‘దళితబంధు’పై అవగాహన సదస్సులో సిఎం కెసిఆర్ వ్యాఖ్య
పథకం అమలు ప్రభావం యావత్ తెలంగాణపై ఉంటుంది
విజయవంతానికి దృఢ నిర్ణయం తీసుకోవాలని పిలుపు
ప్రజాపక్షం / హైదరాబాద్ ‘దళిత బంధు’ పథక లబ్ధిదారులకు ‘దళిత బీమా’ పథకాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. రైతు బీమా మాదిరిగా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి దళిత బీమాను అమలు పరుద్దామని, మంత్రి సహా, దళిత ప్రజా ప్రతినిధులు, ఎస్‌సి డెవలప్‌మెంట్ శాఖ ఉన్నతాధికారులు, ఈ దిశగా కార్యాచరణపై కసరత్తు చేయాలని ఆదేశించారు. ఆమోదయోగ్యమైన కార్యాచరణను రూపొందించుకొని, కొంచెం ఆలస్యమైనా, దళిత బీమాను అమలు చేస్తామన్నారు. దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొందే అర్హులకు గుర్తింపు కార్డును అందిస్తామని, ప్రతీ లబ్ధిదారునికి ప్రత్యేకమైన బార్‌కోడ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ చిప్ ను ఐడి కార్డులో చేర్చి పథకం అమలు తీరు సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందుపరుస్తామని తెలిపారు. నిరంతర పర్యవేక్షణ ద్వారా ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా జాగ్రత్తలు తీసుంటామన్నారు. ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన ‘దళిత బంధు’ పథకం అవగాహన సదస్సు సోమవారం జరిగింది. సదస్సుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాల నర్సింహా, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వెంకట్, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, దళిత ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, కార్పొరేషన్ చైర్మన్‌లు హాజరయ్యారు. దళిత బంధు పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన దళిత ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ ‘తెలంగాణ దళిత బంధు’ కేవలం కార్యక్రమం కాదని, ఒక ఉద్యమమని కెసిఆర్ అన్నారు. హుజూరాబాద్ నుంచి వచ్చిన ప్రతినిధులు సాధించే విజయం మీద యావత్ తెలంగాణ దళితబంధు విజయం ఆధారపడి ఉంటుందని, అందరూ ఆ దిశగా దృఢ నిర్ణయం తీసుకోవాలన్నారు. దళిత వాడల్లో ఇప్పటికే నమోదైన పరస్పర కేసులను పోలీస్ స్టేషన్‌లో ఎత్తి వేసుకోవాలని, పరస్పర సౌభ్రాతృత్వాన్ని పెంచుకోవాలని కోరారు. ఆర్థికంగా పటిష్టమైన నాడే దళితులు వివక్ష నుంచి దూరమవుతారని చెప్పారు. దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్ కేసులో దోషులుగా తేలిన పోలీసులను ఉద్యోగం నుంచి ప్రభుత్వం శాశ్వతంగా తొలగించిందని చెప్పారు. ప్రభుత్వ వర్గాలతో పనితీసుకునే క్రమం లో నేటి సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు కాపలా వర్గంగా డేగ కన్నుతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇతరులే దళితుల వద్ద అప్పు తీసుకోవాలి
“తెలంగాణ దళిత బంధు పథకం” ద్వారా రాష్ర్ట ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతో వారికిష్టమైన పరిశ్రమను, ఉపాధిని, వ్యాపారాన్ని ఎంచుకుని, తెలంగాణ దళిత సమాజం వ్యాపార వర్గంగా అభివృద్ధి చెందాలని సిఎం కెసిఆర్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. గ్రామాల్లోని ఇతర వర్గాలు దళితుల వద్దకే అప్పు కోసం వచ్చే దిశగా దళితుల ఆర్థిక సాధికారత సాధించాలన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలను అమలులోకి తెచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం దళితాభివృద్ధి కోసం చేస్తున్న చారిత్రక కృషిలో విద్యావంతులైన దళిత సమాజం కదలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణాలో అన్ని పథకాలను చూసి నేర్చుకున్నట్టే, దళిత బంధు పథకాన్ని చూసి కూడా ఇతర రాష్ట్రాలు నేర్చుకునే విధంగా పని చేయాలన్నారు. ఎరువుల దుకాణాలు, మెడికల్ షాపులు, రైస్ మిల్లులు, వైన్స్ షాపులు తదితర ఆర్థిక అభివృద్ధికి అవకాశం వుండే రంగాల్లో దళితులకు ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పిస్తుందని సిఎం కెసిఆర్ తెలిపారు. ఆర్థికాభివృద్ధికి అవకాశం వుండే ఇతర రంగాలను గుర్తించాలని, వాటిలో దళితులకు రిజర్వేషన్‌లు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పవర్ టిల్లర్, హార్వెస్టర్, వరి నాటు వంటి వ్యవసాయ యంత్రాలు, ఆటోలు, ట్రాక్టర్, కోళ్ళ పెంపకం, తదితర పలు రకాల ఉపాధి, పరిశ్రమ, వ్యాపార రంగాలను గుర్తించి, వారి వారి ఇష్టాన్ని బట్టి దళితబంధు పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. దీనికి అదనంగా, ప్రభుత్వ లబ్ధిదారుని భాగస్వామ్యంతో, శాశ్వత ప్రాతపదికన ‘దళిత రక్షణ నిధి’ని ఏర్పాటు చేస్తామన్నారు.
హుజూరాబాద్ దళితులపై వరాలు
రాష్ర్టంలోని దళితుల స్వాధీనంలో వున్న గ్రామ కంఠాల భూముల వివరాలు జాబితా తయారు చేసి, వారికి హక్కులు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. వారం పదిరోజుల్లో హుజూరాబాద్‌లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి, అసైన్డ్ సహా దళితుల అన్నిరకాల భూ సమస్యలను పరిష్కారం చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ కర్ణన్‌కు సిఎం కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారు. హుజూరాబాద్‌లో ఇల్లు లేని దళిత కుటుంబం ఉండొద్దని, ఖాళీ జాగలు వున్న వారికీ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుందని, దశల వారీగా తెలంగాణ వ్యాప్తంగా దళితులకు అమలు చేస్తామని తెలిపారు. రేషన్ కార్డులు, పింఛన్లు సహా అన్ని రకాల సమస్యలను, హుజూరాబాద్ నియోజకవర్గ దళితవాడల్లో గుర్తించి అధికారులకు నివేదిక అందజేయాలని సదస్సులో పాల్గొన్న ప్రతినిధులుకు కెసిఆర్ సూచించారు. అనంతరం సదస్సులో పాల్గొన్న దళిత ప్రతినిధులు దళిత బంధు నిధులతో ఏమి చేస్తారని సిఎం కెసిఆర్ ప్రశ్నించారు.
ట్రాక్టర్ కొనుక్కుంటః సమ్మయ్య
“ పథకంలో అర్హత పొంది నాకు ఆర్థిక సాయం అందితే.. ట్రాక్టర్ డ్రైవర్‌ను అయిన నేను ట్రాక్టర్‌ను కొనుక్కొనీ స్వయంగా నడుపుకుంట”- అని వీణవంక మండలం కిష్టం పల్లి గ్రామ నివాసి సమ్మయ్య అన్నారు.
స్విఫ్ట్ డిజైర్ కిరాయికి తిప్పుత: చిరంజీవి
“ కార్ డ్రైవర్ అయిన తాను టాక్సీ మారుతి స్విఫ్ట్ డిజైర్ కొనుక్కొని స్వయంగా కిరాయిలకు తిప్పుకుంట” అని వీనవంక మండలం లస్మక్కపల్లి గ్రామ వాసి దాసర్ల చిరంజీవి తెలిపారు.
దేశవ్యాప్తంగా దళిత బంధు కోసం పోరాడుతాం : బాల నర్సింహా
ప్రగతి భవన్‌లో జరిగిన సదస్సులో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాల నర్సింహా ప్రసంగిస్తూ దేశ వ్యాప్తంగా దళిత బంధు వంటి పథకం అమలు కోసం పోరాడుతామన్నారు. ఇన్నాళ్లు గత పాలకులు, అరకొర నిధులతో దళితుల కోసం అమలు పరిచిన పథకాలు, వారి ఆర్థికాభివృద్ధికి దోహదం చేయలేదన్నారు. ప్రభుత్వాలు ఏవో చేస్తున్నా దళితులు సరిగ్గా వినియోగించు కోవడం లేదని దళితుల పట్ల అపోహలను పెంచాయని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా రూ.10 లక్షలతో సిఎం కెసిఆర్ అమలు పరుస్తున్న దళిత బంధు స్కీమ్ దళితుల జీవితాల్లో విప్లవాత్మక మార్పుకు దారులు వేస్తుందని తెలిపారు. హుజూరాబాద్ పైలట్ ప్రాజెక్టు విజయవంతం కాకపోతే దాని ప్రభావం తెలంగాణ మీద దేశం మీద పడుతుందన్నారు. కాబట్టి అక్కడి దళితులు పట్టుదలతో ఒక యజ్ఞంలాగా భావించి పథకం అమలుకోసం కృషి చేయాలని, హుజూరాబాద్ దేశానికే దిక్సూచి కావాలని అన్నారు. పట్టుదలతో దళితుల సమాజిక ఆర్థిక అభివృద్ధికి పాటుబడుతున్న సిఎం కెసిఆర్ కు ధన్యవాదాలు బాల నర్సింహా ధన్యవాదాలు తెలిపారు.
దళిత బంధుతో దళితులు పులులు అవుతారుః వెంకట్
సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ మాట్లాడుతూ మేకలనే బలిస్తారు,పులులను కాదనే డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా , దళితులను పులులు గా మార్చే అవకాశం సిఎం కెసిఆర్ అమలు చేయ బోయే దళిత బంధు పథకం ద్వారా సాధ్యం అవుతుందని అన్నారు. ఈ విశ్వాసం కలిగాకే తాను ఈ సదస్సుకు వచ్చినట్లు తెలిపారు. తెలంగాణలో విజయం సాధించిన అనంతరం దేశమంతా దళిత బంధు లాంటి పథకాన్ని అమలు చేయాలని కేంద్రాన్ని వత్తిడి తెస్తామన్నారు.హుజూరాబాద్ లో విజయం సాధించి, దేశ దళిత జాతి ఆర్థికాభివృద్ధి కి దారులు వేద్దామన్నారు.