్రకటించుకోవడమే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఓడిపోతుందని టిఆర్‌ఎస్ నేతలు ముందుగానే చెప్పారనీ, ఈ వ్యవహారంలో తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపారు.
ఇవీఎంలను ట్యాంపరింగ్ చేశారు – అందువల్లే టిఆర్‌ఎస్ గెలుపొందింది
ఈసికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)ను ట్యాంపరింగ్ చేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అందువల్లే అధికార టీఆర్‌ఎస్ భారీగా స్థానాలను గెలుచుకోగలిగిందని విమర్శించింది. నిజాలను నిగ్గు తేల్చడానికి ఆయా నియోజకవర్గాల్లో వివి ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు గూడూరు నారాయణరెడ్డి, జి.నిరంజన్‌లు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు క్షేత్రస్థాయిలోని పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు తెలియజేసింది. వివి ప్యాట్ యంత్రాలలోని స్లిప్పులను 100 శాతం లెక్కించాలని కోరింది. ఈ మేరకు ఓ లేఖను ఈసీకి సమర్పించింది.