బిజెపిపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
భూత వైద్యం నేర్పించే చర్రిత కాషాయపార్టీదేనని విమర్శ
ప్రజాపక్షం/హైదరాబాద్ బనారస్ కళాశాలలో భూత వైద్యం నేర్పించే చర్రి త బిజెపిదేనని ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ నేతలను కొనుగోలు చేసేందుకు 200 కార్లు, రెండు వేల ద్విచక్ర వాహనాల ను బిజెపి బుక్ చేసినట్టు తమకు సమాచారం ఉన్నదని తెలిపారు. బిజెపి నేతలు ఇప్పుడు మోటార్లు ఇస్తారని, గెలిచిన తర్వాత బావుల వద్ద మీటర్లను బిగిస్తారన్నారు. హైదరాబాద్‌లోని టిఆర్ఎస్ఎల్పి కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్, ఎంఎల్‌సి గంగాధర్ గౌడ్, ఎంఎల్ఎ ముఠాగోపాల్‌తో కలిసి మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని మునుగోడు ప్రజలు మరువబోరన్నారు. మునుగోడులో ప్రజలు గెలవాలా.. రాజగోపాల్‌రెడ్డి ధనం గెలవాలా.. అని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి నేతలు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పకుండా, నేతలను కొనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. క్షుద్రపూజలంటూ మాట్లాడటం దారుణమని, తాంత్రిక విద్యలపై కోర్సులు పెట్టిందే బిజెపి అని మండిపడ్డారు. బండి సంజయ్ ఉత్తరప్రదేశ్‌కు వెళ్లి అక్కడ భూతవైద్యం కోర్సు నేర్చుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. మంత్రతంత్రాలు, మతకల్లోలాలు, నల్లపిల్లులు, భూత వైద్యం బిజెపికి తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదన్నారు. టిఆర్ఎస్ వద్ద లోక్తాంత్రిక విద్యలు మాత్రమే ఉంటాయన్నారు. దేశ ప్రజల కోసం బిజెపి ఒక్క మంచి పనైనా చేసిందా?, టిఆర్ఎస్ది ఉద్యమ చరిత్ర, బిజెపిది రక్త చరిత్ర అని అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక వ్యక్తిగత స్వార్థమని, రాజకీయం కోసం ప్రజాధనం వృథా చేస్తున్నారని ఆరోపించారు. మనుగోడులో అడ్డదారిలో గెలిచేందుకు బిజెపి ప్రయత్నిస్తోందన్నారు. ఇప్పటి వరకు బిజెపి చేసిన పనులను ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఎనిమిదేళ్ల కాలంలో ఎవరెన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేస్తారా అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపణలు చేసి తెలంగాణ ప్రజల మనసు గెలువలేరని, తెలంగాణ ప్రజల మనసు గెలవాలంటే ముందుగా బుల్లెట్ రైలు తెలంగాణకు ఇవ్వాలని సూచించారు. వందేబారత్ రైళ్లు బర్రెలు అడ్డం వస్తే తుక్కుతుక్కు అవుతున్నాయని ఎద్దేవా చేశారు. బిజెపికి దమ్ముంటే మునుగొడులో అభివృద్ధి గురించి మాట్లాడాలని, వారు చేస్తున్న ఆరోపణలపై ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పనితీరుకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న అవార్డులే నిదర్శనమన్నారు. బిజెపిది దివాళాకోరు దిక్కుమాలిన ప్రభుత్వమని ఆరోపించారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం విక్రయిస్తోందని, రూ.400 గ్యాస్ సిలండర్‌ను ప్రస్తుతం రూ.1,200లకు పెంచారని ధ్వజమెత్తారు.
ఇప్పుడు కార్లు, స్కూటర్లు…గెలిస్తే బావులకు మీటర్లు
RELATED ARTICLES