ఆయుధ కర్మాగారాల్లో సమ్మె నిషేధంపై మండిపడిన సిపిఐ జాతీయ కార్యదర్శివర్గం
న్యూఢిల్లీ: ఆయుధ కర్మాగారాల్లో సమ్మెలను నిషేధిస్తూ మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన అత్యవసర రక్షణ సేవల ఆర్డినెన్స్ (ఇడిఎస్‌ఒ) 2021ని రద్దు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జాతీయ కార్యదర్శివర్గం డిమాండ్ చేసింది. రక్షణ రంగంలో పనిచేసే ఉద్యోగుల ప్రజాస్వామిక హక్కులను అణచివేసే ఉద్దేశంతో నే ఈ ఆర్డినెన్సును తీసుకువచ్చారని ఆక్షేపించిం ది. 41 భారతీయ ఆయుధ కర్మాగారాలను దెబ్బతీసేలా వాటిని ఏడు ఆచరణ సాధ్యంకాని కార్పొరేషన్లుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సిపిఐ తెలిపింది. సరైన ప్రణాళిక లేని ఈ విధాన నిర్ణయానికి వ్యతిరేకంగా రక్షణ రంగ ఉద్యోగులు పోరాడుతున్నారని సిపిఐ వెల్లడించింది. కేవలం 4 ప్రభుత్వ రంగ సంస్థలు (పిఎస్‌యు) మాత్రమే వ్యూహాత్మక రంగంలో ఉంటాయని మోడీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని, ఇలాంటి సమయంలో ఆర్డినెన్సును ఎందుకు జారీచేశారని మండిపడింది. వ్యూహాత్మక రంగంలో రక్షణ రంగం కూడా ఒకటి అని సిపిఐ గుర్తుచేసింది. రక్షణ రంగంలో ప్రస్తుతం 8 పిఎస్‌యులు పనిచేస్తున్నాయని, వీటికి 7 ఆయుధ కర్మాగార కార్పొరేషన్లు కలిస్తే మొత్తం 15 రక్షణ పిఎస్‌యులు ఉనికిలోకి వస్తాయని పేర్కొంది. మరి ఈ 15 పిఎస్‌యుల్లో ఏ నాలుగు వ్యూహాత్మకం అన్నది ప్రభుత్వానికే తెలియదని సిపిఐ ఎద్దేవా చేసింది. అంటే ప్రభుత్వ నిర్ణయం వల్ల 7 ఆయుధ కర్మాగారాల కార్పొరేషన్లు బలహీనపడతాయన్నది స్పష్టమని, అలా వాటిని ప్రైవేటుపరం చేయడానికి, అమ్మడం సులువు అవుతుందని జాతీయ కార్యదర్శివర్గం ఆరోపించింది. ఈ ముప్పును పసిగట్టిన రక్షణ రంగ ఉద్యోగుల కార్మిక సంఘాలు ఆయుధ కర్మాగారాలను, 76,000 మంది ఉద్యోగులను కాపాడటానికి ఏడాదికిపైగా పోరాటం చేస్తున్నారని సిపిఐ తెలిపింది. అయితే కార్మిక సంఘాల ప్రతిపాదనలు, ప్రాతినిధ్యాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడింది. పైగా బుజ్జగింపు చర్యలను కూడా అర్ధంతరంగా పక్కనపెట్టారని విమర్శించింది. ఐడి చట్టం 1947 కింద వివాదాన్ని పరిష్కరించడానికి బదులుగా మోడీ ప్రభుత్వం ఆర్డినెన్సు జారీచేయడం దురదృష్టకరమని జాతీయకార్యదర్శివర్గం వాపోయింది. సమ్మెకు పిలుపున్విడం, సమ్మెలో పాల్గొన్న కారణంగా విచారణ లేకుండానే ఉద్యోగులను తొలగించడం, అరెస్టు చేయడం, రెండేళ్ల వరకు ఖైదు చేయడంలాంటి హేయమైన నియమాలను ఇందులో పొందుపరిచిందని ధ్వజమెత్తింది. ప్రభుత్వ చర్యను ఖండిస్తున్నామని, ఇది ఉద్యోగుల న్యాయమైన హక్కులకు వ్యతిరేకమని స్పష్టంచేసింది. అత్యవసర రక్షణ సేవల ఆర్డినెన్సును రద్దుచేయాల్సిందేనని సిపిఐ డిమాండ్ చేసింది. ఆయుధ కర్మాగారాలు జాతి సంపదలని, కార్పొరేటీకరణ పేరుతో వాటిని మూసివేయడానికి, అమ్మివేయడానికి అంగీకరించబోమని, అందువల్ల కార్మిక సంఘాలతో చర్చించి, ఓ పరిష్కారానికి రావాలని సిపిఐ జాతీయ కార్యదర్శివర్గం ప్రభుత్వానికి సూచించింది. ఇలా ఉంటే ఆయుధ కర్మాగారాల్లో ఎలాంటి సమ్మెనైనా నిషేధిస్తూ జూన్ 30న కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్సును ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఎఐటియుసి) కూడా తప్పుపట్టింది. కాగా ఉద్యోగుల న్యాయమైన హక్కయిన సమ్మెను నిషేధించడం పిరికిపంద చర్య అని ఎఐటియుసి తెలంగాణ రాష్ట్ర సమితి అభిప్రాయపడింది.
ఇడిఎస్‌ఒను రద్దు చేయాల్సిందే
RELATED ARTICLES