సవరణలు చేయాలని, సెలక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్
నిరసనల నడుమ రాజ్యసభలోనూ ఇబిసి కోటా బిల్లుకు ఆమోదముద్ర
అనుకూలంగా 165 ఓట్లు, వ్యతిరేకంగా 7 ఓట్లు
న్యూఢిల్లీ: లోక్‌సభ మంగళవారం ఆమోదించిన అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును రాజ్యసభ బుధవారం ఆమోదించింది. 124 రా జ్యాంగ సవరణకు సంబంధించిన ఈ బిల్లును యథాతథంగా ఆమోదించారు. అనుకూలంగా 165 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 7 ఓట్లు వచ్చాయి. ఇక ఈ బిల్లు చివరి అంకం ఏమిటంటే రాష్ట్రపతి ఆమో దం పొందడం. రాష్ట్రపతి ఆమోదం పొం దాక ఈ బిల్లు చట్టం అవుతుంది. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాలని, సవరణలు చేయాలని ప్రతిపక్షాలు చేసిన డిమాండ్లు, సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లుకు ఆమోదముద్ర లభించింది. ఈ బిల్లును తొలుత సెలెక్ట్ కమిటీకి పంపాలని డిఎంకె ఎంపి కనిమొళి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా విపక్షాలకు చెందిన సభ్యులు మద్దతు పలికారు. వామపక్షాలు, టిడిపి, ఆర్జెడి, ఆప్, జెడి(ఎస్) ఆమె తీర్మానానికి మద్దతు పలికాయి. పరిశీలన కోసం ఈ బిల్లును పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీకి పంపాలన్నారు. ఆమె తీర్మానానికి 18 మంది సభ్యులు మద్దతు ఇవ్వగా, 155 మంది వ్యతిరేకించారు. ఆ తర్వాత ప్రతిపక్షాలు 5 సవరణలు కోరుతూ చేసిన తీర్మానాన్ని కూడా సభ తిరస్కరించింది. ఈ బిల్లు చట్టబద్ధతపై అనేక మంది ప్రతిపక్ష సభ్యులు సందేహాలు వ్యక్తం చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వారెవరో నిర్వచించాలన్నారు. హోం మంత్రి ఈశాన్య రాష్ట్రాల స్థితిపై ప్రకటన చేయాలని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ కోరాయి. సిపిఐ ఎంపి డి. రాజా కనిమొళి తీర్మానంపై మొదట చర్చ జరగాలన్నారు. సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ ఇది చాలా ముఖ్యమైన బిల్లు అన్నారు. సామాజికంగా వెనుకబడినవారు ఎలాగైతే రిజర్వేషన్లు పొందుతున్నారో ఆర్థికంగా వెనుకబడినవారు కూడా ఈ బిల్లు ద్వారా రిజర్వేషన్లు పొందుతారన్నారు. ఈ బిల్లును మేము సదుద్దేశంతోనే తీసుకొచ్చామన్నారు. రాజ్యసభలో సంఖ్యాబలం ఉన్న కాంగ్రెస్, ఆర్జెడి సహా పలు ప్రాంతీయ పార్టీలు కోటా బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబిసీలకు ఉద్దేశించిన రిజర్వేషన్ల వ్యవస్థకు ఈ బిల్లుతో విఘాతం కలుగుతుందని ఆర్జెడి సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయస్థానంలో బిల్లు నిలబడదన్నారు. కాగా దీనికి బిజెపి సభ్యులు లోక్‌సభలో బిల్లును ఆమోదించిన విపక్షాలు రాజ్యసభలో మోకాలడ్డుతూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని విమర్శించారు. సభలో అధికార పక్షానికి, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది.