కెసిఆర్‌పై సిపిఐ, సిపిఐ(ఎం) విమర్శ
పొత్తులపై అవకాశవాదం
ఢిల్లీస్థాయిలో కలిసి పనిచేద్దామని చెబుతూనే ఏకపక్షంగా జాబితా ప్రకటన
రాష్ట్రంలో బిజెపి ప్రమాదం లేదా? బిఆర్ఎస్కు బిజెపితో మిత్రుత్వం కలిగిందా?
మునుగోడులో వామపక్షం మద్దతు లేకపోతే ప్రభుత్వ పరిస్థితి ఏమిటని కూనంనేని నిలదీత
ప్రజాపక్షం/హైదరాబాద్ పొత్తుల అంశంలో బిఆర్ఎస్ అధ్యక్షుడు, సిఎం కె.చంద్రశేఖర్‌రావు అవకాశవాదంగా వ్యవహారించారని, స్నేహధర్మాన్ని పాటించలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఒక వైపు అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు ఢిల్లీ స్థాయిలో కలిసి పనిచేద్దామని చెబుతూనే, మరోవైపు సీట్ల సర్దుబాటులో చర్చలు జరుగుతున్న సమయంలోనే సిఎం కెసిఆర్ ఏకపక్షంగా జాబితాను ప్రకటించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యల ద్వారా బిజెపితో ఎక్కడో ఆ పార్టీకి సఖ్యత వచ్చిందని అర్థమవుతోందన్నారు. హైదరాబాద్‌లోని మగ్దూంభవన్‌లో మంగళవారం సిపిఐ, సిపిఐ(ఎం)ల రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సమావేశమై బిఆర్ఎస్ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించిన పరిణామాలపై చర్చించారు. అనంతరం వివరాలను మీడియా సమావేశంలో కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం తెలియజేశారు. సిపిఐ, సిపిఐ(ఎం) కలిసి పోటీ చేస్తాయని, కలిసొచ్చే వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక పార్టీలు, ఇతర శక్తులతో కలిసి మందుకెళ్తామని వారు స్పష్టం చేశారు. అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా బిజెపిని నిలువరించేందుకే మునుగోడులో బిఆర్ఎస్కు మద్దతునిచ్చామని, అందులో విజయం సాధించామని చెప్పారు.
బిఆర్ఎస్ను ఓడించడమే ఎన్నికల నినాదం: కూనంనేని
బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడమే నినాదంగా ఎన్నికలలో ముందుకెళ్తామని కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. సిఎం కెసిఆర్ ఏకపక్షంగా బిఆర్ఎస్ జాబితాను ప్రకటించడంతోనే ఆ పార్టీకి 4 నుండి 5 శాతం ఓట్లు తగ్గాయని తెలిపారు. సిఎం కెసిఆర్ ప్రవర్తించిన తీరు అభ్యంతకరమని, కనీసం మిత్రధర్మాన్ని, స్నేహాన్ని పాటించకుండా పద్ధతి లేకుండా తనకు తానుగా, పొమ్మనకుండా పొగ పెట్టినట్టుగా ఉన్నదని విమర్శించారు. అవకాశవాద, మోసపూరిత బిఆర్ఎస్ను ఓడించాలని ఎన్నికల్లో ముందుకు వెళ్తామన్నారు. బిజెపితో ఎక్కడో సఖ్యత వచ్చిందనే అంశం తమకు అర్థమైందన్నారు. బిజెపి నెపంతో సిపిఐ, సిపిఐ(ఎం)ను ఆహ్వానించారని, ప్రస్తుతం రాష్ట్రంలో బిజెపి ప్రమాదం లేదా? ఉన్నదా, బిఆర్ఎస్కు బిజెపితో మితృత్వం కలిగిందా? అనే అంశాలపై కెసిఆర్ సమాధానం చెప్పాలని కూనంనేని డిమాండ్ చేశారు. జాబితా విడుదల సమయంలో కనీసం మిత్రధర్మాన్ని పాటించాలని, ధర్మం ఉండదా?, రాజకీయాలంటేనే మోసం అనే పద్దతుల్లో నిర్వచనం ఇచ్చారా? అని కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. వామపక్షాలు లేకపోతే మునుగోడులో ప్రభుత్వ పరిస్థితి ఏమిటని, వామపక్షాలు లేకపోతే బిజెపి గెలిచేదా? అని ప్రశ్నించారు. మునుగోడులో ఆనాడు బిజెపి గెలిస్తే ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితులు ఏమిటని, ఆనాడే బిఆర్ఎస్ ఎంఎల్ఎలతో బేరసారాలు జరిగాయా? లేదా? అని నిలదీశారు. తమ నిర్ణయాలు ఎంత బలంగా ఉంటాయో,హేతబద్దత ఉంటుందో మునుగోడు ఎన్నిక ద్వారా కాంగ్రెస్‌తో పాటు అందరికీ తెలిసిందన్నారు. బిఆర్ఎస్కు బిజెపి అండదండలు ఉంటే చాలని కెసిఆర్ అనుకుంటున్నారని విమర్శించారు. సిపిఐ, సిపిఐ(ఎం) కలిసి నిర్ణయాత్మక పాత్రను పోషిస్తాయని, తామూ గెలిచేందుకు తుదివరకు ప్రయత్నిస్తామని చెప్పారు. కమ్యూనిస్టుల పరిస్థితి ఏమిటనే వారికి కమ్యూనిస్టులు ఏమిటో తెలియజేస్తామని ఆయన ప్రకటించారు. బిజెపి, బిఆర్ఎస్ మధ్య అవగాహన ఉండొచ్చని తన వ్యక్తిగత అభిప్రాయాన్ని కూనంనేని తెలిపారు.
మునుగోడు ఎన్నికల సమయంలో సిఎం కెసిఆర్ స్వయంగా సిపిఐ, సిపిఐ(ఎం) నేతలను ఆహ్వానించారని, జాతీయ నాయకులకు అతిథి మర్యాద చేశారని, జాతీయ స్థాయిలో కలిసి వెళ్తామని కెసిఆర్ చెప్పిన విషయాలను కూనంనేని గుర్తుచేశారు. బిఆర్ఎస్ ఆవిర్భావ సభకు తమను ఆహ్వానించారన్నారు. బిజెపి ప్రమాదానికి, ప్రభుత్వ రంగ సంస్థలను విధ్వంసానికి వ్యతిరేకంగా, కార్మిక చట్టాలు, రైతు చట్టాలను, ఎల్ఐసి, సింగరేణిని కాపాడుకోవాలని నాడు సిఎం కెసిఆర్ చెప్పారన్నారు. రైతు సమస్యల అంశంలో తమను ఆహ్వానించారని, సిఎం హుషారుగా ఉన్నప్పడూ స్వయంగా తమకు ఫోన్లు కూడా చేశారని తెలిపారు. మునుగోడు ఎన్నికల తర్వాత కూడా ప్రజాసమస్యలపై సిపిఐ, సిపిఐ(ఎం)లు పోరాటం చేశాయని, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ తదితర జిల్లాల్లో భూపోరాటం చేశామని, తనతో సహా తమ నాయకులపై అనేక కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇటీవల గ్రామ పంచాయతీ ఉద్యోగులు, ఎఎన్ఎంలు, తదితరుల సమ్మె ఎఐటియుసి, సిఐటియుల ఆధ్వర్యంలోనే జరిగాయన్నారు. బిఆర్ఎస్తో పొత్తు చెడినా తాము వ్యక్తిగతంగా తిట్టబోమని, విధానపరంగానే విమర్శిస్తామని స్పష్టం చేశారు.
‘ఇండియా’లో తాము ఉండడం పట్ల బిఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది: తమ్మినేని
సీట్ల సర్దుబాటు సందర్భంగా బిఆర్ఎస్, సిపిఐ, సిపిఐ(ఎం) మధ్య జరిగిన చర్చల్లో రాజకీయ వైఖరిపై చర్చ జరిగిందని తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఇండియా, ఎన్‌డిఎ కూటమిలకు తాము దూరంగా ఉంటామని, ‘మీరు’ ఇండియాలో ఉన్నారని చర్చ జరిగిందని, ఆ తర్వాత తాము పోటీ చేసే సీట్లను తెలియజేశామని వివరించారు. సిఎం కెసిఆర్ ఏకపక్షంగా, బిఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారని, తాము కోరిన స్థానాలలో కూడా బిఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడం ఊహించని పరిణామమన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో మద్దతు ఇవ్వాలని సిఎం కెసిఆర్ స్వయంగా కోరారని తెలిపారు. పొత్తుల అంశంలో సీట్ల సర్దుబాటు సమస్య కాదని, రాజకీయ వైఖరిలోనే ఏదైనా తేడా వచ్చిందా? అని తమ్మినేని ప్రశ్నించారు. బిఆర్ఎస్ వైఖరిని చూస్తుంటే ‘ఎన్‌డిఎ’ కూటమితో దగ్గరగా ఉన్నారని, కాబట్టే రాజకీయ అడ్డంకిగా భావిస్తున్నారా? అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దీనిపైన కెసిఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో అప్రజాస్వామిక విధానాలు, కుటుంబ పాలన, ఏకపక్ష నియంతృత్వం, ప్రజాస్వామ్యం లేకుండా ధర్నాచౌక్ రద్దు తదితర లోపాలు ఉన్నప్పటికీ బిజెపిని వ్యతిరేకించడంలో సమర్ధించామని తమ్మినేని వివరించారు. ఈ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, పశ్య పద్మ, తక్కెళ్లపల్లి శ్రీనివాస్‌రావు, ఎన్.బాలమల్లేష్, ఎం.బాలనర్సింహ, బాగం హేమంతరావు, వి..ఎస్.బోస్, ఈ.టి.నర్సింహా, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, పోతినేని సుదర్శన్, జాన్ వెస్లీ పాల్గొన్నారు.
ఇది మిత్రద్రోహం
RELATED ARTICLES