నిబంధనలు గాలికి కిక్కిరిసిపోయిన నాన్‌వెజ్ మార్కెట్లు
ప్రాణం మీదకు వస్తున్నా పట్టని జనం
పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శలు
అశ్రద్ధ, బాధ్యతారాహిత్యంతో మూల్యం తప్పదని వైద్యుల హెచ్చరిక
ప్రజాపక్షం న్యూస్ నెట్‌వర్క్ : రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నా ప్రజలు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్‌లో వ్యాప్తిని నిరోధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను పట్టించుకోవడం లేదు. అత్యవసర కార్యక్రమాల కోసం ఇచ్చిన నాలుగు గంటల సడలింపులో ప్రజలు గుంపులు గుంపులుగా రోడ్లపై వచ్చి నానా భీభత్సం చేస్తున్నారు. ప్రాణం మీదికి వస్తున్నా ఖాతరు చేయకపోవడం భాధాకరం. ఆదివారం కావడంతో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు చేపల మార్కెట్లు, చికెన్, మటన్ దుకాణాల వద్ద భారీ రద్దీ నెలకొంది. పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడంతో పాటు అక్కడికి వచ్చిన వారు కొవిడ్ నిబంధనలు ఏమాత్రం పాటించలేదు. భౌతిక దూరం పాటించలేదు సరికదా.. మాస్కులు కూడా
సరిగా ధరించలేదు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని రాంనగర్, బేగంబజార్ చేపల మార్కెట్లు, జియాగూడ, చెంగిచెర్ల మటన్ మార్కెట్లు, ఇతర ప్రాంతాలలోని చికెన్, మటన్ బజార్లు క్రిక్కిరిసిపోవడం ఇందుకు అద్దం పడుతున్నాయి. వివిధ నగరాలు, పట్టణాలలో ముఖ్యమైన కూడళ్లు, రహదారులు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సంతల మాదిరిగా కనిపించాయి. మరికొన్ని చోట్ల 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ ఆ తర్వాత కూడా కార్యకలాపాలు కొనసాగిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కొంత మంది నిర్లక్ష్యం ఫలితంగా లాక్ డైన్ అపహస్యం పాలవుతూ మార్కెట్లు, బజార్లు కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారే పరిస్థితి ఏర్పడింది. ఆదివారం మార్కెట్లలో రద్దీని ప్రత్యక్షంగా చూసిన జనం, మీడియాలో వచ్చిన కథనాలను చూసిన ప్రజలు లాక్‌డౌన్ అమలు తీరును, కొంత మంది భాధ్యతారాహిత్యంపై తీవ్ర ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు. ఇంత బహిరంగంగా రద్దీతో మార్కెట్లు నిర్వహిస్తుండడం చూసి ఈ లాక్‌డౌన్ వల్ల ఉపయోగమేమిటని, ఇది అవసరమా అని ప్రశ్నింస్తున్నారు. మరో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయడంలో పోలీసు యంత్రాంగం విఫలమైందని సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. గుంపులు గుంపులగా జనం రోడ్లపై వస్తుంటే పోలీసులు ఇతర అధికా యంత్రాంగం పట్టించుకోవడం లేదంటున్నారు. ఇప్పటికైనా పోలీసులు అనవసరంగా రోడ్ల పైకి వచ్చే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, నిబంధనలను తప్పకుండా పాటించే విధంగా చర్యలు తీషుకోవాలని, తద్వారా లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో ప్రభుత్వాలు ఎన్ని కట్టడి చర్యలు చేపట్టినా కనీస వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడం ప్రజల బాధ్యత అని, ఇప్పటికీ అశ్రద్ధగా, బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తే మాత్రం ప్రజలు మూల్యం చెల్లించుకోక తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదేమి లాక్‌డౌన్?
RELATED ARTICLES