ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు తీవ్రవాదుల మృతి, భారత పోస్టులపై పాక్ దళాల కాల్పులు
శ్రీనగర్: గణతంత్ర దినోత్సవ వేళ ఇటు తీవ్రవాదులు దాడులకు విఫలయత్నం చేశారు. అటు పాక్ మూకలు భారత సరిహద్దు పోస్టులే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డాయి. అయితే భారత సైన్యం రెండింటిని తిప్పికొట్టింది. శనివారం శ్రీనగర్‌లోని ఖోన్‌మోహ్ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ ఉగ్రవాదులు శ్రీనగర్‌లో జరుగుతున్న గణతంత్ర వేడుకలను లక్ష్యంగా చేసుకొని దాడి చేయాలని పథకం పన్నినట్లు అధికారులు చెప్పారు. వీరి వద్ద నుంచి రెండు ఎకె 47 రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకొన్నారు. శ్రీనగర్‌లోని రిపబ్లిక్ డే వేడుకలకు భారీ సంఖ్యలో అధికారులు హాజరయ్యారు. వీరి లక్ష్యంగా చేసుకొని దాడి చేయాలన్నది ఉగ్రవాదుల పథకం. తొలుత ఖోన్‌మోహ్ ప్రాంతంలో ఉగ్రవాదులు పొంచి ఉన్నారని సమాచారం అందుకున్న రాష్ట్రీయ రైఫిల్స్ జవాన్లు ఆ ప్రాంతాన్ని ముట్టడించి తీవ్రవాదులను మట్టుబెట్టారు.
జమ్ము కశ్మీర్ పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ దళాలు భారత పోస్టులు, సరిహద్దు గ్రామాలపై కాల్పులకు తెగబడ్డాయి. కాల్పులను ధీటుగా తిప్పికొట్టామని సైనికాధికారులు తెలిపారు. మన్‌కోటే, మెంధార్ ప్రాంతాలలో ఉదయం 10 గంటలకు పాక్ మూకలు మోటార్ షెల్లింగ్, చిన్నపాటి ఆయుధాలతో కాల్పులు జరిపాయని వెల్లడించారు. దీనిని భారత బలగాలు తిప్పికొట్టాయని, ఇరువైపులా కాల్పులు మధ్యాహ్నం 12:30 గంటల వరకు సాగాయని అధికారులు చెప్పారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పూంచ్ సెక్టార్‌లోని చకన్ ద బాగ్ వద్ద పాకిస్థాన్‌కు స్వీట్లు ఇవ్వలేదని తెలిపారు. జనవరి 1వ తేదీ నుంచి పాక్ కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది.
ఇటు ఉగ్రవాదులు.. అటు పాక్ మూకలు
RELATED ARTICLES