బౌలర్లపై నమ్మకం వమ్ముకాలేదు : కొహ్లీ
సిడ్నీ: ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్‌ను గెలవడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హర్షం వ్యక్తం చేశాడు. ఇదొక మధురమైన జ్ఞాపకంగా కోహ్లీ పేర్కొన్నాడు. తాము అన్ని విభాగాల్లోనూ సమష్టిగా రాణించడంతోనే ఆసీస్‌ను వారి దేశంలోనే ఓడించగలిగామని చెప్పాడు. అయితే బౌలర్లను ప్రత్యేకించి అభినందించాల్సిన సందర్భం ఇదేనని చెప్పాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా చివరి టెస్టు డ్రాగా ముగియడంతో కోహ్లీసేన సిరీస్‌ను 2- కైవసం చేసుకుంది. దీనిపై కోహ్లీ స్పందిస్తూ, “2011 వరల్డ్‌కప్ సాధించిన భారత జట్టులో నేను జట్టు సభ్యుడిని. అదొక చిరస్మరణీయమైన జ్ఞాపకంగా పేర్కొన్నాడు. కాకపోతే ఆ సమయంలో తానొక యువ క్రికెటర్‌ను మాత్రమే. ఆ వరల్డ్‌కప్ గెలిచిన ఆనంద క్షణాల్ని జట్టు సభ్యులు ఆస్వాదించడాన్ని స్వయంగా చూశాను. కానీ వారు ఎలా ఫీలయ్యారో తనకు అప్పుడు తెలియలేదు. ఇప్పుడు కెప్టెన్‌గా చారిత్రక సిరీస్‌ను గెలిచిన సందర్భాన్ని విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇంత గొప్పగా నేను ఎప్పుడూ ఫీల్ కాలేదు. మేము ఏదైతే వ్యూహంతో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లామో దాన్ని కచ్చితంగా అమలు చేసి సక్సెస్ అయ్యాం. ప్రధానంగా తమ బ్యాటింగ్ విభాగానికి బౌలర్ల జోష్ కూడా తోడవడంతో విజయం సునాయాసమైంది. ప్రతీ ఒక బౌలర్ తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు” అని కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు. “ప్రస్తుత జట్టును చూసి చాలా గర్వంగా ఉంది. ఈ సిరీస్‌ను సాధించడం నిజంగా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నా. గత 12 నెలల నుంచి మా జట్టు అద్భుతమైన విజయాలు సాధిస్తూ చక్కటి పునాది వేసుకుంది. ఏడాది కాలంగా జట్టులో వచ్చిన సమతుల్యంతోనే ఆసీస్‌ను వారి గడ్డపై ఓడించాం. అంతకుముందు జరిగిన రెండు విదేశీ పర్యటనల్లో కూడా మా జట్టు సత్తా చాటింది. భారత క్రికెట్ జట్టు ఈ స్థాయి ప్రదర్శనను నేను ఎప్పుడూ చూడలేదు. నలుగురు పేసర్లతో విదేశీ పర్యటనకు వెళ్లడం కూడా నా అనుభవంలో ఎదురుకాలేదు. ఇది జట్టు సభ్యులందరూ సాధించిన అద్భుతమైన ఘనత. ప్రధానంగా ఫిట్‌నెస్ స్థాయిని కాపాడుకోవడం వల్లే ఆస్ట్రేలియా గడ్డపై విజయాలు సాధించగలిగాం. దీనికి జట్టు సభ్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. హ్యాట్సాఫ్ టు టీమ్ మెంబర్స్. మన తలంపు ఎప్పుడైతే సరైన రీతిలో ఉంటుందో అప్పుడు అద్భుతమైన ఫలితాలు సాధిస్తాం. భారత క్రికెట్‌ను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడమే మా ముందున్న లక్ష్యం’ అని కోహ్ల్లీ తన భవిష్యత్ వ్యూహాన్ని సూచాయిగా చెప్పాడు.
ఇదొక మధుర జ్ఞాపకం!
RELATED ARTICLES