కొత్త భవనం కట్టాల్సిన అవసరమేంటీ?
ఎర్రమంజిల్ భవనం కూల్చివేతపై హైకోర్టు ఘాటైన వ్యాఖ్య
ప్రజాపక్షం/హైదరాబాద్ లీగల్ : ఎర్రమంజిల్ భవనం కూల్చివేత అంశంపై హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడున్న అసెంబ్లీ ఎందుకు సరిపోదని ప్రశ్నించింది. కొత్తగా అసెంబ్లీ కాంప్లెక్స్ కట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని నిలదీసింది. హుడా చట్ట నిబంధనల ప్రకా రం ఎర్రమంజిల్ బిల్డింగ్ హెరిటేజ్ కాదని చెబుతున్న ప్రభుత్వం.. కూల్చివేయాలని నిర్ణయం తీసుకునే ముందు హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండిఎ) అనుమతి పొందారా లేదా.. అని సూటిగా ప్రశ్నించింది. వాస్తవ పరిస్థితుల్ని కోర్టుకు విన్నవించడంలో ఆలస్యం ఎందుకు చేస్తున్నారని ప్రభుత్వా న్ని గట్టిగా అడిగింది. పూర్తి వివరాలు గురువారం నాడు జరిగే విచారణ లో చెప్పాలని తేల్చి చెప్పింది. ఎర్రమంజిల్ భవన ప్రదేశంలో అసెంబ్లీ, శాసనమండలి భవన సముదాయాన్ని నిర్మించాలనే ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన పలు ప్రజాహిత వ్యా జ్యాలను బుధవారం హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఉన్న అసెంబ్లీని కాదని కొత్త భవనం ఎందుకు? ఇప్పుడున్న అసెంబ్లీలో అన్ని సదుపాయాలు ఉన్నాయి కదా? హుడా చట్టంలోని హెరిటేజ్ జాబితా నుంచి ఎర్రమంజిల్ భవనాన్ని తొలగించినప్పుడు.. అందుకు అనుగుణంగా హెచ్‌ఎండిలో మార్పు చేయనప్పుడు.. ఆభవనం కూల్చివేతకు హెచ్‌ఎండిఎ అనుమతి తీసుకోవాలి కదా? హుడా స్థానంలో హెచ్‌ఎండిఎ వచ్చినప్పుడు అనుమతి తీసుకున్నారా? ఎర్రమంజిల్ బిల్డింగ్ కూల్చివేతకు అనుమతి ఉందో..లేదో చెప్పడానికి మీనమేషాలు ఎందు కు? వాస్తవాలు చెప్పడానికి ఇంత జాప్యం ఎందుకు?.. అని డివిజన్ బెంచ్ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించింది. ఎర్రమంజిల్ భవనాల్ని 1870లో నవాబ్ సఫ్దర్‌జంగ్ ముషీర్దౌలా ఫక్రుల్ ముల్క్ నిర్మించారని, ఆ భవనం, అక్కడి స్థలం అంశాలపై సివి ల్ వివాదం ఉండగా, ప్రభుత్వం ఆ భవనాన్ని కూల్చి అసెంబ్లీ భవనాన్ని నిర్మించడం చెల్లదం టూ నవాబు వారసులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రొఫెసర్ విశేశ్వర్‌రావు, జిందాబాద్ హైదరాబాద్ అనే స్వచ్ఛంద సంస్థ, ఇతరులు పిల్స్ దాఖలు చేసిన విష యం విదితమే. గతంలోనే వారసత్వ కట్టడాలకు సంబంధించిన హుడా నిబంధనలను ప్రభుత్వం 2015 లోనే తొలగించినట్టు ప్రభుత్వ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ జె.రామచందర్‌రావు చెప్పారు. ఒక చట్టాన్ని రద్దు చేసి మరో చట్టం చేసినప్పుడు పాత చట్టంలోని నిబంధనలేమీ చెల్లబాటు కావన్నారు.