చివరి ఆయకట్టు వరకూ నీరందించడమే లక్ష్యం
ఎన్నికల హామీలన్ని నెరవేరుస్తాం
డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్క,
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ప్రజాపక్షం/కోదాడ రూరల్ / మధిర కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సూర్యాపేటజిల్లా కోదాడ మండలంలోని రెడ్లకుంట గ్రామం లో నిర్మిస్తున్న రెడ్లకుంట, ఉత్తమ్ పద్మావతి లిప్ట్ ఇరిగేషన్ పథకాలకు బుధవారం శంకుస్థాపన చేశారు. అదే విధంగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వారు శంకుస్థాపనలు చేశారు. మధిర నుండి ఆత్కూరు బైపాస్ బిటి రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంపౌండ్‌వాల్, నూతన బిల్డింగ్ నిర్మాణాలకు, మధిర ట్యాంక్‌బండ్ నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ పనులకు వారు శంకుస్థాపన చేశా రు. కాగా, సూర్యాపేట జిల్లాలో ఉత్తంకుమార్‌రెడ్డి మాట్లాడుతూ లిప్ట్ ఇరిగేషన్ ద్వారా శాంతినగర్, రెడ్ల కుంట గ్రామాల్లో 10 వేల ఎకరాల వరకు పంట సాగుచేసే అవకాశం ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, ఆయకట్టు చివరి భూములకు కూడా సాగునీరు అందించడమే తమ లక్ష్యమన్నారు. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తుందన్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3500 మంది నిరుపేదలకు గృహలక్ష్మి పథకం ద్వారా ఇండ్లు నిర్మించుకోవడానికి రూ.5 లక్షలు అందించనున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులుగా గెలిచిన మరుక్షణమే ఉత్తమ్ దంపతులు అభివృద్ధిపై దృష్టి పెట్టారని గుర్తు చేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎన్నికల సమయంలో 50 వేల మెజారిటీ తగ్గదని సవాల్ చేయడం గొప్ప విషయమన్నారు. పట్టణంలో రెసిడెన్షియల్ పాఠశాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంఎల్‌ఎ ఎన్.ఉత్తమ్ పద్మావతిరెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ చందర్‌రావు, నాయకులు లక్ష్మీనారాయణరెడ్డి, పాండురంగారావు, యెర్నేని బాబు, రామారావుతో పాటు ఎంపిపిలు, జడ్‌పిటిసిలు పాల్గొన్నారు.
మధిర నియోజకవర్గ అభివృద్ధే నా ధ్యేయం
మధిర నియోజకవర్గ అభివృద్ధే నా ధ్యేయమని డిప్యూటీ సిఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ మధిర నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మధిరలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మధిర నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని, అందుకు అనుగుణంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మధిర నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుంచుతానని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఆరు గ్యారంటీల్లో నాలుగు గ్యారంటీలను అమలు చేశామని, మిగితా రెండు గ్యారంటీలను కూడా త్వరలోనే అమలు చేస్తామన్నారు. భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ డిప్యూటీ సిఎం మల్లు భట్టివిక్రమార్క సూచనల మేరకు మధిర నియోజకవర్గ పరిధిలోని రైతాంగానికి నాగార్జునసాగర్ ద్వారా సాగునీటి విడుదలకు మూడవ జోన్ కింద ఉన్న ఆయకట్టును రెండోజోన్ కిందకు తీసుకువచ్చే విధంగా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. ముందుగా భట్టి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు కాంగ్రెస్ శ్రేణులు, మున్సిపాలిటీ పాలకవర్గం ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్‌పర్సన్ ఎం.లత, వైస్‌చైర్‌పర్సన్ శీలం విద్యాలత వెంకట్‌రెడ్డి, ఎంపిసి మెండెం లలిత, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాధం, డిసిసిబి చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.