ఠాణా నిర్వహణ ఖర్చులు ఇస్తున్నా డబ్బుల వేటలో ఎస్‌హెచ్‌ఒలు
పహాడీషరీఫ్, ఆర్‌జిఐ విమానాశ్రయ పోలీసు స్టేషన్ల ఉదంతాలే నిదర్శనం
ప్రజాపక్షం/హైదరాబాద్: ఠాణా నిర్వహణ ఖర్చులు ప్రభుత్వం ఇస్తు న్నా.. కొంత మంది స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (ఎస్‌హెచ్‌ఒ) అవినీతికి పాల్పడుతున్నారు. స్టేషన్‌కు వచ్చిన కేసులో తమకెంత దొరకుతుందనే ఆశతో కేసులను సెటిల్‌మెంట్ చేస్తున్నారు. పహాడీషరీఫ్, ఆర్‌జిఐ విమానాశ్రయ పోలీసు స్టేషన్‌లు ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. గ్యాంగ్ రేప్ కేసులో స్టేషన్‌లో ఉన్న నిందితులతో సెటిల్‌మెంట్ కుదుర్చుకుని పహాడీషరీఫ్ పోలీసులు విడిచిపెట్టగా.. బాంబు తయారీ పేలుళ్లకు ఉపయోగించే అమోనియా నైట్రేట్ తరలిస్తున్న నిందితుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని వదిలిపెట్టిన ఘనత ఆర్‌జిఐ విమానాశ్రయ పోలీసులు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ విసి సజ్జనార్ సదరు ఇన్‌స్పెక్టర్‌పై సస్పెండ్ వేటు వేశారు. ఈ రెండు కేసులలో పోలీసు అధికారులు అనుసరించిన విధానం చూస్తుం టే డబ్బుల కక్కుర్తితో కేసులను తారుమారు చేశారని తేలింది.
స్టేషన్‌కు రూ.75 వేలు ఇస్తున్నా : ఠాణాకు ఫిర్యాదుదారులు ఎవరు వచ్చినా వారి నుంచి అంతో ఇంతో ఖర్చుల కోసం పోలీసులు డబ్బు లు వసూలు చేసేవారు. అనాథ శవాన్ని తరలించాలన్నా, నిందితులకు భోజనాలు చేయించాలన్నా, వారిని ఆసుపత్రికి తరలించాలన్నా అయ్యే ఖర్చులను పోలీసులే జేబులోంచి పెట్టుకునేవారు. ఇలాంటి ఖర్చుల కోసం తమ ఠాణా పరిధిలోని ఆయా వ్యాపార సంస్థలు, ఇతర వ్యక్తుల వద్ద నుంచి పోలీసులు నెలవారి మామూళ్లు వసూలు చేసేవారు. ఈ మా మూళ్లు వసూలు చేసేందుకు ప్రతి ఠాణాకు ప్రత్యేకంగా ఒక కానిస్టేబుల్‌ను నియమించుకునేవారు. వచ్చిన కలెక్షన్‌ను అందరూ సమానంగా పంచుకునేవారు. తమ సిబ్బంది డబ్బులు తీసుకునే విషయంపై ఉన్నతాధికారు లు కూడా వెనుకేసుకొచ్చేవారు. దీంతో ప్రజల్లో పోలీసులకు చెడ్డపేరు ఉండేది. ఇదంతా గతం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పోలీసులకు వచ్చిన చెడ్డ పేరును చెరిపేసేందుకు ఠాణా నిర్వహణకు అయ్యే ఖర్చుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్‌ను కేటాయించింది. పట్టణ ప్రాంతాలలోని పోలీసు స్టేషన్‌లకు నిర్వహణ ఖర్చుల కింద రూ.75,000,జిల్లా కేంద్ర పోలీసు స్టేషన్‌లకు రూ.50,000, ఇక మండలస్థాయి పోలీసు స్టేషన్‌లకు రూ.25,000 చొప్పున ప్రతి నెల ఇస్తున్నారు. ఈ డబ్బులను ఠాణా నిర్వహణకు అవసరమైన పనుల కోసం ఖర్చు చేసుకునే అధికారం అక్కడి ఎస్‌హెచ్‌ఒకు ఉంది. అనాథ శవాలను మార్చురీకి తరలించాలన్నా, లాకప్‌లో ఉన్న నిం దితులకు భోజనాలు, ఫ్యాన్లు,లైట్ల రిపేరింగ్ తదితర అవసరాల కోసం ఈ డబ్బును వినియోగించాల్సి ఉంటుంది. తద్వారా పోలీసులు తమ జేబులోంచి డబ్బులు ఖర్చుపెట్టే అవసరం లేకుండా చేశారు. ఇంత వరకు బాగానే ఉంది.