సాధ్యమైనంత త్వరగా భూసమగ్ర సర్వే
కొత్త రెవెన్యూ బిల్లులపై చర్చలో సిఎం కెసిఆర్
ప్రజాపక్షం/హైదరాబాద్ భూ సమగ్ర సర్వేతోనే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఒకసారి సర్వే పూర్తయి, ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత 99.9 శాతం వివాదాలు తొలగిపోతాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఏమైనా సమస్యలు వస్తే అందుకు అనుగుణంగా ఆర్డినెన్స్ తీసుకొస్తామన్నారు. భూ సమస్య పరిష్కారానికి కొత్త రెవెన్యూ చట్టం ఒక ఆరంభం మాత్రమేనని భవిష్యత్తులో మరిన్ని చేపడుతామన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రైవేటు సంస్థలతో సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. దేవాదాయ, వక్ఫ్‌బోర్డు, అటవీ భూముల రిజిస్ట్రేషన్లను ‘లాక్’ చేస్తామని, ఈ భూముల్లో కనీసం నిర్మాణ అనుమతులను కూడా ఇవ్వబోమని ప్రకటించారు. సర్వే తర్వాతనే ఆ సమస్యను పరిష్కరిస్తామన్నారు. అటవీ, అసైన్డ్ భూముల్లో గతంలో రాజకీయ దందా నడిచిందని విమర్శించారు. శాసనసభలో రెవెన్యూ బిల్లులపై జరిగిన చర్చకు సిఎం కెసిఆర్ శుక్రవారం సమాధానమిచ్చారు. ఏజె న్సీ ప్రాంతంలోని గిరిజనేతర రైతులకు కూడా రైతుబంధు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఎన్నికలు వచ్చాయంటేనే ఇష్టమొచ్చినట్టుగా భూములకు పట్టాల పంపిణీ చేశారన్నారు. భూ పంపిణీ ఒక రాజకీయ లక్ష్యంగా మారిందన్నారు. రెవెన్యూలో మరో రెండు,మూడు చట్టాలను తొలగించే విషయమై సమీక్ష చేస్తున్నామని తెలిపారు. పేదలకు భూములపై హక్కులు పోకుండా ఉండేలా వాటిని పరిశీలిస్తున్నామన్నారు. భూముల కేటాయింపుల విషయంలో గతంలో అవలంబించే విధానం అశాస్రీయంగా ఉండేదని, భూ పంపిణీలో ఇష్టమొచ్చినట్టు లెక్కలు రాశారని, 1500 ఎకరాలకు భూమికి 9 వేల ఎకరాలకు గాను పట్టాలు పంపణీ చేశారని గుర్తు చేశారు. విఆర్‌ఒ పీడ పోయిందని ప్రజలు అనుకుంటున్నారని కెసిఆర్ అన్నారు.
సచివాలయంలో రికార్డు రూమ్
త్వరలోనే సమగ్ర సర్వే జరుగుతుందని, ప్రతి సర్వే నంబర్‌కు కోఆర్డినేట్ నంబర్ ఉంటుందని,ఈ సమాచారాన్ని పోర్టల్ రూపంలో, డిజిటల్, డాక్యూమెంట్ రూపంలో కూడా వివరాలను పొందుపరుస్తామని చెప్పారు. కొత్తగా నిర్మించబోయే సచివాలయంలో స్ట్రాంగ్ రూమ్, రికార్డు రూమ్ పెడుతున్నామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 87 వేల ఎకరాలు దేవాదాయ భూములు ఉంటే ఇందులో అర్చకుల పేరిట 25 వేల ఎకరాలు, మరో 21 వేల ఎకరాలు లీజ్ ఉంటే, 22 ఎకరాల 540 గజాలు కబ్జాకు గురైందన్నారు. రెవెన్యూ కోర్టులు పెట్టదల్చుకోలేదని, ఉద్దేశపూర్వకంగా వివాదాన్ని పెట్టుకునే వారు సివిల్ కోర్టుకు పోతారని, ఐదు అంచెల కోర్టు వ్యవస్థ ఉన్నదని అన్నారు. నష్టపరిహారం ఏ దేశంలో ఇవ్వబోరని, సహాయక చర్యలు మాత్రమే చేపడుతారని, అలా చేస్తే నాలుగు సంవత్సరాల బడ్జెట్ కూడా సరిపోదన్నారు.
ప్రస్తుతం 87 చట్టాలే
సమైఖ్య రాష్ట్రంలో 170 చట్టాలు ఉండేదని, తెలంగాణ రాష్ట్రంలో బ్రిటీష్, ఎపి చట్టాలు అవసరం లేదని భావించే వాటిని ఉపసంహరించామని సిఎం కెసిఆర్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 87 చట్టాలు మాత్రమే ఉన్నాయన్నారు. ధరణి ఒక్కటే సర్వస్వం కాదని, మరిన్ని చట్టాలు కూడా ఉంటాయన్నారు. ఇది అంతం కాదని, ఆరంభం మాత్రమే అని చెప్పారు. జాగీర్‌దార్ ఎక్కడుందని, జాగీర్‌దార్లు ఉన్నారా? అని ప్రశ్నించారు. జగీర్‌దార్ యాక్ట్ పేరుతో ఫ్యాబ్రికేట్ డాక్యుమెంట్లతో దుర్మార్గులు కథలు చేస్తున్నారని, తద్వారా పిచ్చి పిచ్చి కేసులు వస్తున్నాయని చెప్పారు. సర్వే నంబర్ ఉంటే పరిష్కారం లభిస్తుందన్నారు. ఒక కుటుంబ సభ్యునికి అన్యాయం జరిగితే ఆయన ఎంఆర్‌ఒకు ఫిర్యాదు చేయవచ్చని, తద్వారా మ్యుటేషన్ కాకుండా సమస్య పరిష్కారం చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. రైతాంగానికి రెండు నెలల సమయం ఇచ్చి కుటుంబ సభ్యులు వివరాలను పాస్‌పుస్తకంలో నమోదు చేస్తామన్నారు.
రెండు రకాలుగా పాస్‌బుక్‌ల వర్గీకరణ
వ్యవసాయ భూములకు గ్రీన్ పాస్‌పుస్తకాలను ఇస్తామని, వ్యవసాయేతర భూములకు మెరున్ రంగు కార్డులను పంపిణీ చేస్తామని సిఎం చెప్పారు. ఒక కోటీ 45 లక్షల 58వేల ఎకరాలకు 48 గంటల్లో రూ. రూ. 7279 కోట్ల రైతుబంధును చెల్లించామన్నారు. 57 లక్షల 97వేల రైతులకు రైతుబంధు అందిచామన్నారు. రైతుబంధులపై ఇంటలిజెన్స్ ద్వారా నిఘా పెట్టామని, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీసినట్టు వివరించారు. ఏ ఒక్క గ్రామంలో నుంచి కూడా రైతుబంధు అవకతకలపై ఫిర్యాదు రాలేదని, మన గ్రామాల్లో గొడవలు లేవని స్పష్టం చేశారు. ఈ భూములన్ని ముందు క్లీయర్ అవుతాయన్నారు. మొత్తం ఒక కోటీ 60 లక్షల ఎకరాలకు స్థలంలో ఒక కోటీ 45 లక్షల పైచిలుకు వ్యవసాయ భూముల్లో సమస్యలు లేవని వివరించారు.
ప్రభుత్వం వద్ద భూములే లేవు
ప్రభుత్వం వద్ద భూములే లేవని, అలాంటిది ప్రభుత్వం భూ పంపిణీ ఎలా చేస్తుందని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. భూములు లేకుండా చేసిందే కాంగ్రెస్ అని ఆరోపించారు. తామిచ్చిన హామీమేరకు దళితులకు ఇతర భూములను కొనుగోలు చేసి భూ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 93 శాతం చిన్న, సన్నకారు రైతులు ఉన్నారని, 25 ఎకరాలపైన భూములున్న వారు 0.28 శాతమే ఉన్నారన్నారు. పాస్‌పుస్తకంలో అనుభవం కాలంను పెట్టబోబమని స్పష్టం చేశారు. అనుభవం కాలం పెట్టడం ద్వారా మూడేళ్లు పొదిషన్‌ఉంటే ఇన్‌జెక్షన్ ఆర్డర్ తీసుకునే వెసులుబాటు ఉన్నదని, తాము రైతులకు ఇబ్బంది పెట్టదల్చుకోలేదని పేర్కొన్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో కమర్షియల్, ఐటి కంపెనీలకు, ఇండ్లు కిరాయికి ఇస్తామని, అక్కడ అనుభవదారు కాలం ఎందుకు రాయడం లేదని, రైతులకు నోరులేదని, అసంఘటితంగా ఉన్నారని ఇలా రాస్తారా అని ప్రశ్నించారు. కౌలుకు, రైతుకు మధ్య జరిగే వ్యవహారాల్లో ప్రభుత్వాం జోక్యం అనవసరమన్నారు. కౌలుదారులను తాము పట్టించుకోబోమని, అది తమ పార్టీ పాలసీ అని తెలిపారు. భూమి శిస్తు వసూలు చేసేందుకే పహాణిలో ఇవన్నీ కాలములు ఉన్నాయని, భూమి శిస్తే లేనప్పుడు అవన్నీ ఎందుకని, విఆర్‌ఒ వ్యవస్థ రద్దుకు అది కూడా ఒక కారణమన్నారు. 1962 సంవత్సరం నుంచి 1982,2003 వరకు వక్ఫ్ భూములపై సర్వే జరుగుతూనే ఉన్నదని, గెజిట్స్ ఇస్తునే ఉన్నారని, ఇలా చేస్తే ఇక వక్ఫ్‌భూములు ఉంటాయా? గద్దలు ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోయారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 77 వేల 538 ఎకరాలు వక్ప్ బోర్డు గుర్తించి గెజిట్ విడుదల చేసిందని, ఇందులో 55వేల ఎకరాలు అన్యాక్రాంతమైందని, 6000 ఎకరాల్లో కేసులు కొనసాగుతున్నాయని వివరించారు.
అటవీకి ఓనర్లు కాదు
అటవీ భూముల్లో వ్యవసాయం చేసుకున్నవారంతా యజమానులు కాదని సిఎం స్పష్టం చేశారు. ధరణి పోర్టల్‌లో ఆర్‌ఒఎఫ్‌ఆర్ కాలం కూడా ఉంటుందన్నారు. ఇటీవల అటవీ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న 81వేల మంది రైతులకు రైతుబంధు పంపిణీ చేసినట్టు వివరించారు. పోడుభూములను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఇప్పటి ఆర్‌ఒఎఫ్‌ఆర్ సర్టిఫికెట్ పొందిన వారిని కాపాడుకుంటామని, వీరికి రైతులతో సమానంగా అన్ని పథకాలను అమలుచేస్తామని సిఎం హామీనిచ్చారు. త్వరలోనే దర్బార్ పెట్టి సమస్యను పరిష్కరిస్తామన్నారు. పోడు భూముల్లో వ్యవసాయం చేసుకునే వారికి రక్షణకల్పిస్తామని, ఆ తర్వాత ఇతరులకు అనుమతి ఇవ్వబోమని స్పస్టం చేశారు. అటవీ యాక్ట్ కూడా కేంద్ర ప్రభుత్నానిదేనని, అందులో తమకు పరిమిత అధికారం ఉంటుందన్నారు. దీనిని కూడా కూడా రాజకీయ దందాగా మార్చారని ఆరోపించారు. దళిత, గిరిజన ఎంఎల్‌ఎలు సమావేశమై దళితులు, గిరిజనులు ఏం కోరుకుంటున్నారు, ఏం అనుకుంటున్నారో తెలుసుకుని ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలని, దీనిని తాము అమలు చేస్తామని ప్రకటించారు.
జీఒ 58,59 సాదాబైనాలమకు మరో ఛాన్స్
మానవతాదృక్పథంతో మరోసారి జీఒ 58,59 ద్వారా సాదాబైనామాలకు అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడించారు. పేదలను కాపాడే ఉద్దేశంతో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని చివరి అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. ఆ తర్వాత ఎవ్వరైనా రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సిందేనని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజులను వసూలుచేసి సాదాబైనామాలను క్రమబద్ధీకరించారన్నారు. తాము మాత్రం 6 లక్షల 18 ఎకరాల భూమిని క్రమబద్ధీకరణ చేశామన్నారు. దీనికి ఒక్క రూపాయి ఫీజు కూడా తీసుకోలేదన్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్ జోన్ విషయమై చర్యలు తీసుకుంటామన్నారు. గ్రీన్‌జోన్ ఆలస్యంగా జరుగుతోందని, హెచ్‌ఎండిఎ తప్పు జరిగిందని భావిస్తున్నామని, గ్రీన్ జోన్స్ ప్రకటించాలని, ఈ జోన్‌లో అనుమతులు ఇవ్వబోమన్నారు.
కేంద్ర నిధులపై చర్చ
“అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం” పోతది అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వ వ్యవహారం ఉన్నదని సిఎం కెసిఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులనే కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని, ఇక భూ సర్వేకు ఏం ఇస్తుందని అన్నారు. అందుకే రావాల్సిన నిధులపై పార్లమెంట్‌లో పోరాటం చేయాలని తమ ఎంపిలకు సూచించినట్టు సభలో వివరించారు. కేంద్ర విద్యుత్ సంస్కరణలు, రాష్ట్రానికి కేంద్రం చేసిన సహాయం అంశంపై శాసనసభలో చర్చిస్తామని, కేంద్రం ఇచ్చిన పూర్తి లెక్కలు చెబుతామని అనానరు. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి 24 శాతం మైనస్‌లోకి వెళ్లిందని, ఎప్పుడు కోలుకుంటుందో దేవునికే తెలుసని అన్నారు.
విఆర్‌ఎల కుటుంబాలకు ఉద్యోగ ఛాన్స్
విఆర్‌ఎలు చేసిన సేవను దృష్టిలో పెట్టుకుని వారి సేవలను ఉపయోగించుకుంటామని సిఎం ప్రకటించారు. వారు ఉద్యోగంలో చేరుతానంటే తమకు అభ్యంతరం లేదని, లేదా వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ప్రతిపాదిస్తే ఇస్తామని తెలిపారు. వారు చాలా కష్టపడ్డారని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల ఉద్యోగులు ఉన్నట్టు తెలిపారు.
ఇది ఆరంభం మాత్రమే…
RELATED ARTICLES