పథకానికి ప్రాతిపదికేమిటి?
మాఫీ కావాల్సింది రూ. 628 కోట్లు : అయింది రూ. 168 కోట్లే
రైతుల్లో అసహనం, అనుమానం
ప్రజాపక్షం/ ఖమ్మం నాలుగున్నర సంవత్సరాల తర్వాత అమలవుతుందన్న రుణమాఫీపై రైతుల్లో అసహనం, అనుమానం రోజు రోజుకు పెరుగుతోంది. రూ. 99,999 వరకు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం… ఆ ప్రక్రియను ప్రారంభించింది. ఒక రైతు కుటుంబానికి లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తున్నందున తమ రుణం మాఫీ అవుతుందని రైతులు భావిస్తున్నా రు. కానీ ప్రభుత్వం ఏ ప్రాతిపదికన చేస్తుందో అర్థం కావడం లేదు. సహకార బ్యాంకుల్లో రుణం తీసుకున్న రైతుల్లో కొంత మందికి రూ. 20 వేల అప్పు మాఫీ అయింది. కొందరివి లక్ష లోపు వరకు మాఫీ అయ్యాయి. మాఫీకి ఏ ప్రాతిపదిక లేకపోవడంతో రైతుల్లో గందరగోళం నెలకొంది. లక్ష్మిపురం సహకార సంఘంలో 1200 మందికిపైగా రైతులు ఉంటే కేవలం 168 మంది రైతుల రుణం మాత్రమే మాఫీ అయినట్లు సమాచారం. మిగిలిన సహకార సంఘాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. ఖమ్మంజిల్లాలో సుమారు రూ. 618 కోట్ల రుణమాఫీ కావాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం రూ. 168 కోట్ల మేర మాత్రమే రుణమాఫీ జరిగినట్లు తెలుస్తుంది. ఈనెల 15 నాటికే రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుందని ప్రకటించిన నేపథ్యంలో రుణమాఫీ కాకపోయే సరికి అసలు మాఫీ అవుతుందా, కాదా అన్న సందేహం కలుగుతుంది. గతంలో రుణమాఫీ చెక్కులు మీ ఇంటికే వస్తాయని అన్నారు కానీ, రాలేదు. ఇప్పుడు అదే పరిస్థితి ఎదురవుతుందా అన్న సందేహం రైతుల్లో కలుగుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు రుణమాఫీకి సంబంధించి స్పష్టమైన ప్రకటన జారీ చేయాలని రైతులు కోరుతున్నారు.
ఇదేం రుణమాఫీ
RELATED ARTICLES