ప్రధాని సిఫార్సుపై స్పందించిన దేశాధ్యక్షుడు
మూడు నెలల్లోగా ఎన్నికలు జరిగే అవకాశం
సుప్రీం కోర్టును ఆశ్రయించిన ప్రతిపక్ష పార్టీలు
ఇస్లామాబాద్: సొంత పార్టీలోని అసమ్మతి నేతలు, ప్రతిపక్ష పార్టీలపై పాకిస్తాన్ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ సంధించిన యార్కర్‌తో జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు) రద్దయింది. ఇమ్రాన్ సిఫార్సుపై దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వి స్పందించారు. అసెంబ్లీని రద్దు చేశారు. మూడు నెలల్లోగా జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయి తే, ఇమ్రాన్ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ, పార్లమెంటు రద్దుకు ఇమ్రాన్ సిఫార్సు చేసినట్టు ప్రధాన ప్రతిపక్షమైన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) విమర్శించింది. ఇ మ్రాన్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టు లో పార్టీ తరఫున పిటిషన్ దాఖలు చేసినట్టు ఆ పార్టీ అధ్యక్షుడు బిలావల్ భుట్టో జర్దారీ ప్రకటించారు. కాగా,
దేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తున్నట్టు సుప్రీం కోర్టు తెలిపింది. వాస్తవానికి ఆదివారం పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సిన ఇమ్రాన్ హఠాత్తుగా బాంబు పేల్చారు. క్రికెటర్‌గా తనకు ఉన్న అనుభవాన్ని, జట్టు కెప్టెన్‌గా ప్రత్యర్థిని చిత్తుచేసే వ్యూహరచన సామర్థ్యాన్ని రాజకీయాల్లో కూడా వాడుకున్నారు. పార్లమెంటును రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ రద్దు సిఫార్సు లేఖను దేశాధ్యక్షుడికి అందచేశారు. మూడు నెలల్లోగా ఎన్నికల జరిపించాలని ఆ లేఖలో సూచించారు. అంతకు ముందు ఇమ్రాన్ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ తన వద్ద చివరి బంతి ఇంకా మిగిలే ఉందని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి ఒక ప్రణాళికను సిద్ధంగా ఉంచుకున్నట్టు చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ప్రజలకు సూచించారు. దీనితో ఆయన జాతీయ అసెంబ్లీ రద్దుకే మొగ్గు చూపుతారన్న విషయం చివరి క్షణాల్లో తెలిసింది. ప్రతిపక్ష పార్టీలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి ఇమ్రాన్ పార్టీ పాకిస్తాన్ తాహెరిక్ ఎ ఇన్సాఫ్ (పిటిఐ)లోని కొంత మంది అసమ్మతి నాయకులు మద్దతు ప్రకటించడంతో గందరగోళ పరిస్థితలు తలెత్తాయి. 342 మంది సభ్యుల అసెంబ్లీలో తీర్మానం నెగ్గాలంటే 172 మంది ఓట్లు అవసరం. కాగా, తమకు 177 మంది సభ్యుల బలం ఉందని విపక్షాలు ప్రకటించుకున్నాయి. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతున్నదన్న వార్తలు కూడా వెలువడ్డాయి. కానీ, అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూర్ తరస్కరించగా, సంక్షోభం మరింత ముదిరింది. అదే సమయంలో ఇమ్రాన్ జాతీయ అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకున్నారు. దేశాధ్యక్షుడికి లేఖ రాసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ సభ రద్దు విషయాన్ని అధికారికంగా ప్రకటిచారు. ప్రజాస్వామ్య విధానంలో, ఎలాంటి పొరపాట్లు లేకుండా, పారదర్శకంగా ఎన్నికలు జరగాలని అధ్యక్షుడిని కోరినట్టు చెప్పారు. తనపై కుట్ర జరిగిందని, కొన్ని దేశాలు ఉద్దేశపూర్వకంగా పాక్‌లో రాజకీయ సంక్షోభం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని వ్యాఖ్యానించారు. అమెరికాపై మరోసారి పరోక్షంగా విమర్శలు కురిపించారు. ఇలావుంటే, 90 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయని పాక్ సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఫారుఖ్ హబీబ్ ప్రకటించారు. అయితే, అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు రాకుండా అడ్డుకొని, ఓటింగ్ జరగకుండా నిరోధించడం ద్వారా ఇమ్రాన్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని పిపిపి అధ్యక్షుడు బిలావల్ విమర్శించారు. పార్లమెంటును విడిచిపెట్టేది లేదని అన్నారు. అంతేగాక, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ప్రకటించారు. జాతీయ అసెంబ్లీ రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించడంతో, ప్రస్తుతం పాక్ రాజకీయాలు కోర్టుకు చేరాయి. రద్దుపై పాక్ సుప్రీం కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఇమ్రాన్ యార్కర్ పాకిస్తాన్ పార్లమెంటు రద్దు
RELATED ARTICLES